Patna | BPSC పరీక్ష రద్దుకు డిమాండ్; నిరసనకారులపై లాఠీ చార్జి
x

Patna | BPSC పరీక్ష రద్దుకు డిమాండ్; నిరసనకారులపై లాఠీ చార్జి

నిరసనకారులకు మద్దతు తెలిపిన జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌, మరో ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు 700 మంది గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదైంది.


బీహార్‌ రాజధాని పట్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC) పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాలంటూ ఆదివారం నిరసనకారులు గాంధీ మైదాన్ రోడ్‌లో నిరసన చేపట్టారు. ఆందోళన విరమించాలని కోరినా.. వినకపోవడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. సాయంత్రం జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదానానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. ఆయన నేతృత్వంలో వారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కలిసేందుకు ఆయన నివాసం వైపు మార్చ్ ప్రారంభించారు. జేపీ గోలంబర్ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో నిరసనకారులనుద్దేశించి ప్రశాంత్ కిషోర్ కాసేపు మాట్లాడారు. "విద్యార్థుల సమస్యలు వినడానికి కూడా సీఎంకు సమయం లేదు. పరీక్ష రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగుతుంది. అన్యాయం జరిగిన విద్యార్థులకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా" అని అన్నారు. వెనక్కు వెళ్లాలని కోరిన పోలీసులకు, నిరసనకారులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరకు వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది వాటర్ కానన్లను ప్రయోగించారు.

ప్రశాంత్ కిషోర్‌తో పాటు 700మందిపై కేసు నమోదు..

పోలీసులు ప్రశాంత్ కిషోర్, పట్నాకు చెందిన ఉపాధ్యాయులు రమాన్షు మిశ్రా, రోహన్ ఆనంద్‌తో సహా 600-700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. గాంధీ మైదానంలో నిరసన చేపట్టేందుకు అనుమతి లేదని హెచ్చరించినా.. అక్కడ సమావేశమయ్యారని అని జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.

పోరాటం మా హక్కు..

ఒక BPSC అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వం మాతో ఇలా వ్యవహరిస్తుందని మేం అసలు ఊహించలేదు. మా హక్కుల కోసం పోరాడుతున్నాం. రాజకీయ ప్రయోజనాల కోసం మా నుంచి లబ్ధి పొందేందుకు వచ్చే వారితో మాకు సంబంధం లేదు." అని తెలిపారు.

పరీక్ష పత్రం లీక్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష మళ్లీ నిర్వహించాలని సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story