రష్యాలో ఆయుర్వేద ముద్ర వేసిన ఓ కేరళ డాక్టర్ కథ!
x

ఆయుర్వేద డాక్టర్ మడోనా (photo courtesy-Gate way to Russia)

రష్యాలో ఆయుర్వేద ముద్ర వేసిన ఓ కేరళ డాక్టర్ కథ!

కేరళ అలెప్పీ (Alleppey)లో పుట్టిపెరిగిన డాక్టర్ మడోనా ఇప్పుడు రష్యాలో ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. శరీరంతో పాటు ఆత్మకూ వైద్యం అందిస్తున్నారు.


లికాలం.. కుప్పలు కుప్పలుగా మంచుతో నిండిన రష్యా వీధుల్లో ఓ భారతీయ యువతి హాయిగా నడుస్తోంది. వణికిస్తున్న చలిలో మంచు గడ్డలతో ఆటలాడుకుంటూ ముందుకు సాగుతోంది. చిన్ననాటి కోరికను ప్రత్యక్షంగా ఆస్వాదిస్తూ గెంతులేస్తోంది. ఏమి హాయిలే హలా అటూ ముందుకు . పేరు మెడోనా టోమీ (Dr Medona Tomi). ఆయుర్వేద వైద్యురాలు. ఇండియాలోని కేరళ రాష్ట్రం. అలప్పుజా లేదా అలెప్పీ (Alappuzha, Alleppey) అనే చిన్న నగరంలో పుట్టిపెరిగారు. ఇప్పుడు రష్యాలో ఆయుర్వేద వైద్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. శరీరానికి మాత్రమే కాదు, ఆత్మకు కూడా వైద్యం అందిస్తున్నారు.

సరి కొత్త ప్రపంచానికి...
మెడోనాకి చిన్నతనం నుంచే వైద్య రంగం పై ఆసక్తి మెండు. సాధారణ మెడిసిన్ కంటే ఆయుర్వేదం అంటే మక్కువ. భారతదేశ ఆయుర్వేద సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే కల ఆమెను రష్యా దాకా తీసుకువెళ్ళింది. 2019లో సెయింట్ పీటర్స్‌బర్గ్ (Saint Petersburg) నగరంలోని ‘ఆయుర్దారా’ ఆయుర్వేద కేంద్రంలో పని చేయడం ప్రారంభించింది.

ఆయుర్వేద డాక్టర్ మడోనా (photo courtesy-Gate way to Russia)

మంచుతో తొలి పరిచయం...
మెడోనాకు రష్యా గురించి తెలిసినదల్లా ఒక చిన్న మత్రోష్కా బొమ్మ మాత్రమే. కానీ, రష్యా వచ్చాక ఆమె ప్రపంచమే మారిపోయింది. మొదటిసారి మంచును చూస్తూ చిన్న పిల్లలా ఎగిరిగంతులేసింది. ఉల్లాసంగా, ఉత్సాహంగా డాన్స్ చేసింది. "ఇండియాలో ప్రత్యేకించి కేరళలో మంచు ఉండదు. నేను దాన్ని తాకాలని, ఆటాడుకోవాలని ఉండేది. మంచును చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎంతో అనుకున్నాను" అని ఆమె సంతోషంగా గుర్తు చేసుకుంటుంది.
మానసిక ప్రశాంతత కోసం వైద్యం...
మెడోనా మాటల్లో చెప్పాలంటే... రష్యన్లూ భారతీయుల్లాగే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటారు. అయితే, ప్రధాన తేడా తీవ్ర ఒత్తిడి. రష్యాలో ప్రజలు ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారని ఆమె గమనించింది. అందుకే మెడోనా ఆయుర్వేదంతో పాటు ధ్యానం, యోగా వంటి ప్రక్రియలను కూడా రోగులకు నేర్పిస్తున్నారు. ఆమె వైద్యం శరీరానికే కాకుండా మనసుకు కూడా రిలీఫ్ ఇస్తుంది.
మీది ఏ కులం?
ఇండియాలోని కులాలు, మతాల జాడ్యం రష్యా వాళ్లకి తెలియడం వల్లనేమో మెడోనాను స్థానిక రష్యన్లు "మీది ఏ కులం?" అని అడిగినప్పుడు ఆమె చిరునవ్వుతో "నేను క్రైస్తవురాలిని, మా దేశంలో క్రైస్తవులకు కులం ఉండదు" అని సమాధానం ఇస్తుంది. ఆమె నడత, మాటతీరు రష్యన్లకు ముచ్చట కొలుపుతుంది. కాస్తంత ఆశ్చర్య పడుతుంటారు కూడా.. దీంతో భారతీయ సంస్కృతిని తెలుసుకునే వేదికగా మెడోనా ఆస్పత్రి మారింది.
మెడోనా రష్యాలో కాలం గడిపేకొద్దీ అక్కడి జీవన విధానాన్ని, ప్రజల ప్రేమను ఆస్వాదిస్తోంది. ఆమె భవిష్యత్తులో రష్యాలో మరిన్ని ఆయుర్వేద కేంద్రాలు ప్రారంభించాలనే సంకల్పంతో ఉంది. "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న మాటను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం అని చెబుతోంది ఆమె.

