టీవీకే నిర్వాహకుల వల్లే తొక్కిసలాట జరిగిందా?
x
కరూర్ లో తొక్కిసలాట జరిగిన తరువాత దృశ్యాలు

టీవీకే నిర్వాహకుల వల్లే తొక్కిసలాట జరిగిందా?

ఏదో జరగబోతోందని ముందే ఊహించిన పోలీసులు, హెచ్చరించిన పట్టించుకోని టీవీకే పార్టీ నాయకులు


తమిళనాడు కరూర్ విషాదానికి ముందు పోలీసులు చేసిన హెచ్చరికను టీవీకే నాయకులు పట్టించుకోలేదా? నిఘా వర్గాలు ముందుగానే ఏదో ప్రమాదం జరుగుతుందని హెచ్చరించాయా? అంటే అవుననే అంటున్నాయి తమిళనాడు పోలీస్ వర్గాలు.

విజయ్ నిజంగా వచ్చే సమయం ప్రజలకు ముందుగా తెలియజేయాలని, ప్రజలు ఇక్కడ భారీగా సమీకరణ కాకుండా చేయాలని స్థానిక నాయకులను హెచ్చరించినట్లు తెలిసింది. కానీ పోలీసులు చేసిన హెచ్చరికను విజయ్ పార్టీ నాయకులు పట్టించుకోలేదని ఇంకా సమీకరణ జరిగేలా ప్రోత్సహించారని తెలిసింది.

