ద్రవిడ్ కు కోపం తెప్పించిన ఆటో డ్రైవర్..
రాహుల్ నడుపుతున్న ఎస్ యూవీని వెనక నుంచి ఢీ కొట్టిన ఆటోవాలా
రాహుల్ ద్రావిడ్.. అంటే కూల్ గా ఉంటాడు.. ఎదుట ఎంత పెద్ద బౌలర్ అయిన, ఎంతలా కవ్వించినా తన ఏకాగ్రత కోల్పోడు. కానీ అలాంటి ద్రావిడ్ కు విపరీతమైన కోపం తెప్పించాడు ఓ ఆటోవాలా.
వివరాల్లోకి వెళితే.. బెంగళూర్ లోని తన కారును ఓ ఆటోవాలా ఢీ కొట్టడంతో ద్రావిడ్ సహనం కోల్పోయాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నగరంలోని కన్నింగ్ హమ్ రోడ్డులోని ఓ ఆటోడ్రైవర్ వేగంగా వచ్చిన ద్రావిడ్ కారును ఢీ కొట్టడంతో కారు దిగి బయటకు వచ్చిన ‘దివాల్’ డ్రైవర్ తొ వాగ్వాదానికి దిగాడు. ఈ క్లిప్ ను ఎవరో ఒక యూజర్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఇది ఫిబ్రవరి 4న పోస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఆటో డ్రైవర్ తప్పు అని తేల్చిన నెటిజన్లు..
ఆ వీడియోలో మాజీ కెప్టెన్ ద్రావిడ్ కు చెందిన ఎస్ యూవీని ఆటో డ్రైవర్ వెనక నుంచి ఢీ కొట్టడంతో ద్రావిడ్ కన్నడలో వాదిస్తూ .. తన కారును ఎందుకు ఢీ కొట్టావని గొడవకు దిగినట్లు కనిపిస్తోంది.
డ్రైవర్ కూడా ఏదో చెబుతున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇద్దరిలో ఎవరికి కూడా అదృష్టవశాత్తూ గాయాలు కాలేదు. ఇందులో చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ.. ఆటో డ్రైవర్ దే తప్పు అని తీర్పు ఇచ్చేశారు. మరికొంతమంది అయితే తప్పు ఎవరిదో చెప్పడం కష్టమన్నారు.
‘‘ ఆటో అన్నలను ఆపడం అసాధ్యం.. రాహుల్ ద్రవిడ్ కూడా వారిని అధిగమించడానికి కష్టపడుతున్నాడు. వారు ప్రతి ఖాళీలోకి దూరి బెంగళూర్ ట్రాఫిక్ ను మరింత అస్తవ్యస్థం చేస్తారు. వారికి ట్రాఫిక్ రూల్స్ లేనట్లు కనిపిస్తాయి.’’ అని ఓ వినియోగదారుడు బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు.
Auto Annas are unstoppable— even Rahul Dravid would struggle to outmaneuver them! They squeeze into every possible gap, making Bengaluru’s traffic even more chaotic. For them, traffic rules seem nonexistent! @blrcitytraffic
— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) February 4, 2025
pic.twitter.com/Z0ijYOKLbg
స్పష్టత లేదు
‘‘ఘటనకు సంబంధించిన వీడియో కేవలం పది సెకన్లు మాత్రమే ఉంది. ఏమి జరిగిందో అందులో స్పష్టత లేదు. ఎవరు తప్పు చేశారో చెప్పడం కష్టంగా ఉంది. పైగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన మనందరికి బాగా తెలుసు. కానీ స్పష్టత లేకుండా ఫలానా వారే తప్పు చేశారని చెప్పడం సరికాదు’’ అని మరొక వినియోగదారుడు కామెంట్ చేశారు.
మొత్తానికి ఎంతో ప్రశాంతగా ఉండే రాహుల్ ద్రావిడ్ కు కోపం తెప్పించిన ఆటో డ్రైవర్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేసి నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ద్రావిడ్ ఐపీఎల్ లోని రాజస్థాన్ రాయల్స్ కు ప్రధాన కోచ్ గా ఉన్నారు. గత ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించిన తరువాత కోచ్ గా తప్పుకున్నాడు.