యోగా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ మడోనా (photo courtesy-Gate way to Russia)

మెడోనా టోమీ అనే ఈ భారతీయ డాక్టర్.. రష్యా, ఇండియా దేశాల మధ్య సంస్కృతి, వైద్యం, ప్రేమను మిళితం చేసిన ఓ సృజనాత్మక అనుబంధానికి దారులు వేస్తున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ వీధుల్లో మిత్రత్వం, ప్రేమ, ప్రకృతిని ఆస్వాదిస్తూ స్వీయ ఎదుగుదలకు బాటలు వేసుకుంటున్న డాక్టర్ మెడోనా టోమీకి అనేకమంది రష్యన్ ఫ్రెండ్స్ ఉన్నారు.
తొలి పరిచయాలు..
మెడోనా టోమీకి తొలి రష్యన్ ఫ్రెండ్ క్రిస్టినా (Kristina) అనే నటి. ఒక కేఫ్‌లో అనుకోకుండా ఆమెను కలిశారు. క్రిస్టినా టైం ఎంతని అడిగినపుడు మెడోనా రష్యన్ మాట్లాడలేదని గమనించి ఇంగ్లీష్‌కు మారింది. ఆ తర్వాత వాళ్లిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. "ఆమెతో కలిసి నగరం చుట్టూ తిరిగాం. ఆమె వల్లనే సెయింట్ పీటర్స్‌బర్గ్ నిజమైన అందాలను చూడగలిగా... మ్యూజియంలు, థియేటర్లు, ప్రజలు డాన్స్ చేసే పార్కులు. స్వాన్ లేక్ బ్యాలేలు చూశాను. అది అద్భుతం!" అని మెడోనా గుర్తు చేసుకుంటుంది.
భారతదేశంలో, మెడోనా చెబుతున్నట్టు, ప్రజలు ఎక్కువగా నడవరు. చిన్న చిన్న దూరాలకు సైతం టక్కున బైక్ ఎక్కి వెళుతుంటారు. కానీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నడక ఒక సంస్కృతి. ఓ జీవనశైలి. "ఇప్పుడు నాకు కూడా ఎక్కువ నడవడం అలవాటు అయింది. భారతదేశంలో తల్లిదండ్రులు సాయంత్రం ఏడింటికి ఇంటికి రావాలని చెబుతారు, కానీ ఇక్కడ ఎంతసేపైనా బయట గడిపి, సురక్షితంగా, స్వతంత్రంగా ఇంటికి చేరుతుంటారు" అని మెడోనా చెప్పింది.
రష్యాలో కుటుంబం..
మెడోనా తల్లిదండ్రులు ఇప్పటికే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్నారు. ఆమెను చూడటానికి వచ్చారు. ఆమె తమ్ముడు వచ్చే ఏడాది రావాలని ప్లాన్ చేస్తున్నాడు. "నాన్న ఇక్కడున్న టెంపుల్స్, స్మారక చిహ్నాలు చూసి ముచ్చట పడ్డారు. ఇక మా అమ్మ అయితే చెర్రీ, యాపిల్ చెట్లు చూసి సంబరపడింది. వాటన్నింటినీ ఇంటికి తీసుకెళ్లింది" అని చెబుతోంది మెడోనా.

