కనువిందు చేస్తున్న కర్ణాటకలోని జోగ్ వాటర్ ఫాల్స్..
x

కనువిందు చేస్తున్న కర్ణాటకలోని జోగ్ వాటర్ ఫాల్స్..

తొలిదశ పనులు పూర్తి..2026 నాటికి రెయిన్ డ్యాన్స్ జోన్, మ్యూజికల్ ఫౌంటెన్, జెయింట్ ఫెర్రిస్ వీల్, మ్యూజియం నిర్మాణం..


ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన జలపాతాలలో కర్ణాటక రాష్ట్రంలోని జోగ్ జలపాతం (Jog Falls) ఒకటి. శివమొగ్గ(Shimoga) జిల్లాలో ఉన్న ఈ వాటర్‌ఫాల్స్‌ను తిలకించేందుకు వీలుగా వ్యూయింగ్ టవర్ నిర్మించారు. తొలి దశ పనులు దాదాపు పూర్తవ్వడంతో సందర్శకులను అనుమతిస్తున్నారు.

యడియూరప్ప హయాంలో నిధుల విడుదల..

కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప(BS Yediyurappa) హయంలో ఈ జలపాతం అభివృద్ధికి రూ.185 కోట్లు కేటాయించారు. కర్ణాటక పర్యాటక శాఖ, శివమొగ్గ జిల్లా పరిపాలన, జోగ్ డెవలప్‌మెంటల్ అథారిటీ సంయుక్త ఆధ్వరంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను శంకర్ నారాయణ సంస్థ దక్కించుకుంది. ప్రస్తుతానికి తొలిదశ పనులు పూర్తికావడంతో సందర్శకులను అనుమతిస్తున్నారు.


భారీ వర్షాల కారణంగా ఆలస్యం..

వాస్తవానికి ఈ ప్రాజెక్టు నవంబర్ 2024 నాటికి పూర్తి కావాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. నవంబర్ 2025 వరకు గడువు పొడిగించాలని కాంట్రాక్టర్ అడగడంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. నిధులు విడుదలలో కూడా జాప్యం లేకపోవడంతో 2026లోపు పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.


నిర్మాణంలో చిల్డ్రన్స్ పార్క్,రెస్టింగ్ లాంజ్‌..

ఆధునిక ప్రవేశ ద్వారం గుండా ప్రత్యేకంగా రూపొందించిన వ్యూయింగ్ టవర్‌ వరకు నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ టవర్‌ నుంచి జలపాతాన్ని వీక్షించే సందర్శకులు ముందుగా షాపింగ్ కాంప్లెక్స్‌ తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఇక వినోదం కోసం పిల్లల పార్కు, స్నాక్ కౌంటర్లు, రెస్టింగ్ లాంజ్‌ నిర్మాణంలో ఉన్నాయి.

రోప్‌వే కూడా..

జలపాతం ముందు నుంచి చారిత్రాత్మక బ్రిటీష్ బంగ్లా వరకు రోప్‌వే(Ropeway) ఏర్పాటు చేస్తున్నారు. జలపాతానికి సమీపంలోని తలకలలే ఆనకట్ట వద్ద బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ కోసం ఏర్పాటు జరుగుతున్నాయి.

దశలవారీగా అభివృద్ధి

మొదటి దశలో పూర్తయినవి: వ్యూయింగ్ టవర్, షాపింగ్ కాంప్లెక్స్, నడక మార్గం, టికెట్ కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు. కాగా రెండో దశ పనులు ఇటీవల మొదలయ్యాయి. దాదాపు 80 గదులతో కూడిన స్టార్ హోటల్ నిర్మాణం, సందర్శకుల వాహనాల కోసం పార్కింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రానున్న రోజుల్లో..

ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భవిష్యత్తులో మరికొన్ని పనులు చేపట్టనున్నారు. రెయిన్ డ్యాన్స్ జోన్, మ్యూజికల్ ఫౌంటెన్, గ్లాస్ హౌస్, జెయింట్ ఫెర్రిస్ వీల్ ఏర్పాటు చేయనున్నారు. జలపాతం, స్థానిక జలవిద్యుత్ ఉత్పత్తిపై సమగ్ర సమాచారాన్నిచ్చే మ్యూజియం నిర్మాణం కూడా జరుగనుంది.

Read More
Next Story