ఇక నుంచి మహిళలతో 'ఊబర్ మోటో’
బెంగళూరులో 'ఊబర్ మోటో ఉమెన్' ప్రారంభం
భారతదేశంలోని ప్రముఖ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ ‘‘ఊబర్’’ మరో నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ‘‘ఊబర్ మోటో ఉమెన్’’ సేవలను అందుబాటులోకి తెచ్చింది. చాలా మంది మహిళల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. లేడీ డ్రైవర్లతోనే ప్రయాణం చేయాలనుకునే మహిళలు ఊబర్ మోటో ఉమెన్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది.
అందుబాటులోకి రియల్-టైమ్ ట్రాకింగ్ ..
భద్రత దృష్ట్యా మహిళా ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను గరిష్ఠంగా ఐదుగురు నమ్మకమైన వ్యక్తులతో పంచుకునేలా రియల్-టైమ్ ట్రాకింగ్ కూడా సంస్థ అందుబాటులోకి తెచ్చింది. మహిళా ప్రయాణికులు, డ్రైవర్లకు 24x7 సెక్యూరిటీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉండేలా చర్యలు కూడా తీసుకుంది. ఒక్క బెంగళూరులోనే నెలకు 1 మిలియన్ రైడ్‌లను నమోదు చేసి దేశంలోనే అతి పెద్ద బైక్ టాక్సీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది ఉబర్.
ఉబర్ గురించి క్లుప్తంగా..
ఊబర్ సేవలు తొలుత అమెరికాలో ప్రారంభమయ్యాయి. 2009లో ఇద్దరు వ్యాపారవేత్తలు గారెట్ క్యాంప్, ట్రావిస్ కలానిక్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉబర్ సర్వీసును అందుబాటులోకి తెచ్చారు. మొదట UberCab పేరుతో ప్రారంభించి.. 2010లో దాన్ని Uber గా మార్చారు. ఆ తర్వాత ఊబర్ సేవలు 2014 నాటికి చాలా దేశాలకు విస్తరించాయి. ఇప్పటివరకు 70కి పైగా దేశాలు, 10వేలకు పైగా నగరాల్లో సేవలందిస్తోంది. ఉబర్‌తో జతకట్టి ఆటోడ్రైవర్లు, బైకర్లు స్వయం ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు సైతం ఉబర్ సేవలను వినియోగించుకుంటున్నాయి. త్వరలో ఊబర్ మోటో ఉమెన్ సేవలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంతో మంది యువకులకు స్వయం ఉపాధి చూపుతున్న ఉబర్.. నిరుద్యోగ మహిళలకు ఉపాధి దొరికే ఛాన్స్ ఉంది.