
డీఎంకే–అన్నాడీఎంకేలకు విజయ్ సవాల్
‘విజిల్’ ఊది ఎన్నికల యుద్ధానికి సిద్ధమెన TVK చీఫ్..
తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో మూడో శక్తిగా టీవీకే(TVK)ను నిలబెట్టే లక్ష్యంతో తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్(Vijay) ఎన్నికల ప్రచారాన్ని మహాబలిపురం (Mahabalipuram)లో ప్రారంభించారు. బహిరంగ సభకు ముందు బీచ్ టౌన్‌లోని ఓ రిసార్ట్‌లో పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు.
2019లో విడుదలైన తమిళ చిత్రం బిగిల్లోని ప్రసిద్ధ డైలాగ్ “కప్ ముక్కియం బిగిలు”తో తన ప్రసంగాన్ని ప్రారంభించిన విజయ్, రాష్ట్రంలోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే ప్రత్యక్షంగా బీజేపీకి లొంగిపోయిందని, డీఎంకే పరోక్షంగా అదే దారిలో నడుస్తోందని ఆరోపించారు. “మేము ఎటువంటి ఒత్తిడికీ తలొగ్గము” అని స్పష్టం చేశారు.
విజిల్ గుర్తు ఆవిష్కరణ
ఎన్నికల సంఘం టీవీకేకు ‘విజిల్’ గుర్తును మంజూరు చేయడంతో, ఈ సందర్భంగా విజయ్ ఆ చిహ్నాన్ని ఆవిష్కరించి విజిల్ ఊదారు. ఉత్సాహభరితమైన కార్యకర్తలు ఆయన చుట్టూ చేరి నినాదాలతో సభను హోరెత్తించారు.
ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే, పీఎంకేలు ఎన్డీఏతో పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఒత్తిడిలో తప్పు చేస్తున్న నాయకులకు ఓట్లు వేస్తున్నారని, ఇప్పుడు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. “గత 30 ఏళ్లుగా ఈ పార్టీలు ప్రజలను తక్కువ అంచనా వేశాయి. నేడు ప్రజలే నన్ను నా కెరీర్‌లో అత్యున్నత స్థాయికి తీసుకువచ్చారు” అని పేర్కొన్నారు.
పార్టీ సమష్టి నాయకత్వంపై విశ్వాసం ఉంచాలని కార్యకర్తలను కోరిన విజయ్, “మనం ఎవరి కోసం లేదా దేనికోసం మన రాజకీయాలను రాజీ పడకూడదు” అని హితవు పలికారు.
ప్రజాస్వామ్య యుద్ధం
రాబోయే ఎన్నికలను ప్రజాస్వామ్య యుద్ధంగా అభివర్ణించిన విజయ్, పార్టీ శ్రేణులు ఐక్యంగా, దృఢ సంకల్పంతో పోరాడాలని పిలుపునిచ్చారు. “ఇది కేవలం ఎన్నిక కాదు. మీలో ప్రతి ఒక్కరూ ముందువరుసలో నిలిచిన యోధులే” అని అన్నారు.
టీవీకే ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని స్పష్టం చేసిన ఆయన, ఇతరులకు లొంగిపోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. “ఏ స్నేహపూర్వక శక్తి లేకపోయినా, టీవీకే తన సొంత బలంతోనే గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలను తమిళనాడు స్వాతంత్య్ర సమరయోధులు వేలు నాచియార్, పెరియ మరుదు, చిన్న మరుదులతో పోల్చారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్న శక్తులు దుష్టమైనవని, అవినీతి వారసులని ఆరోపించిన విజయ్, అలాంటి పార్టీలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి తమకు ఉందన్నారు. “ప్రజలను హాని చేయాలనుకునే శక్తుల నుంచి రక్షించడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాము” అని పేర్కొన్నారు. ఉన్నత రాజకీయ సమగ్రతకు కట్టుబడి ఉంటామని, ఎప్పటికీ తమ రాజకీయాలను రాజీ పడమని మరోసారి స్పష్టం చేశారు.

