
‘‘సీఎం పదవి కోసం మా మధ్య ఏ విభేదాలు లేవు’’
మీరే వాటిని సృష్టిస్తున్నారని మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..
కర్ణాటక(Karnataka)లో సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) తోసిపుచ్చారు. తనతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shiva Kumar)కు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తమ మధ్య విభేదాలు సృష్టిస్తున్నది మీడియానేనన్నారు. ఇటీవల అసెంబ్లీలో ఆమోదం పొందిన ద్వేషపూరిత ప్రసంగ బిల్లును వివరించడానికి రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌ను కలుస్తానని ఆయన చెప్పారు. మంగళూరుకు చేరుకున్న సిద్ధరామయ్య విలేఖరులతో కాసేపు మాట్లాడారు.
2023 కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చినపుడు ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య పోటీ నెలకొంది. అధిష్టానం ఆదేశాల మేరకు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. అయితే ఇద్దరూ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేలా వారి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని అప్పట్లో వార్తలొచ్చాయి. 2025 నవంబర్ 20వ తేదీకీ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో తమ నాయకుడు డీకే ముఖ్యమంత్రి అవుతారని ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
సిద్ధరామయ్య తానే పూర్తికాలం సీఎం పదవీలో కొనసాగుతానని అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు కూడా.
ద్వేషపూరిత నేరానికి పాల్పడితే రూ. 50వేల జరిమానాతో పాటు, సంవత్సరం జైలు శిక్ష విధించేలా శాసనసభలో బిల్లు పాసైంది. పదే పదే నేరానికి పాల్పడితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. అయితే ఈ బిల్లు పరిశీలనలో ఉందని లోక్ భవన్ (గవర్నర్ హౌస్) శుక్రవారం (జనవరి 9) ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు.. ‘‘బిల్లును ఇప్పటికే శాసనసభ ఆమోదించింది. గవర్నర్ దానిని తిరస్కరించలేదు లేదా వెనక్కి పంపలేదు. అయితే నేను వెళ్లి ఆయనకు (గవర్నర్) వివరించాలనుకుంటున్నా" అని సిద్ధరామయ్య సమాధానమిచ్చారు.
బళ్లారి ఘర్షణపై..
బ్యానర్ తొలగించారన్న కారణంగా ఇటీవల బళ్లారిలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో బళ్లారి నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ(BJP) నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. "ఎవరు చేయకూడదని చెప్పారు, వాళ్ళు అలా చేయనివ్వండి" అని సమాధానమిచ్చారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడానికి బీజేపీ చూస్తోందని అన్నారు.

