
ఈ జనవరిలో చెన్నై ఊటీలా ఎందుకు చల్లగా ఉంది?
మాజీ IMD అధికారి ఎస్. బాలచంద్రన్ వివరణ
ఈ జనవరిలో చెన్నై(Chennai) వాతావరణం(Weather) సాధారణానికి కాస్త భిన్నంగా ఉంది. చలి గాలులు, మేఘావృతమైన ఆకాశం, అడపాదడపా వర్షాలు.. నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేశాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల వెళ్లిపోయిన తర్వాత చెన్నైలో తేలికపాటి, ఎండలతో కూడిన జనవరి కనిపిస్తుంది. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వాతావరణ శాఖ మాజీ అధికారి ఎస్. బాలచంద్రన్ తెలిపారు.
ఈ పరిస్థితులకు కారణాలను విశ్లేషించారు ది ఫెడరల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం మాజీ అదనపు డైరెక్టర్ జనరల్ బాలచంద్రన్.
బలహీనపడని రుతుపవనాలు..
‘‘ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా డిసెంబర్ చివరికి బలహీనపడతాయి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో వాటి తిరోగమనం ఆలస్యమైంది. ఈసారి జనవరి 19 వరకు రుతుపవనాల ప్రభావం కొనసాగింది. దీని వల్ల చెన్నైలో మేఘాలు, గాలులు ఎక్కువయ్యాయి.’’ అని వివరించారు.
శ్రీలంక సమీపంలో అల్పపీడనం..
శ్రీలంక సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ వ్యవస్థ వల్ల ఉత్తర దిశ నుంచి బలమైన గాలులు తమిళనాడు తీరానికి చేరాయి. “ఉత్తర గాలులు బలపడితే చలి ఎక్కువగా అనిపిస్తుంది” అని చెప్పారు.
గాలుల వల్ల పెరిగిన ‘చలి అనుభూతి’..
నిజమైన ఉష్ణోగ్రత కంటే గాలుల వేగం వల్ల చలి ఎక్కువగా అనిపించిందని బాలచంద్రన్ వివరించారు. ఫ్యాన్ లేదా కదులుతున్న వాహనం వద్ద ఉన్నప్పుడు చలి ఎక్కువగా అనిపించేదానిలాగే, ఈసారి గాలులు చెన్నైలో ‘ఫీల్డ్ టెంపరేచర్’ను తగ్గించాయని చెప్పారు.
మేఘావృతం వల్ల ఉష్ణోగ్రతలో వ్యత్యాసం..
ఈ జనవరిలో మరో ముఖ్య లక్షణం రోజువారీ గరిష్ట–కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య తేడా తగ్గిపోవడమే. జనవరి 12న ఈ తేడా కేవలం 2.3 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితమైంది. మేఘాలు, వర్షాల కారణంగా పగలు వేడి పెరగకపోవడం, రాత్రి చలి ఎక్కువగా తగ్గకపోవడం ఇందుకు కారణమని ఆయన చెప్పారు.
ఇది అసాధారణమా?
సాధారణంగా జనవరిలో చెన్నైలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29–30 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీలు ఉంటుంది. ఈసారి గరిష్టంగా 26–27 డిగ్రీలే నమోదవడం, గాలుల ప్రభావంతో చలి ఎక్కువగా అనిపించిందన్నారు.
ఈ సారి ఎండలు దంచేస్తాయా?
ప్రస్తుత వాతావరణ మార్పును బట్టి వేసవి మరింత వేడిగా ఉంటుందన్న భావనకు శాస్త్రీయ ఆధారాలు లేవని బాలచంద్రన్ స్పష్టం చేశారు. ప్రతి కాలానికి వేర్వేరు వాతావరణ అంశాలు పని చేస్తాయని, ఒక కాలాన్ని బట్టి మరో కాలాన్ని నిర్ణయించలేమన్నారు. వాతావరణ మార్పు అనేది దీర్ఘకాలిక (30 ఏళ్లకు పైగా) సగటుల్లో వచ్చే మార్పుల ఆధారంగా అంచనా వేయాల్సి ఉంటుందన్నారు. అయితే చెన్నైలో భూ వినియోగం, నిర్మాణాలు పెరగడం వల్ల స్థానిక వాతావరణంలో మార్పులు క్రమంగా కనిపిస్తున్నాయని చెప్పారు.
మొత్తంగా, ఆలస్యమైన రుతుపవనాలు, శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం, బలమైన గాలులు, మేఘావృతం.. అన్నీ కలిసి ఈ జనవరిలో చెన్నైను ‘ఊటీలా’ చల్లగా మార్చాయని బాలచంద్రన్ తెలిపారు.

