సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రి పదవి..డీఎంకే వైఖరేంటి?
x

సెంథిల్ బాలాజీకి మళ్లీ మంత్రి పదవి..డీఎంకే వైఖరేంటి?

‘క్యాష్ ఫర్ జాబ్’ కేసులో నిందితుడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి తిరిగి డీఎంకే స్టాలిన్ ఎక్సైజ్ శాఖ మంత్రిని చేశారు. ఈ పదవిని కట్టబెట్టడం వెనక ఉన్న వ్యూహమేమిటి?


మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ఐదు రోజుల క్రితం విడుదలయ్యారు. ‘క్యాష్ ఫర్ జాబ్’ కేసులో ఆయన 471 రోజుల జైలులో ఉన్నారు. ఛార్జిషీట్‌లోని ఆరోపణల తీవ్రత కారణంగా కేసును త్వరగా పరిష్కరించాలని సుప్రీం న్యాయమూర్తులు అభయ్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌ తో కూడిన మద్రాసు హైకోర్టుకు సూచించింది. ‘‘ కేసులో 2,000 మంది నిందితులు, దాదాపు 600 మంది సాక్షులు ఉన్నారు. నిందితులు, సాక్షుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని కేసుల భారం తక్కువగా ఉన్న అర్హత గల సెషన్స్ జడ్జికి ఈ కేసును అప్పగించాలి" అని కోర్టు పేర్కొంది.

అసలు బాలాజీపై కేసేమిటి?

దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన బాలాజీపై ఈడీ కేసు నమోదు చేసింది. 2011-16 మధ్యకాలంలో ‘క్యాష్ ఫర్ జాబ్’ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందని ఈడీ పేర్కొంది. తన శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ప్రజల నుంచి రూ.1.75 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు లంచం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది జూన్‌లో నాటకీయ పరిస్థితుల మధ్య బాలాజీని అరెస్టు చేశారు. కొద్దికాలానికే ఆయనకు కార్డియాక్ సర్జరీ జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న సమయంలో బాలాజీకి గతంలో ఎక్సైజ్ శాఖ బాధ్యతలను అప్పగించారు. అదే శాఖలో మళ్లీ ఆయన పనిచేయాల్సి వచ్చింది.

రాజకీయ నేపథ్యం..

సెప్టెంబర్ 29న రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలోనూ బాలాజీ నిరుత్సాహంగా కనిపించారు. సీనియర్ నేతలతో కలివిడిచి ఉండేవారు. కానీ ఆ జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేను వీడి 2018లో డీఎంకేలో చేరిన బాలాజీకి అప్పట్లో డీఎంకే జిల్లా కార్యదర్శి పదవి లభించింది. 2019లో అరవకురుచి ఉప ఎన్నికల్లో గెలిచారు. కరూర్ నుంచి 2021లోనూ విజయం సాధించారు. కరూర్, అరవకురుచ్చి రెండు స్థానాల్లో దాదాపు 50 శాతం ఓట్లతో వరుసగా నాలుగు సార్లు ఎన్నికల్లో గెలుపొందారు.

డీఎంకేపై ప్రతిపక్షాల విమర్శలు..

బాలాజీకి మాజీ పోర్ట్‌ఫోలియోను కట్టబెట్టడంపై డీఎంకే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పార్టీ విధేయులకు కాకుండా.. బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి మంత్రి పదవి కేటాయించడాన్ని ఎఐఎడిఎంకె, బీజేపీ తప్పుబడుతున్నాయి. బాలాజీపై కేసు 2015 నాటిది. ఏఐఏడీఎంకే క్యాబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న బాలాజీని ‘క్యాష్ ఫర్ జాబ్’ కేసులో రచ్చకీడ్చిన డీఎంకే.. ఇప్పుడు ఆయనను కాపాడుకునే బాధ్యత తీసుకుందని ప్రతిపక్షాల ఆరోపణ. బాలాజీకి మంత్రి పదవి కేటాయింపుపై పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఇలా అన్నారు. ‘‘నిందితుడి తరఫు న్యాయవాదిగా కాకుండా ప్రజలకు నిష్పక్షపాత న్యాయమూర్తిగా వ్యవహరించాలి’’ అని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌నుద్దేశించి అన్నారు.

ప్రత్యేక న్యాయమూర్తి నియామకం బాలాజీకి, డీఎంకెను ఇరకాటంలో పెడతుందా? అని అడిగిన ప్రశ్నకు.. ఇది ఏ పార్టీపైనా పెద్దగా ప్రభావం చూపదని సీనియర్ జర్నలిస్ట్ ఆర్ ఇళంగోవన్ అన్నారు.

DMK వర్సెస్ ED

“కేసు స్వభావాన్ని బట్టి బాలాజీని ఎక్కువ కాలం జైలులో పెట్టే అవకాశం లేకపోవడంతో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. దాన్ని ఉపయోగించుకుని బెయిల్ సడలింపులు కోరే అవకాశాలున్నాయి. ప్రత్యేక న్యాయమూర్తి నియామకం బాలాజీపైగానీ, డీఎంకేపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు’’ అని ఇళంగోవన్ అన్నారు.

“బాలాజీకి మాజీ పోర్ట్‌పోలియో కేటాయించడం రాజకీయ నిర్ణయం. తాను ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని నిరూపించడమే స్టాలిన్ లక్ష్యం.’’ అని చెప్పారు.

డీఎంకే వ్యూహం..

వాస్తవంగా బాలాజీ చిన్నశాఖను కోరుకున్నట్లు సమాచారం. ఆయన ఈ మధ్యే బెయిల్‌పై బయటకువచ్చారు. జైలు జీవితం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఈడీ వ్యూహానికి డీఎంకే లొంగదని మోదీకి సంకేతం పంపేందుకే బాలాజీని కీలక పదవి కట్టబెట్టినట్టు తెలుస్తోంది. బాలాజీకి పదవి కేటాయింపు ఉత్తర తమిళనాడులోని పశ్చిమ ప్రాంతంలో పార్టీకి ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. బాలాజీ మంత్రి పదవి కేటాయింపు పూర్తిగా ‘‘రాజకీయ ఎత్తుగడ” అని పేరు బయటపెట్టడానికి ఇష్టపడని వ్యక్తి చెప్పారు.

Read More
Next Story