
‘ది ఫెడరల్ కర్ణాటక’ పాత్రికేయులకు ప్రతిష్టాత్మక అవార్డులు..
జర్నలిజంలో విశేష కృషికి నవీన్ అమ్మెంబాల, ప్రభుస్వామి నటేకర్‌కు సన్మానం..
భారతదేశంలో శర వేగంగా ఎదుగుతోన్న డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫాం ‘‘ది ఫెడరల్’’.. నిష్పాక్షిక జర్నలిజం, పదునైన విశ్లేషణలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నిజానికి నిలువెత్తు నిబద్ధతతో, విలువైన సంపాదకీయ రచనలతో ముందుకు సాగుతోంది. ‘ది ఫెడరల్’కు అనుబంధంగా ఉన్న ‘ది ఫెడరల్ కర్ణాటక’ చెందిన ఇద్దరు పాత్రికేయులు.. జర్నలిజం పురస్కారాలను అందుకోవడం మరో కీలక పరిణామం.
‘ది ఫెడరల్’ అసోసియేట్ ఎడిటర్, కన్నడ ఎడిషన్ ‘ది ఫెడరల్ కర్ణాటక’కు నేతృత్వం వహిస్తోన్న నవీన్ అమ్మెంబాలను 2025 సంవత్సరానికి గాను బెంగళూరు ప్రెస్ క్లబ్ అవార్డు వరించింది. 28 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న ఈయన.. వైవిధ్యభరిత కథనాలు, సంపాదకీయ రచనలు, లోతైన పరిశోధనాత్మక కథనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటక శాసన మండలి చైర్మన్ బసవరాజ్ హొరట్టి నవీన్ అమ్మెంబాలకు అవార్డును అందజేశారు.
‘ది ఫెడరల్ కర్ణాటక’ సీనియర్ కరస్పాండెంట్ ప్రభు స్వామి నటేకర్ కర్ణాటక మీడియా అకాడమీ వార్షిక అవార్డు (2025)కు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద రూ. 50వేల నగదు అందుకోనున్నారు. రాబోయే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో అధికారికంగా ఈ అవార్డును నటేకర్‌కు అందజేయనున్నారు.
రిపోర్టింగ్‌లో దాదాపు 18 ఏళ్ల అనుభవమున్న నటేకర్ ఎన్నో విభిన్న కథనాలు రాసినందుకు ఈ అవార్డు దక్కింది.
28 సంవత్సరాల కృషి..
నవీన్ రచనలలో IISc ఉగ్రవాద దాడి (2005), ఐటీ ప్రొఫెషనల్ ప్రతిభా హత్య (2005), 2009లో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి ఉగ్రవాద నిందితుడు పాకిస్తాన్‌కు ఫోన్ చేయడంపై రాసిన కథనాలు జాతీయ దృష్టిని ఆకర్షించాయి.
నవీన్ అమ్మెంబాల ‘ది ఫెడరల్’ కోసం రాసిన ప్రత్యేక కథనాల్లో కోలార్ టమోటా రైతుల వేదన, ముడా కుంభకోణం ముఖ్యమైనవి. కర్ణాటకలో క్షీణిస్తున్న నక్సలిజంపై సిరీస్‌తో పాటు పరిశోధనాత్మక కథనాలు కూడా రాశారు.
కేరళలో కొండచరియలు విరిగిపడిన తర్వాత వయనాడ్ చోటుచేసుకున్న ఘటనలను తన రచనా శైలితో కళ్లకు కట్టారు. వెనుకబడిన తరగతుల కమిషన్ స్ట్రాంగ్ రూమ్ నుంచి అసలైన కుల జనాభా గణన పత్రం అదృశ్యంపై రాసిన కథనం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.
పరిశోధనాత్మక కథనాలకు..
లోకాయుక్త , నేరాలు, రాజకీయాలతో ముడిపడి ఉన్న వార్తలను రావడంలో ప్రభుస్వామిది ప్రత్యేక శైలి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల సామూహిక ఖననాలపై ఆయన గ్రౌండ్ రిపోర్టింగ్ ఆకట్టుకుంది. మధ్యాహ్న భోజన పథకం, ఇటీవలి బళ్లారి బ్యానర్ ఘర్షణ, ఇతర ఎన్నో పరిశోధనాత్మక కథనాలు కూడా రాశారు.
ఫిబ్రవరి 2024లో ప్రారంభించిన ‘ది ఫెడరల్ కర్ణాటక’ వెబ్‌సైట్.. సంవత్సరంలోపే ది ఫెడరల్ కర్ణాటక(Karnataka) YouTube ఛానెల్‌కు 2.6 మిలియన్ల వ్యూయర్‌షిప్‌తో 62వేల మంది సబ్‌స్క్రైబర్‌లున్నారు. ది ఫెడరల్‌కు అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ‘ది ఫెడరల్ తెలంగాణ’ పేరిట మరో రెండు వెబ్‌సైట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు ‘ది ఫెడరల్ దేశ్’ - హిందీ ఎడిషన్ కూడా ఉంది.

