కమ్యూనిస్టుల గడ్డ గన్నవరంపై ఈసారి ఎగిరేది ఏ పార్టీ జెండానో?
x

కమ్యూనిస్టుల గడ్డ గన్నవరంపై ఈసారి ఎగిరేది ఏ పార్టీ జెండానో?

జెండాలే మారాయి. అభ్యర్థులు వారే. పోటీ షరామామూలే. ఒకనాడు కమ్యూనిస్టుల పోతుగడ్డగా భావించే కృష్ణా జిల్లా గన్నవరంలో ఈసారి రెండు బలమైన కుటుంబాల మధ్య వార్ జరుగుతోంది.


రాష్ట్రంలోని హాట్ బెడ్స్ లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పోతుగడ్డగా భావించిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఆ తర్వాత సుదీర్ఘకాలం కాంగ్రెస్, టీడీపీ మధ్యనే దోబూచులాడుతూ వస్తోంది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదొకటి. 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 258,031 మంది ఓటర్లు ఉన్నారు. 1955లో గన్నవరం నియోజకవర్గం ఏర్పడింది. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం లాంటి మహానుభావులు ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహించారు. రాష్ట్రంలో తొలిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య గెలిచారు. ఆ తర్వాత మరో 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్యూనిస్టుల ఖిల్లాగా గన్నవరం అవతరించింది. అయితే ఆ తర్వాత అది కాంగ్రెస్ పార్టీ వశమైంది. ఆ పార్టీ అభ్యర్థులు 4 సార్లు గెలిచారు.

టీడీపీ ఆవిర్భావంతో పరిస్థితి తారుమారు...

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలకు చెక్ పెడుతూ.. టీడీపీ హవా కొనసాగింది. గన్నవరం అంటే.. టీడీపీకి కంచుకోట అనే ముద్ర పడిపోయింది. 1989లో చివరిసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత రెండు సార్లు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2009 నుంచి గన్నవరంలో వరుసగా 3 సార్లు విజయం సాధించింది టీడీపీ. గన్నవరం పరిధిలో నాలుగు మండలాలున్నాయి. అవి.. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు. వీటితో పాటు విజయవాడ రూరల్ మండలంలోని 9 గ్రామాలు.. గన్నవరం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. గన్నవరం వైసీపీలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ వైపు వచ్చేసిన దగ్గర్నుంచి.. పార్టీలో తరచుగా విభేదాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.


గన్నవరం అంటే.. తెలుగుదేశానికి కంచుకోట. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ తరఫున వరుసగా రెండు సార్లు గెలిచారు. ఇప్పుడు.. వైసీపీలో చేరారు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు టీడీపీ ఇంచార్జ్‌గా ఉండేవారు. ఆయన మరణానంతరం.. పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ కన్వీనర్‌గా.. సీనియర్ నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ.. తర్వాత వైసీపీలో చేరారు. అప్పటికే.. వైసీపీ నుంచి పోటీ చేసిన ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వంశీ టీడీపీ నుంచి వైసీపీకి రావడం.. యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీకి రావడం ఆయా పార్టీల క్యాడర్ కు మింగుడుపడటం లేదు.

మెజారిటీ వర్గం కమ్మ సామాజికవర్గమే..

కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉండే గన్నవరంలో.. ఇప్పుడు ఆ వర్గం నేతలంతా.. సైలెంట్ అయిపోయారు. ఆర్ధికంగా బలంగా ఉన్న వంశీని తట్టుకోవడం సాధ్యం కాదని.. తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకే.. గత ఎన్నికల్లో వంశీకి ప్రత్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డను రంగంలోకి దించినట్టు భావిస్తున్నారు. ఆయన కూడా ఆర్ధికంగా బలవంతుడే కావడమే ఇందుకు కారణం. మరోవైపు.. విజయవాడ ఈస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్‌ మద్దతు యార్లగడ్డకే లభిస్తోంది. గతంలో ఆయన ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలవడమే కారణంగా కనిపిస్తోంది. పైగా.. ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకి వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబు కుటుంబ వ్యవహారాలపై వంశీ కామెంట్ చేయడం.. కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇప్పటికే.. ఈ వ్యవహారంలో ఆయన సారీ చెప్పినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలోనే.. కమ్మ సామాజికవర్గమంతా.. దాదాపుగా వంశీకి వ్యతిరేకంగానే పనిచేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో.. వైసీపీ నాయకులు గన్నవరం టీడీపీ ఆఫీసుపై చేసిన దాడి కూడా రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేశాయ్. దాంతో.. స్థానికంగా ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు.. టీడీపీ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

పుచ్చలపల్లి సుందరయ్య మూడు సార్లు విజేత..


గన్నవరంలో పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత.. వరుసగా రెండు సార్లు గెలిచిన నేత.. వల్లభనేని వంశీనే. నియోజకవర్గంలో ఆయనకు సొంత ఇమేజ్‌‌తో పాటు వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండడంతో గన్నవరంలో టీడీపీకి ఎదురుండదన్న భావన ఉంది. గత ఎన్నికల్లో.. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. వెయ్యి లోపు ఓట్లతోనే గెలిచారు.

హ్యాట్రిక్ కోసం వంశీ యత్నం

ఏదేమైనా గన్నవరంలో.. హ్యాట్రిక్ కొట్టాలని ఎమ్మెల్యే వంశీ భావిస్తున్నారు. టీడీపీ కూడా వంశీకి చెక్ పెట్టి.. మళ్లీ పసుపు జెండానే ఎగరేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈసారి కూడా వైసీపీ-టీడీపీ మధ్యే ప్రధాన పోటీ ఉంది.

ఎవరీ వల్లభనేని వంశీ మోహన్

1971 సెప్టెంబర్ 26న జన్మించిన వల్లభనేని వంశీ మోహన్ ఉంగుటూరు వాసి. 2014లో తెలుగుదేశం టికెట్ పై రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తెలుగుదేశం టికెట్ పై గెలిచిన వంశీ ఆ తర్వాత వైసీపీకి ఫిరాయించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై ఆయన గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. వసుదా సినీ నిర్మాత అయిన వంశీ జూనియర్ ఎన్టీఆర్ తో అదుర్స్ అనే ఫిలింను, రవితేజాతో టచ్ చేసి చూడు అనే సినిమాను నిర్మించారు. వల్లభనేని వంశీ తిరుపతిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం నుంచి వెటర్నరీ సైన్స్ లో పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించారు. ఆయన పంకజ శ్రీని వివాహమాడారు.

యార్లగడ్డ ఇక్కడి వారే...

ఇక ఆయనపై పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు ఉయ్యూరు ప్రాంతవాసి. నాగార్జున యూనివర్శిటీలో చదివి వ్యాపార రంగంలోకి అడుగిడారు. రాజకీయాల వైపు మొగ్గు చూపిన ఆయన పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఇదే వంశీ చేతిలో ఓడిపోయారు చాలా స్వల్పతేడాతో. ఇప్పుడాయన టీడీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయన తరఫున ఆయన భార్య జ్ఞానేశ్వరి కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

Read More
Next Story