
కేరళ నర్సుకు యెమెన్ లో ఉరిశిక్ష ఎందుకు?
పాలక్కాడ్ జిల్లాలోని ఓ సాదాసీదా కుటుంబానికి చెందిన నిమిష ప్రియ ఆత్మరక్షణార్థం చేసిన ఓ పని ఇప్పుడు ఆమె తలకు వెలకట్టేలా చేసింది.
కేరళ నర్సుకు ఉరిశిక్ష వార్త ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. పాలక్కాడ్ జిల్లాలోని ఓ సాదాసీదా కుటుంబానికి చెందిన నిమిష ప్రియ ఆత్మరక్షణార్థం చేసిన ఓ పని ఇప్పుడు ఆమె తలకు వెలకట్టేలా చేసింది. యెమెన్‌లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఆమెకు విధించిన మరణశిక్ష దాదాపు ఖరారు అయింది. ఈ నెల 16న శిక్ష అమలు చేయనున్నట్లు యెమెన్ జైలు అధికారులు ఆమె కుటుంబానికి తెలియజేయడం, ఆ కుటుంబాన్ని తీవ్ర ఉద్విగ్నతలోకి నెట్టింది.
అసలు ఎవరీమే...
సరిగ్గా 15 ఏళ్ల కిందట 2008లో నర్సు విద్యను పూర్తి చేసి ఉద్యోగావకాశాల కోసం నిమిష యెమెన్ వెళ్లారు. అక్కడే ఆమె ఉద్యోగంలో చేరి, 2011లో వివాహం చేసుకున్నారు. భర్తతో కలిసి ఓ క్లినిక్ ప్రారంభించాలనే లక్ష్యంతో, స్థానికుడు తలాల్ అదిబ్ మెహదిని వ్యాపార భాగస్వామిగా ఎన్నుకున్నారు. నిబంధనల కారణంగా వ్యాపారంలో స్థానిక భాగస్వామ్యం అవసరం. థామస్ దంపతులు మెహదితో కలిసి "అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్"ను ప్రారంభించారు. కాలక్రమంలో ఆమె భర్త, కుమార్తె భారత్‌కు తిరిగివచ్చారు. కానీ నిమిష యెమెన్‌లోనే ఉండి వ్యాపార కేంద్రాన్ని కొనసాగించారు. ఆ సమయంలో నిమిషపై తలాల్ మెహది వేధింపులకు తెగబడ్డారు. ఆమెను తన భార్యగా ప్రకటించారు. పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. శారీరక వేధింపులకు పాల్పడ్డారు.
2016లో నిమిష పోలీసులకు ఫిర్యాదు చేసినా, అక్కడి వ్యవస్థ ఆమెను పట్టించుకోలేదు. చివరికి 2017లో తన పాస్‌పోర్టును తిరిగి పొందాలన్న ఉద్దేశంతో, మెహదికి మత్తుమందు ఇచ్చారు. ఆ మత్తుమందు వికటించి అతను చనిపోయారు. దీంతో ఆమె తలాల్ అదిబ్ మృతదేహాన్ని వాటర్ ట్యాంక్‌లో పడేశారు. సౌదీ అరేబియాకు పారిపోవడానికి ప్రయత్నిస్తూ పట్టుబట్టారు.
న్యాయం లేదా ప్రతీకారం?
ఈ కేసును సుదీర్ఘకాలం విచారించిన యెమెన్ న్యాయవ్యవస్థ 2020లో ఆమెకు మరణశిక్ష విధించింది. తాజాగా అధ్యక్షుడు రషాద్ అల్ అలిమి కూడా ఆ శిక్షను ఆమోదించడంతో, ఇక నిమిష ప్రాణాలు ఒక్క భారత ప్రభుత్వ చొరవపైనే ఆధారపడినట్టయ్యాయి.
ఆమెను కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ మాత్రం వెల్లడించినప్పటికీ, యెమెన్ అధికారుల తాజా చర్యల నేపథ్యంలో ఆ ఆశలు సన్నగిల్లాయి. నిమిష చేసిన తప్పు క్షమించదగినదేమో అనే ప్రశ్నను పక్కన పెట్టినా… ఆమె చేసిన చర్యలు స్వీయరక్షణ కోణంలో, వ్యవస్థల వైఫల్యాన్ని నిలదీయడానికే చేసినవన్న వాదనలు దేశంలో ఊపందుకుంటున్నాయి.
ఒక దేశంలో, ఒక మహిళను వేధించి, బంధించి ఉంచిన తరువాత… ఆమె తప్పులకూ, ఆ పరిస్థితులకు కారణమైన వ్యవస్థలకూ మధ్య తేడా చూడగలిగితే… అది నిజమైన న్యాయమవుతుంది. ఆమెను శిక్షించడం కంటే, అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఇతర విదేశీ మహిళలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వాల కర్తవ్యమవుతుందన్న వాదనలకు బలం చేకూరుతుంది.
నిమిష ప్రియ జీవిత కథ, అనేక కోణాలనూ ప్రశ్నిస్తుంది
న్యాయం అంటే ఏమిటి? ఒక తప్పు చేసిన మహిళకు మరణమే శిక్షా? స్వేచ్ఛ కోసం చేసిన పోరాటం ఈ స్థాయిలో శిక్షించబడాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు, నిమిష ప్రాణాలను కాపాడటంతోనే మొదలవుతాయి.
Next Story