స్టాక్ ఫుల్ గా ఉన్నా దక్షిణాది లో బియ్యం రేట్లు ఎందుకు పెరిగాయి?
x

స్టాక్ ఫుల్ గా ఉన్నా దక్షిణాది లో బియ్యం రేట్లు ఎందుకు పెరిగాయి?

మొత్తం బియ్యం vs ప్రీమియం సన్నరకాలు వేరు వేరుగా ఉండటం కారణమా?


సెప్టెంబరు 1 నాటికి కేంద్రం + రాష్ట్రాల నిల్వలు సుమారు 59.6 మిలియన్ టన్నులు. అక్టోబరు 1 నాటికి బియ్యం బఫర్ 10.3 మిలియన్ టన్నులు. ఇప్పుడు నిల్వలు 59.6 మిలియన్ టన్నులు. అవసరం కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ ఉన్నాయి.

FCI నిల్వలు కూడా బఫర్‌కు 2.5 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ సగటు రిటైల్ బియ్యం రూ. 46–47/కేజీ. దక్షిణాదిలో సోనా మసూరి, BPT, RNR, పొన్ని రూ. 65–80కు చేరాయి. జాతీయ సగటు 7 శాతం పెరిగితే ఈ ప్రీమియం రకాలు 10–25 శాతం పెరిగాయి.

స్టాక్‌లో ఉన్నది ఆ రకం కాదు

FCI/PDS నిల్వలు ఎక్కువగా సాధారణ రకాలు. పంజాబ్, హర్యానా నుంచి వచ్చినవి. దక్షిణాదిలో ఇంట్లో రోజూ వండేది సన్నగా ఉండే రకాలు. సోనా మసూరి, సాంబా మసూరి (BPT), RNR, పొన్ని. ఇవి తేలికగా ఉంటాయి. విడివిడిగా ఉంటాయి. సాంబార్‌తో సరిపోతాయి. ఇక్కడి అలవాటు ఇదే.

కేంద్రం చెప్పే భారత్ రైస్ రూ. 29 సాధారణంగా PDS/ఓపెన్ మార్కెట్‌కు వేసే సాధారణ లేదా దుడ్డు రకం. పంజాబ్, హర్యానా వంటి చోట్ల నుంచి వచ్చిన బియ్యం ఎక్కువ. అది నిండుగా, ముదురుగా ఉంటుంది. ధర తక్కువైనా దక్షిణాది ఇళ్లు రోజూ కావాలనుకునేది కాదు.

దక్షిణాదిలోనే విస్తీర్ణం, వర్షం తగ్గాయి

కరీఫ్ వరి విస్తీర్ణం జాతీయంగా 3.7 శాతం తగ్గింది. తగ్గుదల ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక 4.6 లక్షల హెక్టార్లు, తెలంగాణ 4.3, ఏపీ 1.8, తమిళనాడు 1.5 హెక్టార్లు. దక్షిణాది వర్షపాతం 26–28 శాతం తగ్గింది. రిజర్వాయర్లు తక్కువ. కావేరి, తుంగభద్ర, నాగార్జునసాగర్ కాలువలకు నీరు రాలేదు. అందుకే ఈ సీజన్ ఉత్పత్తి అంచనా పడిపోయి, అక్టోబరు రాక ముందే రేట్లు పెరిగాయి.

ప్రొక్యూర్‌మెంట్ ఓపెన్ మార్కెట్‌ను లాగేసింది

తెలంగాణలో జూలై, సెప్టెంబరు రిటైల్ 13.3 శాతం పెరిగింది (రూ. 54.4 → రూ. 61.6) దేశంలో రెండో అత్యధికం ఏపీలో 10.5శాతం. వ్యవసాయ ఆర్థికవేత్త ఆచార్య జానయ్య చెప్పిన ప్రకారం MSPకు పెద్ద ఎత్తున కొని మిల్లర్లు/ప్రభుత్వ గోదాముల్లో ఉంచడం వల్ల ఓపెన్ మార్కెట్‌కు సన్నరకం తక్కువగా వస్తోంది. కర్ణాటక మిల్లర్లు ఏపీ, తెలంగాణ నుంచి ధాన్యం తెచ్చుకునేవారు. అక్కడే కొరత, ధాన్యం క్వింటాల్ రూ. 3,600 నుంచి రూ. 4,200కు పెరిగింది.

ఇథనాల్, ఎగుమతి, నిల్వ విధానం

పుష్కలమైన స్టాక్‌లో కొంత భాగం ఇథనాల్‌కు వెళుతోంది. కొనుగోలు ఖర్చు కంటే తక్కువకు డిస్టిలరీలకు ఇస్తున్నారు. ఇది తినే బియ్యం లభ్యతను తగ్గిస్తుందని విమర్శ. ఎగుమతి ఆంక్షలు సడలించిన తర్వాత కూడా ప్రీమియం నాన్-బాస్మతి డిమాండ్ ఉంది. స్టాక్ ఉన్నా OMSS (Open Market Sale Scheme) ధర మార్కెట్‌కు సరిపోకపోవడంతో ప్రైవేట్ కొనుగోలు తక్కువ.

మార్కెట్ ప్రవర్తన

అక్టోబరు పంట రాకముందే కొరత అంచనాతో మిల్లర్లు, వ్యాపారులు స్టాక్ పెంచుకున్నారు. కర్ణాటకలో పానిక్ బయింగ్, కొన్ని చోట్ల నిల్వలు పెట్టి కృత్రిమ కొరత సృష్టించిన ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో స్థానిక ఎన్నికల నిధుల కోసం బస్తాకు అదనపు వసూలు అనే ఆరోపణలు మిల్లర్ల వైపు నుంచి వచ్చాయి. ఇవి నిరూపితం కావు, కానీ రేటు ఒత్తిడికి తోడవుతాయి.

జాతీయంగా బియ్యం లేవు అని కాదు. దక్షిణాది తినే సన్నరకం ఈ సీజన్‌లో తక్కువగా పండే అవకాశం. ప్రొక్యూర్‌మెంట్ వల్ల ఓపెన్ మార్కెట్‌కు తక్కువగా రావడం, PDS స్టాక్ ఆ రకం కాకపోవడం, ఈ మూడూ కలిసి రేటు పెంచాయి. అందుకే స్టాక్ రికార్డు స్థాయిలో ఉన్నా విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో సన్నబియ్యం ఖరీదైంది.

Read More
Next Story