ఆ స్థలాలు తిరిగి ఇచ్చేస్తా: సీఎం సిద్ధరామయ్య భార్య లేఖ..కారణమేంటి?
x

ఆ స్థలాలు తిరిగి ఇచ్చేస్తా: సీఎం సిద్ధరామయ్య భార్య లేఖ..కారణమేంటి?

నా భర్త గౌరవం కంటే ఆస్తి, సంపద, ఇల్లు ఏవీ ముఖ్యం కాదు. అందువల్ల వివాదానికి కారణమైన నా 14 స్థలాలను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నా” - సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి


ముడా భూ కేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన భార్య పార్వతి రాసిన లేఖ కర్ణాటకలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివాదస్పద 14 స్థలాలను తిరిగి ఇచ్చేస్తానని ముడా కమిషనర్‌కు ఆమె లేఖ రాశారు.

లేఖ సారాంశమిది..

మైసూరులోని కసబా హోబ్లీ పరిధిలోని కేసరే గ్రామంలో తనకున్న 3 ఎకరాల 16 గుంటల భూమికి బదులుగా మైసూరులోని విజయనగర్‌లో 14 స్థలాలను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. అందులో “సేల్ డీడ్‌ను రద్దు చేసుకోవడం ద్వారా నాకు కేటాయించిన 14 స్థలాలను తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. MUDA వాటిని స్వాధీనం చేసుకోవచ్చు' అని రాశారు.

భూకేటాయింపులకు సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని కర్ణాటక లోకాయుక్త పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ లేఖ బయటకు రావడం చర్చనీయాంశమైంది.

లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు..

స్థలాల కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీఎంను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయమూర్తి గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఆయనపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేయాలని కూడా సూచించారు. లోకాయుక్త పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా PMLA కింద సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 27న నమోదు చేసిన కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి పేర్లతో పాటు దేవరాజు పేరు కూడా చేర్చారు. దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి 3 ఎకరాల 16 గుంటల భూమికి కొని దాన్ని తన సోదరి పార్వతికి గిప్ట్‌డీడ్‌గా రాసిచ్చారు. లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ED మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కింద కేసు నమోదు చేసింది.

ప్రజలకు మరో లేఖలో..

ముడా కమిషనర్‌కు లెటర్ రాసిన పార్వతి, ప్రజలనుద్దేశించి మరో లేఖ కూడా రాశారు. ‘‘సిద్ధరామయ్య మచ్చలేని ప్రజా జీవితాన్ని గడిపారు. ఆయనను చెడ్డపేరు రాకుండా నేనూ నడుచుకున్నా. ముడా సైట్లకు సంబంధించి ఆయనపై ఆరోపణలు రావడంతో నేను చాలా ఆమె బాధపడ్డా. నా సోదరుడు నాకు కానుకగా ఇచ్చిన భూమి ఇంత వివాదానికి దారి తీస్తుందని ఊహించి ఉంటే అసలు వాటి జోలికి వెళ్లేదాన్ని కాదు. నా భర్తపై కావాలని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అవి నన్ను చాలా బాధించాయి. నా భర్త గౌరవం కంటే ఆస్తి, సంపద, ఇల్లు ఏవీ ముఖ్యం కాదు. అందువల్ల వివాదానికి కారణమైన నా 14 స్థలాలను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నా” అని పేర్కొన్నారు.

‘మహిళలను రాజకీయాల్లోకి లొగొద్దు..’

ఈ నిర్ణయం తీసుకునే ముందు తన భర్త సిద్ధరామయ్య, తన కుమారుడు యతీంద్ర అభిప్రాయాన్ని తీసుకోలేదని సీఎం భార్య స్పష్టం చేశారు. తన భర్తపై జరిగిన రాజకీయ కుట్రకు వ్యతిరేకంగా పోరాడాలని భావించినందువల్ల ఇప్పటివరకు స్థలాలను తిరిగి ఇవ్వలేదని పార్వతి చెప్పారు. రాజకీయ నాయకుల కుటుంబాల్లోని మహిళలను రాజకీయ కుట్రల్లోకి లాగి, పరువు తీయవద్దని ఆమె ప్రతిపక్షాలను, మీడియాను కోరారు.

‘లేఖ రాయడమంటే తప్పును అంగీకరించడమే..’

పార్వతి రాసిన లేఖపై బీజేపీ నేతలు స్పందించారు. ‘కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆమె స్థలాలను తిరిగి ఇచ్చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తప్పు అంగీకరిస్తూ..తన (సిద్దరామయ్య) రాజీనామా లేఖను పంపడానికి బదులుగా పశ్చాత్తాప లేఖను పంపారు’’ అని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్ల అన్నారు. “ఏ తప్పు చేయకపోతే, మీరు ఎందుకు ఆ స్థలాలు తిరిగి ఇస్తున్నారు? అది కూడా హైకోర్టు, ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక. ఇప్పుడు ఆమె లేఖ పని చేయదు. సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదు'' అని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు.

సీఎం సమాధానమేంటి?

ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో సిద్ధరామయ్య విపక్షాలపై గతవారం విరుచుకుపడ్డారు. ‘‘ప్రతిపక్షాలు నన్ను చూసి భయపడుతున్నాయి. నన్ను ఏం చేయలేక.. చివరకు ముడా స్థలాల కేటాయింపును అడ్డం పెట్టుకుని అప్రతిష్ట పాలు చేయాలని కుట్రపన్నారు. నేను ఏ తప్పు చేయలేదు. సీఎం పదవికి రాజీనామా చేయను. కేసుపై న్యాయపరంగా పోరాడతా’’ అని 76 ఏళ్ల సిద్ధరామయ్య పేర్కొన్నారు.

Read More
Next Story