
ఎన్నికల సమరంలో అన్నాడీఎంకే ఉచితాల వ్యూహం ఫలిస్తుందా?
తమ పథకాలను కాపీ కొడుతున్నారంటున్న డీఎంకే నేతలు
తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)ను దృష్టిలో పెట్టుకుని అన్నాడీఎంకే(AIADMK) పార్టీ ప్రజాకర్షక సంక్షేమ పథకాల చుట్టూ రాజకీయ వ్యూహాన్ని నిర్మిస్తోంది. అధికార డీఎంకే(DMK)తో నేరుగా పోటీ పడాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే అమలులో ఉన్న పథకాలనే మరింత విస్తృతంగా అందిస్తామన్న హామీలతో మ్యానిఫెస్టో సిద్ధం చేసింది. మహిళలు, గ్రామీణ వర్గాలు, పట్టణ ఓటర్లను ఒకేసారి ఆకర్షించేలా మ్యానిఫెస్టో రూపొందించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
డీఎంకే ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని మహిళలకు ఆర్థిక సాయం పెంపు, పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, గృహ నిర్మాణ పథకం కొనసాగించడం అన్నాడీఎంకే చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే అన్నాడీఎంకే తమకు కాపీ కొడుతోందని డీఎంకే నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
డీఎంకే మోడల్‌కే సవాల్..
చెన్నైలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామి ప్రకటించిన ఐదు కీలక హామీలు డీఎంకే అమలు చేస్తున్న సంక్షేమ మోడల్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ‘కుల విలక్కు’ పథకం కింద నెలకు రూ.2వేల సాయం, ఉచిత బస్సు ప్రయాణం, గ్రామీణ ఉపాధి పనిదినాల పెంపు వంటి హామీలు అధికార పార్టీకి రాజకీయ సవాల్‌గా మారాయి.
డీఎంకే ప్రవేశపెట్టిన ‘కలైంజర్ మగళిర్ ఉరిమై తొగై’ పథకాన్ని మించిపోయేలా కొత్త పథకాన్ని ప్రకటించడం ద్వారా, “డీఎంకే చేస్తున్నదానికన్నా ఎక్కువ మేమిస్తాం” అన్న సందేశాన్ని ఓటర్లకు ఇవ్వాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది.
ఆరోపణలు–ప్రత్యారోపణలు..
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా అన్నాడీఎంకే మ్యానిఫెస్టోను “ నకిలీ”గా అభివర్ణిస్తూ రాజకీయ దాడికి దిగారు. గతంలో ఇదే పథకాలను విమర్శించిన పళనిస్వామి.. ఇప్పుడు వాటినే అమలు చేస్తామంటూ చెప్పడం అవకాశవాద రాజకీయమని విమర్శించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్మిక వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చిన పార్టీ గ్రామీణ ఉపాధి గురించి మాట్లాడటం వ్యంగ్యమని రాజా వ్యాఖ్యానించారు.
దీనికి ప్రతిస్పందనగా పళనిస్వామి డీఎంకే పాలనపై ఎదురుదాడి చేశారు. తమ పాలనలోనే సంక్షేమం, ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగిందని, డీఎంకే పరిపాలనలోనే అప్పులు పెరిగాయని ఆయన ఆరోపించారు. కోవిడ్ సమయంలోనూ సమర్థంగా పాలన సాగించామని చెప్పడం ద్వారా పరిపాలనా సామర్థ్యాన్ని ప్రధాన రాజకీయ అజెండాగా ముందుకు తెస్తున్నారు.
ఉచితాలే కీలకం..
తమిళనాడు రాజకీయాల్లో సంక్షేమ పథకాలు ఎప్పటికీ కీలకమే. ఈ ఎన్నికల్లో ఆ సంప్రదాయం మరింత తీవ్రమవుతోంది. డీఎంకే నెలవారీ నగదు సాయం, ఉచిత సదుపాయాల ద్వారా ఇప్పటికే బలమైన ప్రజాదరణను సంపాదించిందన్న అభిప్రాయం ఉంది. అయితే అదే మార్గాన్ని అన్నాడీఎంకే మరింత ఆకర్షణీయంగా చూపించే ప్రయత్నం చేస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో.. డీఎంకే–అన్నాడీఎంకే మధ్య ఉచితాల పోటీ మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు అంశం, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు కూడా ఈ ఎన్నికల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.
ఎన్నికల హామీలకు ఓటర్లు తలొగ్గుతారా?
ఎన్నికల వాగ్ధానాలు నిజంగా ఓట్లుగా మారతాయా? లేక అధికార పార్టీపై ఉన్న అసంతృప్తే ఫలితాన్ని నిర్ణయిస్తుందా అన్నది ఎన్నికల వరకూ సస్పెన్షనే. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం.. తమిళనాడు ఎన్నికల రాజకీయాల్లో అభివృద్ధికన్నా సంక్షేమం, ప్రజాదరణే ప్రధాన కేంద్రబిందువుగా మారింది.

