తమిళనాడు డీఎంకే ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?
x

ప్రసంగిస్తున్న ఉదయనిధి స్టాలిన్..

తమిళనాడు డీఎంకే ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది?

ఎన్ఈపీ ప్రకారం.. కేంద్రం మూడు భాషల్లో విద్యాబోధన తప్పనిసరి అని అంటోంది. కాని తమిళనాడు మాత్రం హిందీలో విద్యాబోధన కుదరదని చెప్పడానికి కారణాలేంటి?


తమిళనాట ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ద్వి భాషా విధానం అమలవుతోంది. కేవలం ఇంగ్లీష్ (English), తమిళం (Tamil) భాషల్లో మాత్రమే బోధన ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్రకారం.. ప్రతి రాష్ట్రం త్రిభాషా విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని కేంద్రం పాలసీని తీసుకొచ్చింది. దీనిని డీఎంకే వ్యతిరేకిస్తోంది. ఎన్‌ఈపీని పూర్తిగా అమలు చేయకపోతే సమగ్ర శిక్షా స్కీమ్ కింద నిధులు ఇవ్వమని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) ఇటీవల ప్రకటించారు. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఈ విద్యా విధానాన్ని అమలుకు ఓకే చెప్పినపుడు, తమిళనాడు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

బెదిరింపులకు తలొగ్గం..

"త్రిభాషా విధానం (3 language formula) అమలు చేస్తేనే నిధులు ఇస్తామని ధర్మేంద్ర ప్రధాన్ బహిరంగంగా మమ్మల్ని బెదిరించారు. కానీ మేం మా హక్కు కోసం మాట్లాడుతున్నాం. ఎవరి దయ కోసమో కాదు," అని ఫిబ్రవరి 18న డీఎంకే నిర్వహించిన నిరసనలో స్టాలిన్ (Udhayanidhi Stalin) ఘాటుగా స్పందించారు.

"ఇతర రాష్ట్రాలు త్రిభాషా విధానాన్ని అంగీకరించాయి. తమిళనాడు మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తోంది?" అని ప్రధాన మంత్రి ప్రశ్నిస్తున్నారు. దీనికి నా సమాధానం.. హిందీని అంగీకరించిన రాష్ట్రాల్లో వారి సొంతభాష అంతరించిపోయింది. భోజ్‌పురి, బిహారి, హర్యాన్వీ భాషలు దాదాపు నశించిపోయాయి. ఇది ద్రవిడ భూమి... పెరియార్ నేల. గతంలో ‘Go Back Modi’ అన్న ప్రజలు.. ఇప్పుడు ‘Get Out Modi’ అనగలరు," అని హెచ్చరించారు స్టాలిన్.

తమిళనాడు గతంలోనూ హిందీకి వ్యతిరేకంగా పోరాడింది. 1960ల ఉద్యమం తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు.

అన్నామలై విమర్శ..

‘‘DMK 1960 నాటి విధానాన్ని పట్టుకుని వెలాడుతుందని విమర్శించారు. "ప్రపంచం అభివృద్ధి చెందుతోంది. కానీ తమిళనాడు పిల్లలకు 64 ఏళ్ల నాటి పాత భాషా విధానాన్ని బలవంతంగా అమలు చేయడం సమంజసం కాదు," అని కౌంటర్ ఇచ్చారు తమిళనాడు బీజేపీ అధినేత కె. అన్నామలై (Annamalai).

మొత్తానికి హిందీని వ్యతిరేకించడమే కాదు. తమిళనాడు ప్రభుత్వం త్రిభాషా విధానాన్ని అంగీకరించేది లేదని DMK (ద్రవిడ మున్నేట్ర కజగం) స్పష్టం చేస్తోంది. మూడు భాషల వివాదం.. ఎన్నికల ముందు మరింత వేడెక్కే అవకాశం ఉంది.

Read More
Next Story