సాయి పల్లవికి ఏమైందీ? ఈ బాయికాట్ గోల ఏమిటీ?
x

సాయి పల్లవికి ఏమైందీ? ఈ బాయికాట్ గోల ఏమిటీ?

ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి సినిమాలను బహిష్కరించండి అంటూ కొందరు 'జైశ్రీరామ్' భక్తులు ఇంటర్నెట్ ఉద్యమాన్ని చేపట్టారు.


సహజనటిగా పేరొందిన సాయిపల్లవి ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ఫిదా, లవ్ స్టోరీ వంటి సక్సెస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయిపల్లవి సినిమాలను బహిష్కరించండి అంటూ కొందరు 'జైశ్రీరామ్' భక్తులు పెద్ద ఉద్యమాన్నే ఇంటర్నెట్ లో నడుపుతున్నారు. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమా "అమరన్" అక్టోబర్ 31న విడుదల కానున్న నేపథ్యంలో "బాయ్ కాట్ సాయిపల్లవి" ఉద్యమం మొదలు కావడం గమనార్హం. కెరీర్ పరంగా మంచి ఊపులో ఉన్న సాయిపల్లవికి ఈ వివాదం పెద్ద ఆటంకం కాబోతోందని అంటున్నారు సీనీ ప్రముఖులు. ఎప్పుడో రెండేళ్లనాడు ఆమె చేసిన ఓ వ్యాఖ్యను ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి ఈ "బాయ్ కాట్ సాయిపల్లవి" ఉద్యమాన్ని నడపడం ఏమిటన్న ప్రశ్న వస్తున్నా ఆమె సినిమాలను ఆడనివ్వబోమని తెగేసి చెబుతున్నారు కొందరు నెటిజన్లు.

తమిళనాడులోని ఊటీకి చెందిన సాయిపల్లవి ప్రస్తుతం చాలా పెద్ద బ్యానర్లలో నటిస్తున్నారు. అటువంటి వాటిలో ఒకటైన అమరన్ తమిళ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. చాలా పాన్ ఇండియా మూవీలలోనూ నటించనుంది. వచ్చేఏడాది నాగ చైతన్యతో కలిసి థండేల్ ప్రాజెక్ట్ లో లీడింగ్ రోల్ లో నటించనుంది. ఈనేపథ్యంలో ఆమె ఈ వివాదంలో చిక్కుకోవడం పట్ల అభిమానులు, దర్శక నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ పాత ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటల్ని ప్రస్తుత అమరన్ చిత్రానికి ముడిపెట్టి ఆమెను దేశద్రోహిగా పరిగణించాలని, ఆమె చిత్రాలను పూర్తిగా బహిష్కరించాలని కొందరు నెటిజన్లు ఇంటర్నెట్ యుద్ధం ప్రారంభించారు.

