రెండు నెలలు గడిచినా వయనాడ్ బాధితులకు అందని కేంద్ర సాయం
x

రెండు నెలలు గడిచినా వయనాడ్ బాధితులకు అందని కేంద్ర సాయం

వాయనాడ్ దుర్ఘటనకు సంబంధించి నష్ట పరిహార నివేదికను సమర్పించి రెండు నెలలయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో బాధితులు నిరసనకు సిద్ధం అవుతున్నారు.


కేరళలో పెను విధ్వంసం జరిగి దాదాపు రెండు మాసాలు దాటిపోయింది. వాయనాడ్‌లో కొండ చెరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. అనేక ఇల్లు నేలమట్టమయ్యాయి. కొంత మంది కుటుంబసభ్యులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. చేదు జ్ఞాపకలతో తాత్కాలిక ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రధాని హామీ ఏమైంది?

ఉపద్రవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వాయనాడ్‌ను సందర్శించారు. బాధితులకు ఆర్థిక సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదిక అందిన తర్వాత నిధులు కేటాయిస్తామని నమ్మకంగా చెప్పడంతో కేరళ ప్రభుత్వం ఆగస్టు 17న రూ. 1,202 కోట్ల ఆర్థిక సాయం కోరింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగస్టు 27న న్యూఢిల్లీకి వెళ్లి నష్టం తాలుకు సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించారు. అయినా నేటికీ కేంద్రం నుంచి ఏ సాయం మంజూరు కాలేదు.

రాష్ట్రానికి భారీ నష్టం..

“వయనాడ్ విపత్తు కారణంగా రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూసింది. కేంద్రం ఆదుకుంటుందని ఆశించాం. కానీ ఇంతవరకు ఎలాంటి సాయం చేయలేదు. జాతీయ విపత్తు నిధి నుంచి రూ. 291 కోట్ల అత్యవసరంగా విడుదల చేయాలని కోరాం. ఇందులో రూ. 145.6 కోట్లను మాత్రమే మంజూరు చేశారు.” అని ముఖ్యమంత్రి అసెంబ్లీలో అన్నారు.

బాధితుల ఆగ్రహం..

కేంద్రం నుంచి సాయం అందడంలో జరుగుతున్న జాప్యంపై స్థానికుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడీఎఫ్) నాయకులు సైతం కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించి కేరళ పట్ల వివక్ష చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్‌కు రూ.600 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి రూ.3,448 కోట్లు, అస్సాం, సిక్కింలో పునరుద్ధరణ పనులకు రూ. 11,000 కోట్లు, బీహార్‌కు రూ. 11,500 కోట్లు కేటాయించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తమకు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుంచి కేవలం రూ.145 కోట్లే కేటాయించడం ఏమిటని నిలదీస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

నిధుల విడుదలలో రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎత్తిచూపేందుకు సీపీఐ(ఎం) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన కార్యక్రమాలకు ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలపనున్నాయి.

అదొక్కటే మార్గం..

“ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. నిధులు రాబట్టుకోవడం కోసం విపత్తు నుంచి బయటపడిన బాధితులు నిరసనకు దిగడం తప్ప మరో మార్గం లేదు” అని సీపీఐ (ఎం) రాజ్యసభ సభ్యుడు వి శివదాసన్ పేర్కొన్నారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ వాయనాడ్‌లోని కల్పేటలో వరద బాధితులు ప్రారంభించిన నిరసన ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

స్థలాలు సరే.. నిర్మాణాలెప్పుడో?

స్థానిక అధికారులు నిర్వాసిత కుటుంబాలకు శాశ్వత పునరావాసం కోసం భూమిని గుర్తించారు. అయితే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందక పోవడంతో నిర్మాణ పనులు జరగడం లేదు. దీంతో చాలా కుటుంబాలు నేటికీ కనీస వసతులు లేని తాత్కాలిక నివాసాల్లోనే కాలం గడుపుతున్నాయి. త్వరలో ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కారణంగా నిధుల విడుదల మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది.

"మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌, రూ.300తో ఎలా బతకగలం? మాకు శాశ్వత గృహాలు కావాలి. ఉద్యోగాలు చూపాలి”అని చూరల్‌మల ప్రాంతంలో గడ్డి కోసే పనికి వెళ్లే ఫాతిమా కోరుతున్నారు.

రాజకీయ శత్రుత్వానికి మమ్మల్ని ఇబ్బందిపెట్టొద్దు..

“ప్రధాని పర్యటనతో మాకు భరోసా వచ్చింది. ఆయన ఆసుపత్రిలో చిన్నారిని ఓదార్చినప్పుడు, మా పట్ల ప్రధానికి సానుభూతి ఉందని అనుకున్నాం. మార్క్సిస్టులు, కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ శత్రుత్వం వల్ల కేంద్రం నిధుల విడుదలలో జాప్యం చేస్తుందని ఇప్పుడు అర్థమైంది. మనందరం ఐక్యంగా ఉండి నిధుల కోసం పోరాడాలి. నేను కమ్యూనిస్టును కాను. అయితే కేంద్రంతో పోరాటానికి సిద్ధమవుతా.”అని కొండచరియలు విరిగిపడటంలో కుటుంబ సభ్యులను కోల్పోయి తాత్కాలిక ఇంట్లో ఉంటున్న ప్రదీపన్ పేర్కొన్నారు.

గృహాలను పునర్నిర్మించడమే కాకుండా విపత్తు వల్ల దెబ్బతిన్న జీవనోపాధిని పునరుద్ధరించడానికి కేంద్ర ఆర్థిక సాయం చాలా కీలకమని స్థానిక నాయకులు వాదిస్తున్నారు. బాధితుల నిరసనతోనైనా కేంద్ర వైఖరి మార్పు వస్తుందేమో చూడాలి.

Read More
Next Story