
తమిళనాడు: వచ్చే వారం నుంచి ఓటరు జాబితా సవరణ ప్రారంభం..
అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే బి. సత్యనారాయణన్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు..
తమిళనాడు(Tamil Nadu)లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ (SIR)ను వచ్చే వారం నుంచి ప్రారంభిస్తామని భారత ఎన్నికల సంఘం (EC) మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. ఇటీవల బీహార్(Bihar)లో ఎస్‌ఐఆర్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఈసీ నిర్ణయానికి కారణమేంటి?
2021 ఎన్నికల్లో టి నగర్ నియోజకవర్గం నుంచి సత్యనారాయణన్ అనే వ్యక్తి పోటీచేసి కేవలం 137 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నిజమైన ఓటర్లను భారీగా తొలగించడం, మరణించిన వ్యక్తుల పేర్లను, స్థానికంగా లేని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించకపోవడంలో ఈసీ విఫలమైందని ఆయన ఆరోపించారు. టి నగర్‌లోని 229 పోలింగ్ కేంద్రాల్లో 100 కేంద్రాల పరిధిలోని ఇళ్లను తాను స్వయంగా తనిఖీ చేయడంతో ఈ అక్రమాలు బయటపడ్డాయని అన్నాడీఎంకే (AIADMK) మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణన్ కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ, జస్టిస్ జి అరుళ్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తన పరిశీలనలో బయటపడ్డ విషయాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లినా.. ఏ చర్య తీసుకోలేదని సత్యనారాయణ తరపు లాయర్ వాదించారు. ఈసీ తరపున స్టాండింగ్ కౌన్సెల్ నిరంజన్ రాజగోపాల్ హాజరయ్యారు. చివరకు త్వరలో SIR ప్రక్రియను EC చేపడుతుందని కోర్టుకు విన్నవించారు. ‘‘BLOలు తమిళనాడు అంతటా ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్రాస్-చెక్ చేస్తారు. మరణించిన లేదా స్థానికంగా లేని వారి పేర్లను జాబితా నుంచి తొలగిస్తారు. కొత్తగా దరఖాస్తుచేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారు.’’ అని కోర్టుకు చెప్పారు.
ఏఐఏడీఎంకే, బీజేపీ(BJP) లాంటి రాజకీయ పార్టీలు కూడా ఎస్ఐఆర్ అమలు చేయాలని వాదిస్తున్నాయి. అయితే అధికార డీఎంకే(DMK), దాని కూటమి భాగస్వాములు ఈ ప్రక్రియపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే అనుకూల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని డీఎంకే నేతలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

