తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి .. స్టాలిన్‌ ఆంతర్యమేంటి?
x

చెన్నైలోని తన తాత, డీఎంకే అధినేత కరుణానిధి స్మారక చిహ్నం వద్ద నివాళులర్పిస్తున్న తమిళనాడు కొత్త డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి .. స్టాలిన్‌ ఆంతర్యమేంటి?

రానున్న మూడు దశాబ్దాల పాటు ప్రత్యర్థి పార్టీలకు ఎదుర్కోవడానికే ఉదయ నిధి స్టాలిన్‌ను డిప్యూటీ సీఎం చేశారన్న టాక్ తమిళనాట వినిపిస్తోంది.


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయడం వ్యూహాత్మకంలో భాగమేనని చెప్పుకోవాలి. డీఎంకే చీఫ్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రానున్న ఎన్నికల కోసమే కాదు. రాబోయే మూడు దశాబ్దాల పాటు ప్రత్యర్థి అన్నాడీఎంకే, బీజేపీలను ఎదుర్కోవడానికి కూడా. ఇప్పటికే రాజకీయాల్లోకి ముగ్గురు నటులు దర్శకుడు-నటుడు సీమాన్ (NTK), కమల్ హాసన్ (మక్కల్ నీది మయ్యం) అగ్ర నటుడు విజయ్ (TVK) ఎంట్రీ ఇచ్చారు. వీరిలో విజయ్ 2026 అసెంబ్లీ ఎన్నికలలో అరంగేట్రం చేయనున్నారు.

గత సీఎంలంతా సినీ గ్లామర్ ఉన్న వారే..

తమిళనాడు రాజకీయాలను కాస్త లోతుగా పరిశీలిస్తే..సినీ రంగం నుంచి వచ్చిన వారే.. రాజకీయాల్లోనూ అత్యున్నత పదవులు అలంకరించారు. ప్రముఖ సిఎన్ అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్ (ఎంజిఆర్), జె జయలలిత ఈ కోవకు చెందిన వారే. తన తాత ముత్తువేల్ కరుణానిధి వారసత్వ కొనసాగింపులో భాగంగానే ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారన్న వార్తలు ప్రబలంగా వినిపిస్తున్నాయి.

14 ఏళ్ల క్రితం సినీ రంగంలోకి ఎంట్రీ..

ఉదయనిధి 2012లో సినీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించారు. అదే సమయంలో తన నిర్మాణ సంస్థ ‘రెడ్ జెయింట్ మూవీస్’ ద్వారా చిత్ర పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించారు. చిత్ర నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను చేపట్టారు.

స్టాలిన్ ముందుచూపుతో ఆలోచించారా?

ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి, అధికార రేసులో ఉన్న డీఎంకేను ముందంజలో ఉంచడానికి కేవలం కరుణానిధి వారసత్వం మాత్రమే సరిపోదని, సినీ స్టార్‌డమ్, యూత్ కూడా అవసరమని ముఖ్యమంత్రి స్టాలిన్ గ్రహించారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. డీఎంకే పార్టీ 75 ఏళ్లు పూర్తి చేసుకుంది. పార్టీ సీనియర్ నాయకుల్లో చాలా మంది చనిపోయారు. అనుభవజ్ఞులు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఎన్నికల ప్రచారాలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు.

తమిళ సాహిత్యం, సంస్కృతి బాగా తెలిసిన నేతలెవరూ డీఎంకేలో లేరు. ఇతర పార్టీల్లోనూ అలాంటి వారు కనిపించడం లేదు. కరుణానిధి కుమార్తె కనిమొళిని మినహాయిస్తే, తమిళ సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయడం..గద్యమైనా, పద్యమైనా సరే తమిళంలో ఆకట్టుకునేలా రాయడం, తమిళ ఇతిహాసాలతో బాగా పరిచయమున్న వ్యక్తి వైకోనే. ఆయన డీఎంకెతో తెగతెంపులు చేసుకుని సొంత పార్టీ ఎండిఎంకెను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికీ డీఎంకేకు మిత్రుడయిన వైకో కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో పార్టీ బాధ్యతలను ఆయన కుమారుడు చూసుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్‌ రాజకీయ అవసరాలను ముందుగానే గుర్తించిన డీఎంకే.. ఉదయనిధికి డిప్యూటీ సీఎం చేయడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది.

రాజవంశ రాజకీయాలు..

ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న పార్టీ ఎత్తుగడపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో కిందిస్థాయి నుంచి ఎదిగిన నేత స్టాలిన్. పార్టీకి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. చెన్నై కార్పొరేషన్ మేయర్‌గా విధులు నిర్వహించారు. మంత్రిగా పనిచేసి తరువాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు. స్టాలిన్ 2009లో 56 ఏళ్ల వయసులో డిప్యూటీ సీఎం అయ్యారు. కాని ఉదయనిధి 46 ఏళ్ల వయసులో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. డిప్యూటీ సీఎం పీఠం దక్కించుకోడానికి ఆయనకు చాలా తక్కువ సమయం పట్టిందని విమర్శకుల నుంచి వస్తున్న మాట.

స్టాలిన్ బాధ్యతలు పంచుకోడానికేనా?

స్టాలిన్ ఒక్కడే పార్టీ అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఒక్కడే చూడడం భారమైంది. 2009 నుంచి కరుణానిధి భారాన్ని తగ్గించడానికి స్టాలిన్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. తనకంటూ ప్రజల్లో ఒక స్థానం ఏర్పరచుకోగలిగారు.

యువతకు పెద్దపీఠ ?

డీఎంకే సంస్థాగత నిర్మాణం కూడా త్వరలో మారవచ్చు. ఉదయనిధితో పాటు యువ ఆఫీస్ బేరర్ల ప్రాధాన్యం పార్టీలో పెరగవచ్చు. ఇప్పటికే చాలా మంది సీనియర్ల పాత్ర తగ్గిపోయింది. జిల్లా యూనిట్లను విభజించారు. యువ కార్యకర్తల కోసం ఇప్పుడు మరింత ఊపందుకుంటుంది.

ఎయిమ్స్ ఇఘ్యూతో వెలుగులోకి..

ఒకవైపు పార్టీలో సీనియర్లను గౌరవిస్తూనే.. మరోవైపు మదురైలో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం విముఖత చూపిన విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లి ప్రజాకర్షణ పొందగలిగారు ఉదయనిధి. ఎన్నికల్లో ప్రచారం చేయడం ద్వారా పార్టీ క్యాడర్‌ను పెంచగలిగారు. ఉదయనిధి పనితనానికి పార్టీ నేతల నుంచి ప్రశంసలందాయి. ఈ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పదవికి ఉదయనిధి అర్హుడేనన్న వాదనలు పార్టీ శ్రేణుల నుంచి వినిపించాయి.

రానున్న కాలంలో కీలక బాధ్యతలు..

2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిలోని ఇతర పార్టీలతో చర్చలు జరిపే బాధ్యతను ఆయనకే అప్పగించే అవకాశం ఉంది. 2026లో కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి కావచ్చు. ఆ తరువాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పలేం. 2049లో 100 ఏళ్లు నిండిన తర్వాత ఉదయనిధి పార్టీకి నాయకత్వం వహిస్తారని డీఎంకే భావిస్తోంది.

(ఫెడరల్ స్పెక్ట్రమ్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. కథనాలలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితకు చెందినవి. ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు.)

Read More
Next Story