వృత్తిపరంగా సాయి పల్లవి కెరీర్ గ్రాఫ్‌లో చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది. త్వరలో ఆమె నితీష్ తివారీ తీయబోతున్న రామాయణం చిత్రంలో రాముడు పాత్రధారి రణబీర్ కపూర్ పక్కన సీత పాత్రను పోషించబోతున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో పెద్ద మైలురాయి కాబోతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. రాబోయే అమరన్ కోసం ప్రమోషన్ల కోసం ఆమె టూర్ చేస్తుండగా ఈ వివాదం చుట్టుముట్టింది. ఆమె పాత ఇంటర్వ్యూ ఇప్పుడు ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇంతకీ ఆ వీడియో క్లిప్ ఏమిటీ?
వివాదానికి దారితీసిన క్లిప్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇది 2022 జనవరి నాటి ఇంటర్వ్యూ. ఇప్పుడు బయటికి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో సాయి పల్లవి "హింస (voilence)ను ఎలా అర్థం చేసుకోవాలో తనకు బోధ పడడం లేదన్నారు. హింసను అర్థం చేసుకోవడంలో తాను ఎలా విఫలమైందో వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఉదాహరణ చెప్పారు. ఆమె చెప్పిన దాని ప్రకారం "పాకిస్తాన్ ప్రజలు మన సైన్యాన్ని ఉగ్రవాద ముఠాగా భావిస్తారు. మనం కూడా అదే తరహాలో వాళ్లను (పాక్) ఉగ్రవాద ముఠాలంటాం. కాబట్టి, దృక్పథాన్ని బట్టి నిర్వచనం మారుతుంది. అర్థం మారుతుందనుకుంటా. హింస అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు" అన్నారు సాయిపల్లవి.
ఆమె ఈ మాట చెప్పిన రెండేళ్ల తర్వాత ఈ క్లిప్ మళ్లీ తెరపైకి రావడంతో ఆమెపై నెటిజన్లు కొందరు విరుచుకుపడుతున్నారు. ఆమెకు లేనిపోనివి ఆపాదిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమె భారతీయ సైన్యానికి వ్యతిరేకమని ఆరోపిస్తున్నారు. వాళ్ల ఆరోపణలకు అనుగుణంగా ఆమె గతంలో షేర్ చేసిన కొన్ని క్లిప్స్ ను కూడా నెట్ లో పెడుతున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ (2022)లో కాశ్మీరీ పండిట్ల మారణహోమం క్లిప్ ను ప్రస్తావిస్తున్నారు. ఒక ముస్లిం డ్రైవర్ బండిపై ఆవును ఎక్కించుకుని పోతుంటే జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్న గుంపొకటి కొట్టిచంపిన ఘటనకు సంబంధించిన వీడియా అది.
ఇదే సమయంలో సాయిపల్లవికి మద్దతుగా కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు. అనుకూల ప్రతికూల కామెంట్లతో ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్ హోరెత్తుతోంది. ఆమె వ్యతిరేకులు "#Boycott sai Pallavi" అని అంటుంటే ఆమె అనుకూలురు "#saipallavi" అంటూ పోస్టులు పెడుతున్నారు. భారతీయ సైనికులు, పాక్ సైనికులు ఒకటేనని వారూ లేకపోలేదు. సాయిపల్లవి త్వరలో రాబోయే బాలివుడ్ సినిమాలో సీత పాత్ర పోషించనుందని, అందుకు ఆమె అర్హురాలు కాదనే అర్థం వచ్చేలా కొన్ని పోస్టులు ఉంటున్నాయి. హిందూ వ్యతిరేక మనోభావాలు కలిగిన ఆమె ఈ తరహా పాత్రకు సరైందేనా అనే వారు కొందరైతే కచ్చితంగా ఆమె పాక్ అనుకూల వ్యక్తేనంటూ మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. "సాయి పల్లవి ఇండియన్ ఆర్మీని 'పాకిస్తానీ టెర్రరిస్ట్'గా అభివర్ణించి దేశప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపిస్తున్నారు. పాక్ సైన్యం మాదిరిగా భారతీయ సైన్యం ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీసిందో చెప్పాలని" డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఆమెను సమర్థించేవారు రెండేళ్ల నాటి ఆమె వ్యాఖ్యలకు తప్పుడు భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు. సమయం సందర్భం లేకుండా ఇలాంటి వీడియోలు ఇప్పుడెందుకు బయటకు వచ్చాయో చెప్పాలని ఆమె మద్దతుదారులు సవాల్ చేస్తున్నారు. "2 ఏళ్ల నాటి వీడియోను బయటకు లాగడం, ఆమె మాటలను వక్రీకరించడం వల్ల ఎవరో లాభపడాలనుకుంటున్నారు, దీని వెనుక ఏదో కుట్ర ఉంది, ఆమెను వివాదంలోకి లాగాలని కొందరు తాపత్రయపడుతున్నట్టుగా ఉంది" అని సాయిపల్లవి మద్దతుదారులు వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని ఊటీకి చెందిన సెంతామరై, రాధామణి దంపతుల కుమార్తెనే సాయి పల్లవి. వాస్తవానికి ఆమె పేరు పల్లవి మాత్రమే. కానీ, తల్లి సాయిబాబా భక్తురాలు కావడంతో సాయి పల్లవి అని మార్చారు. ఆమెకు పూజా అనే కవల సోదరి కూడా ఉంది. సాయిపల్లవి వృత్తిరీత్యా వైద్యురాలు.
Read More
Next Story