‘‘వయనాడ్ దుర్ఘటన జాతీయ విపత్తుగా చూడలేం’’..మరోసారి చెప్పిన కేంద్రం
x

‘‘వయనాడ్ దుర్ఘటన జాతీయ విపత్తుగా చూడలేం’’..మరోసారి చెప్పిన కేంద్రం

కేరళలో ఎన్నికలు ముగిసిన కొద్ది గంటలకే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనను "జాతీయ విపత్తు"గా పరిగణించలేమని కేంద్రం పేర్కొంది.


కేరళలో ఎన్నికలు ముగిసిన కొద్ది గంటలకే వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనను "జాతీయ విపత్తు"గా పరిగణించలేమని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు నవంబర్ 14న హోం వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ న్యూఢిల్లీలోని కేరళ ప్రత్యేక ప్రతినిధి కెవి థామస్‌కు లేఖ రాశారు.

2024 జూలై 30న కేరళలో పెను విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 231 మృత్యువాతపడ్డారు. రూ.1,200 కోట్లు ఆస్తి నష్టం సంభవించింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశ చరిత్రలో అత్యంత ఘోర ప్రకృతి వైపరీత్యాలలో ఈ దుర్ఘటన కూడా ఒకటి. ప్రస్తుత నిబంధనల ప్రకారం వయనాడ్ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించలేమని చెప్పడంతో ఇక కేంద్రం నుంచి ఆశించనంత నిధులు రావన్న విషయం వయనాడ్ వాసులకు అర్థమైపోయింది.

పిటిషన్ వాయిదా..

వయనాడ్‌ దుర్ఘటనను జాతీయ విపత్తుగా పరిగణించలేమని కేంద్రం చెప్పడాన్ని తప్పబడుతూ.. కేరళ ప్రభుత్వం హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు రానుంది. అంతకుముందు వయనాడ్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ అమికస్ క్యూరీ రంజిత్ థంపన్ పంపిన నివేదికపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని కోర్టు ఆదేశించింది.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష..

తమకు అనుకూలంగా లేని రాష్ట్రాల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందని కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ ఆరోపించారు. తమలాగే విపత్తుల బారిన పడ్డ ఇతర రాష్ట్రాలు కేంద్రం నుంచి అందుకున్న మొత్తంతో పోలిస్తే తమకు అందింది చాలా తక్కువ అని ఆయన వాదిస్తున్నారు. మహారాష్ట్రకు రూ. 1,492 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 1,036 కోట్లు, అస్సాంకు రూ. 716 కోట్లు ఇచ్చారని, వయనాడ్ స్థాయి విపత్తు ఆ మూడు రాష్ట్రాల్లో సంభవించకపోయినా కేంద్రం చాలా ఎక్కువ నిధులు కేటాయించిందన్నది కేరళ ప్రభుత్వ వాదన.

గతంలో కేరళలో చాలా ఉపద్రవాలు చోటుచేసుకున్నాయి. 2018లో భారీ వరదలు సంభవించడంతో రూ. 4,796.4 కోట్ల సాయం కోరగా.. రూ.2,904.85 కోట్లు మంజూరు చేసింది. 2017లో ఓఖీ తుఫాను, 2019లో వరదల సమయంలో తాము కోరిన దానికంటే తక్కువే ఇచ్చారని కేరళ ప్రభుత్వం చెబుతోంది.

కేంద్ర ప్రభుత్వ వాదనేంటి?

రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్‌ఎఫ్) ద్వారా కేరళ ఇప్పటికే చాలా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని పొందిందని కేంద్రం చెబుతోన్న మాట. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 388 కోట్ల కేటాయించామని ఇందులో రూ. 145.60 కోట్లను రెండు విడతలుగా ఇచ్చామని పేర్కొంది.

కేంద్రం వైఖరిని తప్పుబట్టిన ప్రియాంక

‘‘ఘటన తర్వాత ప్రధాని మోదీ వ‌య‌నాడ్‌లో పర్యటించారు. న‌ష్టం తాలుకూ వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అయినా కోరినంత ఆర్థిక సాయం మంజూరు చేయలేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై మోదీకి చిన్న చూపు. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అదే జరిగింది. గతంలో విపత్తుల విషయంలో రాజకీయాలు చేసేవారు కాదు. రాజకీయ కారణాలతో బాధితుల అండగా నిలవకపోవడం ఆమోదయోగ్యం కాదు” అని ఇటీవల నవంబర్ 13 న జరిగిన ఉప ఎన్నికలో వయనాడ్ అభ్యర్థి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

ఏకమైన అధికార, ప్రతిపక్షాలు..

అవసరమైన సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యాన్ని ఖండిస్తూ కేరళ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒక్కటయ్యారు. జరిగిన నష్టాన్ని వివరిస్తూ, తక్షణ సాయం అందించాలని కోరుతూ కేంద్రానికి మెమోరాండం సమర్పించినా.. స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

‘సాయం చేయడం ఇష్టలేదని తేలిపోయింది’

“ముండక్కై, చూరల్‌మలలో ఉంటున్న బాధితులకు వాగ్దానాల కంటే నిజమైన మద్దతు అత్యంత అవసరం. మోదీజీ సాయం చేయడానికి సిద్ధంగా లేరని ఇప్పుడు స్పష్టమైంది. మాకు అవసరమైన మద్దతు కోసం మార్క్సిస్టులు, కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలి, ”అని కొండచరియలు విరిగిపడటంతో సర్వస్వం కోల్పోయిన చూరల్‌మల ఫాతిమా అంటున్నారు. “నాలుగు నెలలుగా ఉద్యోగం లేక డబ్బుల్లేక తాత్కాలిక అద్దె ఇంట్లో ఉంటున్నా. కేవలం రేషన్ సరుకులతో ఎలా జీవించగలరు? అని ఫాతిమా ప్రశ్నిస్తోంది.

Read More
Next Story