
భూమి సమస్యలు 80 శాతం ఎందుకు పెరిగాయి?
ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలు: రాజకీయ ఆరోపణలు, పరిష్కారాల లోపాలు. ఒక విధంగా పాలకులే కారకులు.
ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలు ఇటీవలి కాలంలో మరింత తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 80 శాతం అర్జీలు భూ సమస్యలపైనే వస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో చేసిన పనులను చంద్రబాబు తనవిగా చెప్పుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శిస్తున్నారు. రెండు ప్రభుత్వాల హయాంలోనూ రీ-సర్వేలో లోపాలు, భూ పార్సిల్ నంబర్ల కేటాయింపులో తప్పులు, పాస్‌బుక్‌లలో కొలతల అసమానతలు వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూ సమస్యలపై విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే...
రాజకీయ ఆరోపణల మధ్య ప్రజల బాధలు
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రీ-సర్వేలో భారీ ఖర్చులు చేసి, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు వేయించుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇందుకు రూ.660 కోట్లు ప్రజల సొమ్ము ఖర్చు చేశారని ఆరోపించారు.
నవరత్నాల ఆధారంగా అధికారంలోకి తన ప్రభుత్వం వచ్చిందని, సర్వే రాళ్లపై లోగో మాత్రమే వేశామని, తన ఫొటో వేసుకోలేదని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు. అయితే రెండు ప్రభుత్వాలు రీ-సర్వేలో లోపాలు చేశాయని, భూ రికార్డులు సరిచేయడంలో విఫలమయ్యాయని ప్రజల ఫిర్యాదులు చెబుతున్నాయి.
రేపల్లె రూరల్ మండలంలో ఒక మహిళ భూమి సమస్యపై ఇచ్చిన అర్జీని పరిశీలిస్తున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 2027 నాటికి రీ-సర్వేను పూర్తి చేసి, క్యూఆర్ కోడ్‌లు, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రికార్డులను ట్యాంపర్ ప్రూఫ్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత ప్రభుత్వంలో 6,693 గ్రామాల్లో సర్వే పూర్తయినా మిగిలిన 10,123 గ్రామాల్లో సర్వే పెండింగ్ ఉందని అధికారులు చెబుతున్నారు. ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌ల (ఎల్‌పీఎమ్)లో అసమానతలు, డాటెడ్ ల్యాండ్‌ల సమస్యలు, సెక్షన్ 22ఏ కింద తప్పుగా ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వంటివి ప్రధాన సమస్యలు.
మ్యుటేషన్‌లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం
కుటుంబ యజమాని మరణించిన తర్వాత వారసులకు మ్యుటేషన్ చేయించుకునేటప్పుడు పేర్లు మారిపోతున్నాయి. సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరిదిద్దలేకపోతున్నారు. ఇటువంటి లోపాలకు అధికారులే కారణమని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇవి జరుగుతున్నాయని ఫిర్యాదుదారులు అంటున్నారు. రెవెన్యూ విభాగంలో రాజకీయ జోక్యం, పాత రికార్డుల లోపాలు ఈ సమస్యలను మరింత పెంచుతున్నాయి. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి గ్రామంలో గోరంట్ల మల్లేశ్వరి అనే మహిళా రైతుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఆమె 8 సంవత్సరాల క్రితం చనిపోయింది. మ్యుటేషన్ కు దరఖాస్తు చేస్తే ఆమె భర్త గోరంట్ల పెద్ద వెంకటేశ్వర్లు పేరుపై రావాల్సిన పట్టాదార్ పాస్ పుస్తకం గోరంట్ల పెద్ద కోటయ్య పేరుతో వచ్చింది. పాస్ పుస్తకంపై పెద్ద వెంకటేశ్వర్లు ఫొటో, కింది భాగంలో ఆయన డిజిటల్ సంతకం ఉన్నాయి. ఎన్ని సార్లు అభ్యర్థించినా నేటికీ ఆయన పేరు పాస్ పుస్తకంలో సరిదిద్దలేదు. అలాంటప్పుడు సమస్యలు భూమిపై కాకుండా ఎలా వస్తాయని పెద్దవెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నారు.
భూమిపై బూచోళ్లు...
నిపుణులు, యాక్టివిస్టుల స్పందనలు
భూ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను 'ప్రెపోస్టరస్' అంటూ విమర్శించారు. తన తల్లిదండ్రుల భూమి మ్యుటేషన్ అభ్యర్థనను అధికారులు తిరస్కరించారని, 36 ఏళ్లు రాష్ట్రానికి సేవ చేసిన తనకే ఇలా జరిగితే సామాన్య రైతుల పరిస్థితి ఊహించుకోవచ్చని అన్నారు. "నా తల్లిదండ్రుల భూములపై నా హక్కును యాక్ట్ అమలు కాకముందే తిరస్కరించారు. సామాన్య రైతుల బాధలు ఎంతో ఊహించుకోవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ సంస్కరణలు పారదర్శకంగా ఉండాలని, యజమాని హక్కులను రక్షించాలని సూచించారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, యాక్టివిస్ట్ ఇఏఎస్ శర్మ ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యలపై తీవ్రంగా స్పందిస్తుంటారు. వరుణ్ హాస్పిటాలిటీకి అక్రమాలు, అనుమతుల్లో పక్షపాతం ఉందని ఆరోపించారు. పబ్లిక్ ల్యాండ్‌లపై సమాచారం బహిర్గతం చేయాలని, భూ కుంభకోణాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అమరావతి ప్రాజెక్టుకు నిధులు ఇతర జిల్లాల అభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరమని సూచించారు.
సామాజిక కార్యకర్త శ్యాం ప్రసాద్ అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై స్పందిస్తూ, జగన్ విమర్శలను సమర్థిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
పరిష్కారం ఎటు?
భూ సమస్యలు రాజకీయ ఆరోపణలకు అతీతంగా, పారదర్శక సంస్కరణలతో పరిష్కరించాలి. డిజిటల్ రికార్డులు, టెక్నాలజీ ఉపయోగం మంచిదే కానీ, అమలులో లోపాలు లేకుండా చూడాలి. ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించే వ్యవస్థ అవసరం. లేకుంటే ఈ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

