సీఎం మార్పు ఊహగానాలపై స్పందించిన సిద్ధరామయ్య
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

సీఎం మార్పు ఊహగానాలపై స్పందించిన సిద్ధరామయ్య

హైకమాండ్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని ప్రకటన


కర్ణాటక సీఎం మార్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. కాంగ్రెస్ హై కమాండ్ కోరుకుంటే తాను పదవిలో కొనసాగుతానని అన్నారు. నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం హైకమాండ్ దేనని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

2023 లో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య జరిగిన అధికార ఒప్పందం ప్రకారం చెరో రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠం పంచుకోవాలని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం నాయకత్వ మార్పుపై రాష్ట్రంలో విస్తృతంగా ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘‘మేము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. నేను సీఎంగా కొనసాగాలని వారు నిర్ణయిస్తే, నేను కొనసాగుతాను. చివరికి హైకమాండ్ ఏది నిర్ణయిస్తే, దానిని అంగీకరించాలి. శివకుమార్ కూడా దానిని అంగీకరించాలి’’ అని సిద్ధరామయ్య చిక్కబళ్లాపురలో విలేకరులతో అన్నారు.
అధికార బదిలీ..
‘‘శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా అని అడిగినప్పుడూ.. హైకమాండ్ నిర్ణయిస్తుందని నేను చెబుతున్నాను.. మీరు నన్ను మళ్లీ అదే అడుగుతున్నారు’’ అని అసహనం వ్యక్తం చేశారు.
నాలుగు ఐదు నెలల క్రితం హైకమాండ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు అంగీకరించిందని, కానీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని తాను సూచించానని అన్నారు.
ఇప్పుడు హైకమాండ్ ఏమి నిర్ణయిస్తే అది మేము అనుసరిస్తాము’’ అని ముఖ్యమంత్రి అన్నారు. మీ మధ్య బదిలీ ఒప్పందం జరిగిందా అని ప్రశ్నించగా, హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాత్రమే అన్నారు.
సగం లక్ష్యాన్ని చేరుకున్నాం..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఢిల్లీ నుంచి బెంగళూర్ వచ్చిన సందర్భంగా ఆయన నివాసంలో సీఎం సిద్ధరామయ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం అయ్యారు.
నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివకుమార్ కు మద్దతు ఇచ్చే పది మంది శాసన సభ్యులు ఢిల్లీకి వెళ్లి ఖర్గేను కలిసిన తరువాత ముఖ్యమంత్రి ఖర్గేతో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఖర్గేను కలవడానికి శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్తున్న విషయం తనకు తెలియదని శివకుమార్ చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. శివకుమార్ కోసం మరికొంతమంది శాసనసభ్యులు త్వరలో ఢిల్లీకి ప్రయాణించే అవకాశం ఉందని తెలిపాయి.
సిద్ధరామయ్య వర్సెస్ శివకుమార్..
బెంగళూర్ లో ఉన్న ఖర్గే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా అగ్రనేత, కాంగ్రెస్ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా వాయిదా పడినట్లు సమాచారం.
సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు పట్టుబడుతుండగా, ముందుగా నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని శివకుమార్ కోరుతున్నారు. కాంగ్రెస్ హై కమాండ్ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపితే సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నట్లే అని పార్టీ అంతర్గత వర్గాలలో చర్చ జరుగుతోంది.


Read More
Next Story