యూనియన్ బడ్జెట్‌లో కర్ణాటకకు నిధుల కేటాయిస్తారా?
x

యూనియన్ బడ్జెట్‌లో కర్ణాటకకు నిధుల కేటాయిస్తారా?

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ 2025పై సీఎం సిద్ధరామయ్య ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.


కర్ణాటక(Karnataka) ప్రధానంగా GST పరిహారం, నిధుల పంపిణీ, పన్ను ఆదాయంలో తగిన వాటా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, ఐటీ, స్టార్టప్‌లు, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పట్టణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగ అవకాశాలు, సామాజిక సంక్షేమం తదితర అంశాల్లో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ఆశిస్తోంది.

సిద్ధరామయ్య(CM Siddaramaiah) అసంతృప్తి

నిధుల కేటాయింపులో కేంద్రం పక్షపాతపూరితంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాలా సందర్భాల్లో బహిరంగగానే విమర్శించారు. కర్ణాటకకు తగిన వాటా దక్కడం లేదని గతంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు కూడా. "దేశ ఖజానాకు రూ.4.50 లక్షల కోట్లు చెల్లించే కర్ణాటకకు కేవలం రూ.45 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. దేశ జనాభాలో కర్ణాటక పాపులేషన్ 5% మాత్రమే ఉండగా, జీడీపీలో మాత్రం 8.4% వాటా ఉంది. GST కలెక్షన్‌లో రెండో స్థానంలో ఉన్నాం. అయినా తగిన నిధులు రావడం లేదు" అని మండిపడ్డారు.

అప్పర్ భద్ర ప్రాజెక్ట్‌కు నిధులొచ్చేనా?

2023-24 బడ్జెట్‌లో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ (UBP) కోసం రూ.5,300 కోట్లు కేంద్రం ప్రకటించినా.. ఇప్పటికీ ఆ నిధులు విడుదల కాలేదని సిద్ధరామయ్య ఆరోపించారు. "జాతీయ ప్రాజెక్టుల జాబితాలో UBPని ఆలస్యంగా చేర్చడం వల్లే ప్రాజెక్ట్ పురోగతి స్తంభించింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

బెంగళూరు(Bangalore)లో టన్నెల్ రోడ్లు, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు కోసం రూ.90,000 కోట్ల సాయం అవసరమని డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ చెబుతున్నారు. "గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా బెంగళూరు మారిపోయింది. ఇక్కడ 1.50 కోట్ల మంది నివసిస్తున్నారు. మౌలిక వసతుల మెరుగుకు నిధులు కేటాయించాలి" అని ఆయన కోరారు.

వ్యవసాయ రంగానికి..

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ప్రీ-బడ్జెట్ ఆన్‌లైన్ మీటింగ్‌లో రైతులకు రాయితీలు, మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కర్ణాటక వ్యవసాయ మంత్రి ఎన్. చలువరాయస్వామి చౌహన్‌ దృష్టికి తీసుకెళ్లారు. PM-KISAN పథకానికి నిధుల కేటాయింపును పెంచాలని కోరారు. ప్రస్తుతం MSP పరిధిలో రాగి, జొన్న, బాజ్రా మాత్రమే ఉన్నాయని, అన్ని మిల్లెట్లను MSPలో చేర్చాలని చెప్పారు. 92 వాటర్‌షెడ్ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని కూడా కోరారు.

"NABARD నుంచి రాష్ట్రానికి వచ్చే రుణ వాటా గణనీయంగా తగ్గింది. రూ.9,162 కోట్ల నుంచి రూ.2,340 కోట్లకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది" అని చలువరాయస్వామి పేర్కొన్నారు. ఇక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే అటవీ పరిరక్షణ, పచ్చదనం అభివృద్ధికి కేంద్రం మద్దతు కోరారు.

అయితే ఈ సారి అయినా బడ్జెట్‌లో కర్ణాటకకు తగిన వాటా దక్కుతుందా? అన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story