
వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతివ్వం..
ముస్లింల హక్కులను కాలరాసేలా ఉందన్న తమిళనాడు సీఎం స్టాలిన్.. మద్దతు తెలిపిన ఏఐఏడీఎంకే.. వాకౌట్ చేసిన బీజేపీ
వక్ఫ్ (సవరణ) బిల్లు -2024ను తమిళనాడు(Tamil Nadu) అసెంబ్లీ వ్యతిరేకించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (CM Stalin) శాసనసభలో గురువారం (మార్చి 27న) బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం హక్కులను కాలరాసేలా ఉన్న ఈ బిల్లు(Waqf Bill)కు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. కేంద్రం కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. స్టాలిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)తో సహా హాజరైన చాలా పార్టీలు మద్దతు తెలిపాయి. స్టాలిన్ తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని ఎఐఎడిఎంకె సీనియర్ నేత వేలుమణి చెప్పారు. ఎఐఎడిఎంకె ముస్లింల ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
అయితే స్టాలిన్ తీర్మానాన్ని బీజేపీ(BJP) తిరస్కరించింది. ఆ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు ముందే వాకౌట్ చేశారు. డీఎంకే రాజకీయ లబ్ది కోసం కేంద్రాన్ని వ్యతిరేకిస్తోందని వాకౌట్‌కు నాయకత్వం వహిస్తున్న వానతి శ్రీనివాసన్ తెలిపారు.
ఏమిటీ వక్ఫ్ చట్టం?
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఆ తర్వాత పలుమార్లు వక్ఫ్ చట్టాన్ని సవరించారు. 1995లో వక్ఫ్ చట్టానికి మరిన్ని అధికారాలను కట్టబెట్టారు. 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 2 ప్రభుత్వం మరోసారి సవరణ చేసింది. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలు కల్పించింది. బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేలా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.
సవరణ చట్టంలో ఏముంది?
ఇండియన్ ఆర్మీ, రైల్వే శాఖ తర్వాత దేశంలో ఎక్కువ భూములు వక్ఫ్ బోర్డుల పరిధిలో ఉన్నాయని కేంద్రం చెప్పింది. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డులకు విస్తృత అధికారాలు కట్టబెట్టాయని.. వక్ఫ్ బోర్డు ఆస్తులు 2009 తర్వాత రెట్టింపు అయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇతర మతాలకు చెందిన మఠాలకు, ట్రస్ట్‌లకు, సొసైటీలకు లేని అపరిమిత అధికారాలను..వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారన్నది కేంద్రం వాదన. అందుకే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చారు.