తల్లిదండ్రులతో డాక్టర్ మడోనా (photo courtesy-Gate way to Russia)

పెళ్లయిందా అని ఎవరైనా అడిగితే మెడోనా నవ్వుతూ, "రష్యా నాకు భర్తను ఇచ్చింది" అని చెబుతుంది. అతనూ భారతీయుడే. ఆయుర్వేద వైద్యుడే. ఆమె పనిచేస్తున్న కేంద్రం డైరెక్టర్లలో ఒకరు. "నా తల్లిదండ్రులు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి వారి అనుమతి కోరాడు" అలా ఆయన్ను వివాహం చేసుకున్నాను.
నాకు బాగా నచ్చిన ప్రదేశం రష్యా...
రష్యా మంచే (Snow) కాదు, మంచి వేసవి విడిది కూడా. నా వేసవి విడిది పెటర్‌గోఫ్ (Petergof). ఎంతో అందంగా ఉంటుంది. ఆ ప్లేస్ వైభవం మాటల్లో వర్ణించలేనిది. మెడోనాపై గాఢమైన ముద్ర వేసింది. "భారతదేశంలో వాతావరణం తరచూ ఒకే విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ రంగుల హరిత వసంతం, గ్రీన్ సమ్మర్, బంగారు రంగు శరదృతువు, తెల్లని శీతాకాలం చూశాను. ఇది అందంగా ఉంది!" అంటారు మెడోనా.
మెడోనా రష్యాలో రెండు క్రిస్మస్‌లు, రెండు హ్యాపీ నూయ్యర్ల వేడుకలు జరుపుకుంది. "రష్యన్లు శీతాకాల వేడుకలను ఎంత ఘనంగా జరుపుకుంటారో మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. దాన్ని ప్రత్యక్షంగా అనుభవించి చూడాల్సిందే. అది వేరే లోకం. వేరే అనుభవం. వెలుగు జిలుగుల పూలదండల్లా తెల్లటి మంచు వీధుల్లో జనం ఆనందంగా వేడుకలు జరుపుకోవడం అద్భుతం!" అంటారు ఆమె.
రష్యాలో సమానత్వం ఎక్కువ...
రష్యాలో "పురుషులు, స్త్రీల మధ్య సమానత్వం చెప్పుకోదగిన విషయం" అన్నారు మెడోనా. భారతదేశంలో మాదిరి ఇక్కడ పురుషాధిక్యత కనిపించదు. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే. ఇది తనకు చాలా బాగా నచ్చిన విషయమన్నారు మెడోనా.
రష్యన్లు- ఆయుర్వేదం..
రష్యన్లకు పూర్తిస్థాయిలో ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నమెడోనా.. ఈ వైద్యంతో చాలా సమస్యలను పరిష్కరించవచ్చునని చెబుతారు. శరీరాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతే చికిత్స ప్రారంభిస్తారు. రష్యన్లు ఎక్కువగా జీర్ణకోశ సమస్యలు, హార్మోనల్ సమస్యలు, కీళ్ల నొప్పులతో వస్తుంటారని మెడోనా చెప్పారు. కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండడం వల్ల చాలా మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
"భారతదేశంలో కూడా ఇదే సమస్య ఉంది. దీనికి ఓ సులువైన పరిష్కారం ఉంది – బాగా నిద్ర పోయాలి, మంచి ఆహారం తినాలి, మనసును ప్రశాంతంగా ఉంచాలి" అని సలహా ఇస్తున్నారు మెడోనా.

ఆయుర్వేద ప్రాక్టీస్ సెషన్ లో డాక్టర్ మడోనా (photo courtesy-Gate way to Russia)

రష్యాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నారు. రష్యన్ నేర్చుకున్నారు. రష్యన్ సంప్రదాయాలను, ఆ దేశ ఆహార అలవాట్లను, ఇతర భౌగోళిక పరిసరాలను అధ్యయనం చేస్తున్నారు. ఎప్పుడైనా ఇండియాకి వచ్చినపుడు రష్యన్‌లోనే 'హలో' చెబుతున్నారు. రష్యాలో బాగా దొరికే "పుట్టగొడుగులు, బెర్రీలు" బాగా ఇష్టపడుతున్నట్టు చెప్పారు మెడోనా. "ఇండియా, రష్యా మధ్య చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే ఇక్కడి ప్రజలు మనసు విప్పి మాట్లాడతారు. దాంతో మనం చాలా దగ్గరవుతాం. మనసులు కూడా కలుస్తాయి" అని మెడోనా చెబుతోంది.


Read More
Next Story