కరూర్ ఘటన తరువాత పార్టీ కార్యకలాపాలు ప్రారంభించిన టీవీకే
x
టీవీకే మొదటి అడ్మినిస్ట్రేటివ్ మీటింగ్

కరూర్ ఘటన తరువాత పార్టీ కార్యకలాపాలు ప్రారంభించిన టీవీకే

వచ్చే నెలలో మొదటి జనరల్ బాడీ సమావేశం ఉంటుందని ప్రకటన


మహాలింగం పొన్నుస్వామి

కరూర్ తొక్కిసలాట తరువాత బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించడంతో టీవీకే పార్టీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. చెన్నైలోని ఈసీఆర్ పనైయూర్ లోని టీవీకే కేంద్ర కార్యాలయంలో బుధవారం తన మొదటి పరిపాలనా కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.
టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విజయ్ ప్రజాయాత్ర, ఎన్నికల వ్యూహాలు, సర్, ఎన్నికల చిహ్నంపై సంప్రదింపులు వంటి వాటిపై కూలంకషంగా చర్చించారు. కమిటీ తన సిఫార్సులను తుది ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడు విజయ్ కు సమర్పించాలని అభిప్రాయపడింది.
పార్టీని స్తంభింపజేయాలని ఉద్దేశం..
సమావేశం తరువాత టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ రోజు మా మొదటి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సమావేశం. పార్టీ కార్యకలాపాలు, ఎన్నికల సన్నాహాలపై చర్చించాము. కోర్టు అనుమతి తరువాత మా తదుపరి పర్యటన వివరాలను త్వరలో వెల్లడిస్తాము’’ అని ఆయన అన్నారు.
కరూర్ బాధితులను కలవడంలో జాప్యంపై విమర్శలపై నిర్మల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కరూర్ సంఘటన జరిగిన రోజు, టీవీకే కార్యకర్తలపై దాడి జరిగింది. పార్టీని స్తంభింపజేయాలని కుట్ర పన్నారు. విజయ్ వాహానాన్ని చుట్టుముట్టిన 2,500 ద్విచక్ర వాహానాల వివరాలు మా దగ్గర ఉన్నాయి.
బహిరంగ ప్రదేశంలో మేము ఏమి చేయలేకపోయాము. పోలీసులు ఎలాంటి సహాయం అందించలేదు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ దీనిని అనియంత్రిత గుంపు అన్నారు. అంటే వారిని ఎవరూ కంట్రోల్ చేయలేరని అర్థమా?’’ అని ఆయన ప్రశ్నించారు.
పోలీసుల నిర్లక్ష్యం, లాజిస్టిక్స్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఒక గంట ప్రయాణానికి తమకు ఏడు గంటల సమయం పట్టిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. పోలీసులు సరైన భద్రతా సహకారం అందించలేదని విమర్శించారు. అది జరిగితే ఇలాంటి దుర్ఘటన జరిగేది కాదన్నారు.
ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నాం..
విలేకరుల సమావేశంలో పొత్తుల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల అన్నాడీఎంకే సమావేశాలలో టీవీకే పార్టీ జెండాలు కనిపించాయి. దీనిపై ఆయన తమ వైఖరిని వెల్లడించారు. ‘‘ మా వైఖరి ఒక నెల క్రితం మాదిరిగానే ఉంది. మా నాయకుడి బహిరంగ ప్రచారం కొనసాగుతుంది. హెలికాప్టర్ ప్రచారం గురించి వాదనలు కేవలం ఊహగానాలు మాత్రమే’’
ఈ సమావేశంలో ఓటర్ల జాబితా పై రాబోతున్న ‘సర్’ పై కూడా మాట్లాడారు. ఈ విషయంపై అఖిలపక్ష సంప్రదింపుల కోసం డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం నుంచి టీవీకే కి ఆహ్వానం అందింది. ఇందులో సీనియర్ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది.
టీవీకే జనరల్ సెక్రటరీ మాజీ ఐఆర్ఎస్ అరుణ్ రాజ్ ది ఫెడరల్ తో మాట్లాడారు. పార్టీ ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తుందని అన్నారు. ‘‘టీవీకే ఎస్ఐఆర్ ను పూర్తిగా వ్యతిరేకిస్తుంది. బీహార్ లో ఈసీ ఇలాంటి ఓటర్ల జాబితా సవరణను ప్రకటించింది. మేము దానిని ఖండించాము.
ఎస్ఐఆర్ ముసుగులో నకిలీ ఓటర్లను కలపడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్దం’’ అన్నారు. ఆ పార్టీ తన సైద్దాంతిక విరోధి అయిన బీజేపీని వ్యతిరేకిస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం..
నవంబర్ 5 న ఉదయం 10 గంటలకు మహాబలిపురం ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో విజయ్ టీవీకే ప్రత్యేక జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ముందు పార్టీ రోడ్ మ్యాప్ ను ఈ సమావేశం వివరిస్తుందని భావిస్తున్నారు.
సెప్టెంబర్ 27 న కరూర్ లో ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, 100 మందికి పైగా గాయపడిన నేపథ్యంలో విజయ్ పై అధికార డీఎంకే వ్యతిరేక ప్రచారం చేస్తోందని టీవీకే ఆరోపిస్తోంది. ఈ సంఘటన తీవ్ర రాజకీయ, చట్టపరమైన చర్చలకు కారణమైంది.
టీవీకే పార్టీ దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతోంది.
సీనియర్ జర్నలిస్ట్ సావిత్రి కన్నన్ సీబీఐ దర్యాప్తు నిష్పాక్షితను ప్రశ్నించారు. ‘‘సీబీఐ దర్యాప్తు న్యాయంగా జరుగుతుందా? టీవీకే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది. ఇదే నిజమైన పరీక్ష’’ అని ఆయన ది ఫెడరల్ తో అన్నారు.
టీవీకే పార్టీ ప్రచారాలను ప్రారంభించడం ఇప్పుడు మరో ముల్లులా ఆ పార్టీకి తగులుతోంది. కరూర్ తరువాత తమిళనాడు ప్రభుత్వం రాజకీయ ర్యాలీలకు అనుమతి నిరాకరిస్తోంది. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టు ఎన్నికల ర్యాలీలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని ఆదేశించింది.
ప్రస్తుత పరిస్థితులు విజయ్ నాయకత్వాన్ని కూడా పరీక్షిస్తున్నాయి. ‘‘పార్టీలోని అంతర్గత సమస్యలను ఇప్పుడు విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. విజయ్ ఒక సినిమా నటుడి నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారలేదు. ఇది అతని పనా.. లేక అతని చుట్టూ ఉన్న కోటరి పనా? మనం చూడాలి’’ అని కన్నన్ అన్నారు.


Read More
Next Story