మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం .. పూజలో ముస్లిం మహిళ ..
x

మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం .. పూజలో ముస్లిం మహిళ ..

బుకర్ ప్రైజ్ గ్రహీత ఆహ్వానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం..


Click the Play button to hear this message in audio format

బుకర్ ప్రైజ్ గ్రహీత, కన్నడ రచయిత్రి భాను ముష్తాక్ (Banu Mushtaq) సోమవారం (సెప్టెంబర్ 22) ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న తేదీన ముగుస్తాయి. చాముండి కొండపై జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని భాను ముష్తాక్(Banu Mushtaq)ను సీఎం సిద్ధరామయ్య కోరారు. మైసూరు డిప్యూటీ కమిషనర్ (డీసీ) లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం హసన్‌లోని ఆమె ఇంటికి వెళ్లి ఇటీవల ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే.

మైసూరు చాముండి కొండపైన ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆమెతో కలిసి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు అమ్మవారిని దర్శించుకుని కాసేపు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 'నాద హబ్బా' (రాష్ట్ర పండుగ)గా జరుపుకునే ఈ 11 రోజుల పండుగ.. కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతుంది.

ముస్లిం అయిన ముష్తాక్‌ను కర్ణాటక ప్రభుత్వం దసరా ఉత్సవాలకు ఆహ్వానించడంపై బీజేపీ, హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కన్నడ భాషను "దేవత భువనేశ్వరి"గా పూజించడంపై గతంలో ఆమె అభ్యంతరం వ్యక్తం చేయడమే అందుకు కారణం. అయితే ఆ వివాదంపై ఇప్పుడు ముష్తాక్‌ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు.

దసరా పండుగను అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటారని, బీజేపీ కావాలని రాజకీయం చేయడం తగదని సీఎం సిద్ధరామయ్య గతంలో బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ముష్తాక్‌ను దసరా ఉత్సవాలకు ఆహ్వానించడం ద్వారా కర్ణాటక (Karnataka) సాంస్కృతిక వారసత్వానికి ఖ్యాతి దక్కుతుందని రాష్ట్రప్రభుత్వం సమర్థించుకుంది.

ముస్లిం మహిళతో దసరా ఉత్సవాలను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో షెడ్యూల్ ప్రకారం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక హైకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది.


అసలు ఎవరీ భాను ముష్తాక్ ?

భాను ముష్తాక్ ప్రముఖ కన్నడ రచయిత్రి. ఆమె రచించిన ‘హృదయ దీప’ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. బుకర్‌ ప్రైజ్‌ (Booker Prize) అందుకున్న తొలి కన్నడ రచయిత్రి. హసన్ జిల్లాలో పుట్టి పెరిగిన ఆమె కన్నడ సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన భాను ముష్తాక్ కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, చింతామణి అత్తిమబ్బే అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆమె సాహిత్య రచనలు పలువురి ప్రశంసలు పొందాయి.

Read More
Next Story