
Shashi Tharoor
‘నేను కాంగ్రెస్‌లోనే ఉంటా..’
పార్టీ మారతారని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ శశి థరూర్
నేను కాంగ్రెస్‌లోనే కొనసాగుతా. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ తరపున ప్రచారం చేస్తా. విజయం కోసం శ్రమిస్తా - తిరువనంత:పురం ఎంపీ శశి థరూర్..
కాంగ్రెస్(Congress)లో అంతర్గత అసంతృప్తులు, కేరళ(Kerala)లో నాయకత్వ సమీకరణాలపై చర్చలు ముదురుతున్న వేళ.. తన వ్యాఖ్యలను బీజేపీ(BJP) అనుకూలంగా మలిచే ప్రయత్నాలపై శశి థరూర్(Shashi Tharoor) క్లారిటీ ఇచ్చారు. తాను ప్రభుత్వానికో, భారతదేశానికో అనుకూలంగా మాట్లాడానేగానీ బీజేపీ వైపు వెళ్లలేదని చెబుతూజ.. పార్టీ పట్ల తన నిబద్ధతను మరోసారి రుజువు చేసే ప్రయత్నం చేశారు థరూర్. కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో థరూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
‘మీడియా అలా అర్థమైంది..’
‘‘నా వ్యాఖ్యలు బీజేపీ(BJP)కి అనుకూలంగా ఉన్నాయని మీడియా భావించి ఉండవచ్చు. అయితే అవి ప్రభుత్వానికి లేదా దేశ ప్రయోజనాలకు అనుకూలమైనవి మాత్రమే.’’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ స్పష్టం చేశారు.
‘‘కొన్ని అంతర్జాతీయ అంశాలపై రాజకీయ కోణంలో మాట్లాడటం నాకు ఇష్టముండదు. దేశ ప్రయోజనాల కోణంలోనే స్పందిస్తా’’ అని గతంలోనే స్పష్టం చేశానని థరూర్ గుర్తు చేశారు. “ఇది కొత్త విషయం కాదు. నేను ఎప్పుడూ ఇదే చెబుతుంటాను,” అని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ విలేకరులతో అన్నారు.
గత సంవత్సరం భారత్–పాకిస్తాన్ సంబంధాలు, పహల్గామ్ దాడి అనంతర దౌత్యపర పరిణామాలపై థరూర్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అవి కాంగ్రెస్ అధికారిక వైఖరికి భిన్నంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తగా, పలువురు పార్టీ నాయకులు ఆయన ఉద్దేశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. పార్టీ సభ్యుడిగా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించకూడదనే విషయాన్ని తాను అంగీకరిస్తానని చెప్పారు.
“నేను ఎప్పుడూ పార్లమెంటులో కాంగ్రెస్‌తోనే నిలబడ్డాను. అందుకే ఎలాంటి ఆందోళన అవసరం లేదు,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని వీడతారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ..“నేను కాంగ్రెస్‌లోనే ఉంటాను. ఎక్కడికీ వెళ్లను. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్(UDF) తరపున ప్రచారం చేస్తా. యూడీఎఫ్ విజయం కోసం పనిచేస్తాను,” అని థరూర్ స్పష్టం చేశారు.
పార్టీ మార్పుపై వచ్చిన ఊహాగానాలపై గురువారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని గురువారం థరూర్ సమావేశమయ్యారు. అనంతరం “అంతా బాగానే ఉంది” అని, “మనమంతా ఒకే వైపున ఉన్నాం” అని థరూర్ వ్యాఖ్యానించారు.
ఇటీవల కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో తనకు ఎదురైన అనుభవం, కేరళలో తనను పక్కన పెట్టేందుకు కొందరు నాయకులు చేసిన ప్రయత్నాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్.. వామపక్షాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