కరూర్ లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఇందులో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉండటం అందరిమదిని కలిచివేస్తోంది.
కరూర్ లో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారులు ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. పెద్ద కారవాన్ అడ్డంగా ఉందని అక్కడ నుంచి వేలుసామిపురం వరకూ తరలించడం అసాధ్యంగా మారుతుందని హెచ్చరించామని ఆయన చెప్పారు. అయితే తమ విన్నపాలను ఎవరూ పట్టించుకోలేదని పేర్కొన్నారు.
విజయ్ విజువల్స్ ప్లే..
‘‘వేలుసామిపురం లో భారీగా జనం చేరుకున్నారు. విజయ్ ను అనుసరిస్తూ నామక్కల్ నుంచి భారీ స్థాయిలో జనం వస్తున్నారు. ఆయన వేలుసామిపురం చేరుకోవడం చాలా కష్టమైన పని.
మేము విజయ్ ను కరూర్ ఎంట్రన్స్ దగ్గరగానే ప్రసంగించమని కోరాము. కానీ పార్టీ నిర్వాహాకులు మాత్రం లైట్లు వేసి స్క్రీన్ ఆన్ చేసి ఆయన విజువల్స్ ప్లే చేశారు. ఇది ప్రజలు మరింత గుమిగూడెలా చేసింది’’ అని ఆ అధికారి తెలిపారు. చీటికిమాటికి సమయం మారుస్తుండటం కూడా ఇది గందరగోళానికి దారితీసిందన్నారు.
‘‘టీవీకే ఈ కార్యక్రమానికి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ అనుమతి తీసుకున్నారు. కానీ విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగిస్తారని ప్రకటనలు చేశారు.
మధ్యాహ్నం 2 గంటల కల్లా జనం నమ్మశక్యం కానీ స్థాయికి చేరుకున్నారు. నిర్వాహాకులు పాటలు ప్లే చేస్తూనే ఉన్నారు. ఆయన రాక గురించి గందరగోళం సృష్టిస్తున్నారు. విజయ్ ను చూసే వరకూ ప్రజలు అక్కడి నుంచి వెళ్లడానికి సిద్దంగా లేరు’’ అని ఆయన అన్నారు.
అధికారుల ప్రకారం.. టీవీకే నాయకులు మొదట జిల్లా యంత్రాంగానికి విజయ్ ప్రసంగం సాయంత్రం 5.30 నిమిషాలకు ముగుస్తుందని హమీ ఇచ్చారు. కానీ ఆయన రాకపోవడంతో జనం అప్పటికే అలసిపోయారు.
విజయ్ రాగానే ఒక్కసారిగా ప్రజలు దూసుకురావడంతో చాలామంది బయటకు వెళ్లలేకపోవడంతో ఈ విపత్తు సంభవించింది. రోడ్ షోకు 27 వేలకు పైగా జనం వచ్చారు. ఇందులో దాదాపుగా ఏడువేలకు పైగా మహిళలు ఉన్నారు. జనసమూహం ప్రతి అంగుళాన్ని ఆక్రమించింది.కాలు కదపడానిక కనీస స్థలం కూడా లేదు’’ అన్నారు.
పళని స్వామి ర్యాలీ బాగా..
‘‘రెండు రోజుల క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి నిర్వహించిన సమావేశానికి మేము 134 మంది పోలీసులను నియమించాము. విజయ్ ర్యాలీకి దాదాపు 500 మందిని కేటాయించాము.
ఈపీఎస్ సమావేశానికి దాదాపు 15 వేల మంది హజరయ్యారు. ప్రజలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభ నిర్వహించగలిగాము. కానీ విజయ్ ర్యాలీలో మాకు క్యాడర్ నుంచి ఎలాంటి సహకారం అందలేదు’’ అని అధికారులు ఆరోపించారు.
‘‘ప్రస్తుతం జరిగిన వీధి కాకుండా ఇతర చిన్న వీధులను టీవీకే మొదట్లో ఇష్టపడింది. ఈ ఇరుకైన ప్రదేశాలలో కార్యక్రమం జరిగి ఉంటే మరణాల సంఖ్య ఇంకా పెరిగేది’’ అని అధికారులు తెలిపారు.
జోరుగా ప్రచారం..
విజయ్ వేలుసామిపురం వెళ్లకుండా ఎందుకు ఆపలేదని అడిగినప్పుడు పోలీసులు చెప్పిన సమాధానం ఏంటంటే.. డీఎంకే ప్రభుత్వం, పోలీసులు అవాంఛిత షరతులు విధించడం ద్వారా విజయ్ ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారని టీవీకే ద్వారా ఇప్పటికే ప్రచారం జరిగింది. కాబట్టి మేము జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాము’’ అని చెప్పారు.
కరూర్ ఎంపీ జోతిమణి ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. కరూర్ పట్టణ రోడ్లు గరిష్టంగా పదివేల మందిని మాత్రమే భరించగలవని అన్నారు. ‘‘ ఆ జనసమూహం ఒక్కటే ట్రాఫిక్ జామ్ లకు కారణమవుతుంది.
పార్టీ కార్యకర్తలు చురుగ్గా జనాన్ని మళ్లించకపోతే గందరగోళం అనివార్యం. దీనికి తోడు ర్యాలీ శనివారం జరిగింది. ఇది అనేక వస్త్ర సంస్థలకు జీతం, ఉద్యోగ ఆర్డర్ పూర్తి రోజు. కార్మికులు జీతాలతో లారీలలో బయల్దేరారు. రోడ్లు జామ్ కావడంతో అనేకమంది చిక్కుకున్నారు’’ అని ఆమె చెప్పారు.
‘‘స్థానిక జనాభా, వేదిక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో నిర్వాహాకులు విఫలమయ్యారు. ర్యాలీని నిర్వహించడానికి రెండో స్థాయి నాయకులు లేరు. ప్రజలకు మార్గ నిర్దేశం చేయడానికి ఎవరూ లేరు.
చాలామంది పిల్లలు నలిగిపోవడం హృదయ విదారకంగా ఉంది. ఆహారం లేదా నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉన్న ప్రజలు కుప్పకూలిపోతారని టీవీకే నాయకులు గ్రహించాలి’’ అని జోతిమణి అన్నారు.
విజయ్ వీడియో..
శనివారం జరిగిన తొక్కిసలాటపై మంగళవారం విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని తాను సవాల్ చేసినందుకు నిజం త్వరలో బయటపడుతుందని పేర్కొన్నారు. కరూర్ లో ఈ సంఘటన ఎందుకు జరిగిందని కూడా ఆయన ప్రశ్నించారు. కుట్ర పూరితంగా ఇది జరిగిందని ఆరోపించారు.
ఈ విషాదాన్ని తన రాజకీయ జీవితంలో అత్యంత బాధాకరమైన క్షుణ్ణంగా అభివర్ణిస్తూ, నటుడిగా మారిన రాజకీయ నాయకుడు తన హృదయం దు:ఖంతో నిండిపోయిందన్నారు.
ప్రచార సమయంలో తనను కలవడానికి వచ్చిన ప్రజలు ప్రేమతో వచ్చారని, ఆ ప్రేమకు తానెప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ర్యాలీలు నిర్వహించే విషయంలో భద్రతే తన ప్రధాన ప్రాధాన్యత అని టీవీకే చీఫ్ అన్నారు.
పోలీసులతో సంప్రదించిన తరువాతే వేదిక స్థలాలు ఎంపిక చేసుకున్నామని విజయ్ అన్నారు. శనివారం నాడు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని కానీ దురదృష్టకర సంఘటన జరిగిందని చెప్పారు.
ఇంత విపత్తు తరువాత తాను ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లలేనని భావిస్తున్నాని, తాను అక్కడికి తిరిగి రావడం వలన మరింత గందరగోళం ఏర్పడుతుందనే భయం వెంటాడుతోందని దళపతి అన్నారు.
తన పార్టీ నాయకులు, సభ్యులపై తీసుకున్న చట్టపరమైన చర్యలను విమర్శిస్తూ విజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. తనపై వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అది చేయాలని కానీ తన ప్రజలను తాకకూడదని హెచ్చరించాడు. ఈ తొక్కిసలాట సంఘటన రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి.


Read More
Next Story