కేంద్రం విజ్ఞప్తిని అంగీకరించని సుప్రీంకోర్టు.. ఏ విషయంలో..?
రాష్ట్రాలకు రాయల్టీ చెల్లించే విషయంలో కేంద్రం చేసిన విన్నపాన్ని సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. పాత తేదీలతోనే రాయల్టీని వచ్చే 12 సంవత్సరాలలో చెల్లించాలని..
ఖనిజాలను కలిగి ఉన్న భూములు, ఖనిజ హక్కుల రాయల్టీ విషయంలో రాష్ట్రాలకే పూర్తి హక్కులు ఉన్నాయని, పాత తేదీతో కేంద్రం వసూలు చేసిన రాయల్టీని కేంద్రం తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు జూలై 25న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వీటిని 1989 ని ఆధార సంవత్సరంగా తీసుకుని రాష్ట్రాలకు రాయల్టీని కేంద్రం నుంచి రాబట్టుకోవాలని కొన్ని ప్రభుత్వాలు కోరాయి. దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేవలం ఈ సంవత్సరం నుంచి మాత్రమే రాయల్టీని రాష్ట్రాలు వసూలు చేసుకోవాలని సుప్రీంకోర్టుని కోరింది. అయితే ఈ ప్రతిపాదనలను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కేవలం 2005, ఏప్రిల్ 1 ను ఆధారంగా తీసుకోవాలని సూచించింది.
జులై 25 నాటి తీర్పు భవిష్యత్ పై ప్రభావం చూపుతుందని కేంద్రం చేసిన వాదనను తిరస్కరించినట్లు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, అభయ్ ఎస్ ఓకా, బివి నాగరత్న, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా, ఉజ్జల్ భుయాన్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసిహ్ లు ఈ ధర్మాసనంలో ఉన్నారు.
వచ్చే 12 ఏళ్లలో ఖనిజాలు అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం, మైనింగ్ కంపెనీలు బకాయిలు చెల్లించవచ్చని పేర్కొంది. అయితే బకాయిల చెల్లింపుపై ఎలాంటి జరిమానా విధించవద్దని బెంచ్ రాష్ట్రాలను ఆదేశించింది.
1989 నుంచి గనులు, ఖనిజాలపై విధించిన రాయల్టీని వాపసు చేయాలన్న రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం వ్యతిరేకించింది, ఇది పౌరులపై ప్రభావం చూపుతుందని, ప్రాథమిక అంచనాల ప్రకారం PSU లు తమ ఖజానా నుంచి రూ. 70,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఖనిజ హక్కులపై పన్నులు విధించే అధికారాన్ని రాష్ట్రానికి కల్పిస్తూ జూలై 25న ఇచ్చిన తీర్పును మెజారిటీతో నిర్ణయించిన ధర్మాసనంలోని ఎనిమిది మంది న్యాయమూర్తులు ఈ తీర్పుపై సంతకం చేస్తారని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.
జూలై 25 తీర్పులో జస్టిస్ నాగరత్న భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందున ఈ తీర్పుపై సంతకం చేయరని ఆయన అన్నారు. జూలై 25న 8:1 మెజారిటీ తీర్పులో, ఖనిజ హక్కులపై పన్ను విధించే శాసనాధికారం రాష్ట్రాలకు ఉందని ధర్మాసనం పేర్కొంది.
ఖనిజాలు, ఖనిజాలను కలిగి ఉన్న భూమిపై రాయల్టీని విధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని 1989 నాటి తీర్పును తోసిపుచ్చింది. 1989 తీర్పు నుంచి కేంద్రం విధించిన రాయల్టీని, మైనింగ్ కంపెనీల నుండి పన్నులను వాపసు చేయాలని కొన్నిసంపన్న రాష్ట్రాలు కోరాయి. అయితే ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నవి కావడం గమనార్హం. రీఫండ్ విషయం జూలై 31న విచారించగా, ఆర్డర్ రిజర్వ్ చేసి ఈ రోజు ప్రకటించారు.
Next Story