
బాధ్యతాయుతమైన వ్యాజ్యదారు గా ప్రభుత్వం మారనుందా?
న్యాయశాఖ పటిష్టతకు కూటమి ప్రభుత్వం కీలక చర్యలు. ‘ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025’ రూపకల్పనలో మంత్రివర్గ ఉపసంఘం.
రాష్ట్ర ప్రభుత్వం, దాని శాఖలు కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో దాఖలు చేసే లేదా ఎదుర్కొనే వ్యాజ్యాలను సమర్థవంతంగా నిర్వహించడానికి కార్యాచరణ మొదలైంది. అనవసరమైన కేసులను తగ్గించడానికి, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి రూపొందించే సమగ్ర విధానం ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ. జాతీయ లిటిగేషన్ పాలసీ-2010 ఆధారంగా అనేక రాష్ట్రాలు (రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వంటివి) ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఏపీలో కూడా ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం ‘బాధ్యతాయుతమైన వ్యాజ్యదారు’గా మారాలని లక్ష్యం పెట్టకుంది.
రాష్ట్రంలో న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు త్వరిత న్యాయం అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం (ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ-2025)ను రూపొందించడానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం వెలగపూడి సచివాలయంలో భేటీ అయి విస్తృత చర్చలు జరిపింది. న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్‌లు ఈ సమావేశంలో పాల్గొని న్యాయశాఖ ఉన్నతాధికారులతో కలిసి కీలక నిర్ణయాలకు రూపకల్పన చేశారు.
న్యాయ శాఖలో ప్రజా వ్యాజ్యాలు అంటే ఏమిటి?
ప్రభుత్వ శాఖలు లేదా అధికారుల పక్షం లేదా ప్రతివాదిగా ఉన్న కేసులను ‘ప్రజా వ్యాజ్యాలు’ అంటారు. ఇవి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PIL) కాదు. ప్రభుత్వం-ప్రజల మధ్య ఉత్పన్నమయ్యే ఉద్యోగుల సేవలు, భూములు, ఒప్పందాలు, ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై వచ్చే వ్యాజ్యాలు ఇందులో భాగం. ఇవి దేశవ్యాప్తంగా కోర్టు పెండెన్సీలో భారీ వాటా కలిగి ఉంటాయి.
అప్పీళ్లు న్యాయంగా దాఖలు చేయడం, విధానపరమైన జాప్యాల తొలగింపు ఎలా?
త్వరిత పరిష్కారం అంటే కేసుల పెండెన్సీ తగ్గించి, సకాలంలో తీర్పులు ఇవ్వడం. ముందస్తు కేసు నిర్వహణ (pre-litigation case management) ద్వారా అవసరమైన అప్పీళ్లు మాత్రమే న్యాయంగా దాఖలు చేయాలి. అనవసరమైన టెక్నికల్ అభ్యంతరాలు, రొటీన్ అప్పీళ్లు నివారించాలి. విధానపరమైన జాప్యాలు అంటే శాఖల స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ఆలస్యాలు, ప్రొసీజరల్ లోపాల వల్ల వ్యాజ్యాలు పుట్టడం. ఇవి తొలగించడానికి పాలనా స్థాయిలో సమీక్ష, సమన్వయం, జవాబుదారీతనం పెంచడం జరుగుతుంది.
లోక్ అదాలత్‌లను సంస్థాగతీకరించడం అంటే ఏమిటి?
లోక్ అదాలత్ అనేది ‘ప్రజల కోర్టు’. లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం-1987 ప్రకారం ఏర్పాటైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక. ఇక్కడ మధ్యవర్తిత్వం ద్వారా రాజీపడి కేసులు పరిష్కరించవచ్చు. తీర్పు ఫైనల్, బైండింగ్ చేస్తారు. మంత్రుల ఉప సంఘం దీనిని నిర్మాణాత్మకమైన వ్యవస్థగా, ఎక్కువ సంఖ్యలో నిర్వహించి, వ్యాజ్యాల భారం తగ్గించాలని సూచించింది.
మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ మాట్లాడుతూ “అనవసర వ్యాజ్యాలను తగ్గించి, కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మంత్రుల సంఘం సూచనలు చేస్తుంది. ముందస్తు కేసు నిర్వహణ ద్వారా అప్పీళ్లను న్యాయంగా దాఖలు చేయడం, విధానపరమైన జాప్యాలను తొలగించడం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాన్ని ప్రోత్సహించడం, లోక్ అదాలత్‌లను సంస్థాగతీకరించడం వంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది” అని స్పష్టం చేశారు.
మంత్రులు ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న లిటిగేషన్ పాలసీలను కూలంకషంగా పరిశీలించి, అక్కడి సంస్కరణలు, విజయాలను ఏపీలో అమలు చేయాలని న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి, ఇతర అధికారులకు సూచించారు. ఈ పాలసీ అమలు ద్వారా న్యాయశాఖను మరింత పటిష్టం చేసి, ప్రజలకు త్వరిత, సమర్థవంతమైన న్యాయం అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సమావేశంలో న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల ఆధారంగా త్వరలో పాలసీ రూపకల్పన పూర్తి చేసి అమలు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది రాష్ట్ర న్యాయవ్యవస్థకు కొత్త ఊపిరి అందించే మైలురాయి అని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

