
ఢిల్లీలో అమిత్ షాతో టీటీవీ దినకరన్ భేటీ
2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమితో జతకడుతున్న పార్టీలు..
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్(Dhinakaran) నిన్న (జనవరి 8న) ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah)ను తన నివాసంలో కలిశారు. వీరిద్దరి సమావేశం దాదాపు 15 నిమిషాల పాటు సాగింది. ఇటీవల ఏఐఏడీఎంకె(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) ఢిల్లీలో షాను కలిసిన విషయం తెలిసిందే. ఎన్డీఏ కూటమితో దినకరన్ జతకట్టడాన్ని పళనిస్వామి అంగీకరించిన నేపథ్యంలో షాతో దినకరన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
దినకరన్ గతంలో EPS నాయకత్వాన్ని తోసిపుచ్చారు. అయితే ఇటీవల జరిగిన AMMK జనరల్ కౌన్సిల్ సమావేశంలో తన వైఖరి మార్చుకున్నారు. "శత్రువులను" ఓడించి "అమ్మ పాలనను" తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పొత్తుకు సిద్ధమని ప్రకటించారు.
తమిళనాడు దక్షిణ జిల్లాల్లో తేవర్ సామాజిక వర్గ ఓటర్లు అధికం. దాదాపు 35 నియోజకవర్గాలలో వీరి ఓటు బ్యాంకు ఎక్కువ. వీరంతా దినకరన్ మద్దతుదారులు. దీంతో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఓట్లు పడతాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
ఎన్డీఏ కూటమితో దినకరన్ జతకట్టడంపై ఢిల్లీలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు ..DMKకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో తాము చేతులు కలిపేందుకు సిద్ధమని పళనిస్వామి సమాధానమిచ్చారు. అయితే O పన్నీర్‌సెల్వం (OPS), VK శశికళ విషయంలో విముఖత చూపినట్లు సమాచారం.
దినకరన్ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయకపోవచ్చని, ఆయన రాజ్యసభ సీటు ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల మాట. మొత్తంమీద AMMK చేరిక NDAను మరింత బలోపేతం చేస్తుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో AIADMK, BJP, PMK మరియు తమిళ మానిల కాంగ్రెస్ ఉన్నాయి. తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ఈ కొత్త పరిణామం నటుడు విజయ్ తమిళగ వెట్రీ కజగం (టీవీకే)పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

