
సీపీఐ(ఎం)కి గుడ్‌బై చెప్పిన ఐషా పొట్టి..
కాంగ్రెస్‌లో చేరిక; కేరళ రాజకీయాల్లో కొత్త మలుపు..
కేరళ(Kerala) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు పి. ఐషా పొట్టి(Aisha Potty) అధికార లెఫ్ట్ CPI(M)పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరారు. కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ సమక్షంలో తిరువనంతపురంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఘన స్వాగతం పలికింది. మూడు సార్లు ఎమ్మెల్యేగా ప్రజలను ప్రాతినిధ్యం వహించిన ఆమె నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ మారడానికి కారణాలేంటి?
సీపీఐ(ఎం)లో తనకు అన్యాయం జరిగిందనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐషా వెల్లడించారు. “నేను చేరిన నాటి నుంచి పార్టీ పూర్తిగా మారిపోయింది. ప్రజా సమస్యల కంటే అంతర్గత రాజకీయాలకే ప్రాధాన్యం పెరిగింది. అందుకే పార్టీని వీడాల్సి వచ్చింది,” అని పేర్కొన్నారు.
ఐషా రాజకీయ ప్రస్థానం..
వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఐషా.. కేరళలోని కొట్టారక్కర నియోజకవర్గం నుంచి 2006, 2011, 2016 ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2006లో అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత ఆర్. బాలకృష్ణ పిళ్లైను ఓడించి రాజకీయంగా గుర్తింపు పొందారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఆమెకు టికెట్ నిరాకరించడంతో పార్టీతో విభేదాలు బహిర్గతమయ్యాయి.
సతీశన్ హర్షం..
ఐషా చేరికపై ..“ఐషా ప్రజల విశ్వాసం చూరగొన్న నాయకురాలు. ఆమె అనుభవం కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుంది,” అని ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ వ్యాఖ్యానించారు. ఐషా కాంగ్రెస్‌లో చేరడం ద్వారా యూడీఎఫ్‌కు బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించే అవకాశముందని భావిస్తున్నారు.

