
తమిళనాడులో తప్పుల తడకగా ముసాయిదా ఓటరు జాబితా
పార్టీ నేతల మధ్య వాగ్వాదం..సవరణలకు అవకాశం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
తమిళనాడులో ఎన్నికల కమిషన్ (EC) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (S.I.R) ప్రక్రియలో చాలా లోపాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 19న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో బతికి ఉన్న ఓటర్లను మృతులుగా చూపడం, మృతుల పేర్లు ఓటరు జాబితాలో ఉండిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది.
తన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో సాలెం జిల్లా ఎడప్పలాయం ప్రాంతానికి చెందిన కే. రాగు షాక్‌కు గురయ్యాడు. అధికారిక రికార్డుల్లో తాను చనిపోయినట్లు నమోదై ఉండటంతో తన ఓటు హక్కు తొలగించినట్లు రాగు తెలుసుకున్నాడు. “నేను బతికే ఉన్నా. అయినా నేను చనిపోయినట్లు చూపించి ఓటరు జాబితా నుంచి నా పేరును తొలగించారు” అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన పేరును తిరిగి చేర్చాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు రాగు.
ఆరేళ్ల క్రితం మరణించిన ప్రముఖ కవి, గాయకుడు పులమైపితన్ పేరు ఇంకా జాబితాలో ఉండడం ఓటరు జాబితా తప్పుల తడక అని చెప్పడానికి మరో ఉదాహరణ.
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం.. S.I.R ప్రక్రియలో తమిళనాడులో మొత్తం 97.37 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.44 కోట్లకు తగ్గింది. తొలగించినవారిలో 26.94 లక్షల మంది మృతులుగా, 66.44 లక్షల మంది వలస వెళ్లిన లేదా రాష్ట్రం విడిచిపోయినవారిగా, 3.39 లక్షల మంది డబుల్ ఎంట్రీలుగా నమోదయ్యారని ఈసీ పేర్కొంది. రాజధాని చెన్నైలోనే 14.25 లక్షల ఓటర్లు జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 35 శాతానికి పైగా ఉండటం గమనార్హం.
పార్టీల మధ్య వాగ్వాదం..
ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య వాగ్వాదాలు మొదలయ్యాయి. S.I.R ప్రక్రియను అధికార DMK తప్పబట్టింది. తొందరపాటు నిర్ణయాలతో అమలు చేసిన S.I.R వల్ల నిజమైన ఓటర్లు తమ హక్కును కోల్పోయారని ఆరోపించింది. మరోవైపు AIADMK, BJP పార్టీలు మాత్రం ఈసీ తొలగించిన ఓటర్లు బోగస్ ఓటర్లేనని సమర్థించుకున్నాయి.
DMK ఐటీ విభాగ నేత గోవి లెనిన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “మృతులేమో ఇంకా ఓటర్లుగా ఉన్నారు. బతికున్నవారు తమ పేర్లు వెతుక్కుంటున్నారు” అంటూ ఈసీని తప్పుబట్టారు.
కాగా ఓటర్ల జాబితాలో లోపాల సవరణకు ఫారం–6, ఫారం–8 ద్వారా జనవరి 18 వరకు అవకాశం ఉందని, తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరిలో విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొంది.

