
స్వయంప్రతిపత్తి దిశగా స్టాలిన్ ఆలోచనలు..
2026 నాటికి నివేదిక ఇవ్వనున్న సుప్రీం మాజీ జస్టిస్ కురియన్ జోసెఫ్ కమిటీ..
కేంద్రానికి, తమిళనాడు(Tamil Nadu)కు సరిపోవడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తమకు నిధుల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని సీఎం స్టాలిన్ చాలాకాలంగా వాదిస్తున్నారు. కేంద్రం మాట మరోలా ఉంది. యూపీఎ హయాంలో కంటే ఎక్కువ నిధులనే ఇచ్చామన్నది కేంద్రం లెక్కలు చూపుతోంది. ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. నీట్ పరీక్ష నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని కోరుతూ స్టాలిన్ (MK Stalin) అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆమోదం కోసం రాష్ర్టపతి ద్రౌపతి ముర్ముకు పంపారు. అయితే డీఎంకే (DMK) ప్రతిపాదనను ఆమె తిరస్మరించారు. దాంతో స్టాలిన్ ఎదురుదెబ్బ తగిలింది. సెకండ్ లాంగ్వేజీగా హిందీని ప్రవేశ పెట్టి, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం మెలిక పెట్టింది. అందుకు స్టాలిన్ అంగీకరించలేదు. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఇది తమిళనాడుకు మరో ఎదురు దెబ్బ. కేంద్రం తమను కావాలని ఇబ్బందిపెడుతుందని భావించిన సీఎం స్టాలిన్.. రాష్ట్రం స్వయంప్రతిపత్తిగా దిశగా ఆలోచించడం మొదలుపెట్టారు. సాధ్యాసాధ్యాల కోసం ఒక హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షత ప్యానెల్ ఏర్పాటయ్యింది. ఐఏఎస్ మాజీ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, ప్రొఫెసర్ ఎం నాగనాథన్‌తో కూడిన కమిటీ రాజ్యాంగ నిబంధనలను సమీక్షిస్తుంది. జాతీయ ఐక్యతతో రాజీ పడకుండా స్వయంప్రతిపత్తి కోసం రాష్ట్రానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. రాజమన్నార్ కమిటీ ఫలితాలను కూడా సమీక్షించి, జనవరి 2026 నాటికి నివేదిక ఇవ్వనుంది.
1969లో కమిటీ ఏర్పాటు..
అప్పటి ముఖ్యమంత్రి ఎం కరుణానిధి నేతృత్వంలో ఏర్పాటైన 1969 రాజమన్నార్ కమిటీ 1971లో తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత 1974లో అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.
అసెంబ్లీలో స్టాలిన్..
తమిళనాడు శాసనసభలో 110వ నిబంధనపై స్టాలిన్ మాట్లాడుతూ.. భాషా, సాంస్కృతిక, జాతి భేదాలున్నా.. భారతదేశ ఐక్యత వర్ధిల్లుతుందని అన్నారు. 1974 తీర్మానాన్ని అనుసరించి సర్కారియా (1983), పంచి (2004) ప్యానెల్లు భారీ నివేదికలను అందించాయని, కానీ స్పష్టమైన సంస్కరణలను అందించలేదని గుర్తుచేశారు. నీట్ (NEET) గురించి మాట్లాడుతూ.. నీట్ పరీక్ష విధానం కోచింగ్ సెంటర్లను ప్రోత్సహిస్తోందని, గ్రామీణ, ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులు ఈ పరీక్ష వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు.
అన్నాడీఎంకే, బీజేపీల వాకౌట్..
అసెంబ్లీలో స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అన్నాడీఎంకే (AIADMK)సభ్యులు వాకౌట్ చేశారు. రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిపై ముఖ్యమంత్రి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కూడా తమకు ఇవ్వడం లేదని ప్రతిపక్ష పార్టీ నిరసన వ్యక్తం చేసింది. స్టాలిన్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ(BJP) చీఫ్ నైనార్ నాగేంద్రన్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. భారతదేశం ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని కోరుకుంటున్న సమయంలో స్టాలిన్ స్వయంప్రతిపత్తి డిమాండ్ దేశ ఐక్యతను దెబ్బతీస్తుందని నాగేంద్రన్ అభిప్రాయపడ్డారు. కరుణానిధి హయాంలో 1974లో స్వయంప్రతిపత్తి తీర్మానాన్ని నాగేంద్రన్ ప్రస్తావించారు. ఈ అంశంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా తన లేఖకు స్పందించలేదని గుర్తుచేశారు.