
గవర్నర్ టీ విందును బహిష్కరించిన తమిళనాడు ప్రభుత్వం
పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ కూడా..
గణతంత్ర దినోత్సవం(Republic Day) సందర్భంగా చెన్నై గిండిలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్ఎన్ రవి(Ravi) ఇచ్చే సాంప్రదాయ టీ పార్టీని తమిళనాడు(Tamil Nadu) ప్రభుత్వం బహిష్కరించింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి పార్టీలు (కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకే, ఎండీఎంకే) కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ఈ సాయంత్రం గవర్నర్ ఇచ్చే టీ పార్టీలో తమిళనాడు ప్రభుత్వం పాల్గొనదు. రాష్ట్రం తరపున మంత్రులు ఎవరూ హాజరు కారు" అని అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
రిపబ్లిక్ వేడుకలకు హాజరైన గవర్నర్, సీఎం..
అయితే అంతకుముందు రోజు చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి జాతీయ జెండాను ఎగురవేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Stalin) కూడా ఆయన పక్కన నిలబడి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ డీఎంకే(DMK) మహిళా సదస్సులో పాల్గొనడానికి తంజావూరుకు బయలుదేరారు. ఆ తరువాత ఏర్పాటుచేసిన గవర్నర్ టీ పార్టీకి కూడా వారు హాజరుకాలేదు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు పంపకుండా తన వద్ద ఉంచుకోవడంపై గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలున్న విషయం తెలిసిందే.
హాజరయిన మాజీ మంత్రులు..
అన్నాడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి ఈ కార్యక్రమానికి హాజరుకాకుండా కోయంబత్తూరుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయన హాజరుకాకపోవడంతో మాజీ మంత్రులు డి జయకుమార్, వలర్మతి, బెంజమిన్ పార్టీ తరపున పాల్గొన్నారు. పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ రామదాస్ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించారు. అయితే చీఫ్ సెక్రటరీ మురుగానందం, యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఇన్‌చార్జ్) వెంకటరామన్ సహా సీనియర్ అధికారులు టీ పార్టీలో పాల్గొన్నారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్ ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. గత నాలుగు సంవత్సరాలుగా గవర్నర్ తన ప్రారంభ ప్రసంగం చేయకుండానే అసెంబ్లీ సమావేశాల నుంచి పదేపదే వాకౌట్ చేశారు. దీంతో గవర్నర్ అధ్యక్షత వహించే విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలలో ప్రభుత్వం తరుపున ఎవరూ హాజరుకాలేదు.
గత సంవత్సరం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ టీ విందును బహిష్కరించారు. ఉన్నత విద్యా మంత్రి గవర్నర్ పాల్గొన్న విశ్వవిద్యాలయ కార్యక్రమాలకు హాజరు కావద్దని ఆదేశించారు. అదే పద్దతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా విస్తరించింది.
‘కీలక బిల్లులు పక్కన పెట్టారు..’
2025 చివరి నాటికి గవర్నర్‌గా రవి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 182 బిల్లులను అందుకున్నారు. లోక్ భవన్ ప్రకారం 152 బిల్లులకు ఆమోదం లభించింది. ఐదు బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. మరికొన్నింటిని రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేసింది. అయితే విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమంపై కీలక చట్టాలను నిలిపివేయడం, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందన్నది డీఎంకే ప్రభుత్వం ఆరోపణ.

