
శబరిమల ప్రధాన ఆలయ అర్చకుడి అరెస్టు..
బంగారం తాపడాల చోరీ కేసులో పాత్ర..
కేరళ(Kerala) శబరిమల(Sabarimala) బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. శబరిమల ఆలయ ప్రధాన పూజారి కందరారు రాజీవరుని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈరోజు (శుక్రవారం 9తేదీ) అరెస్ట్ చేసింది. రాజీవరును ఉదయం ఒక గుర్తుతెలియని ప్రదేశంలో మొదట విచారించి మధ్యాహ్నం SIT కార్యాలయానికి తరలించారు. అక్కడ ఆయన అరెస్టును అధికారికంగా ప్రకటించారు.
ఈ కేసులో ప్రదాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవరుకు సన్నిహత సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్టు విచారణలో తేలడంతో తాజా అరెస్టు జరిగినట్టు తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టుకు తీసుకువచ్చింది రాజీవరేనని ఈ కేసులో అరెస్టయిన దేవస్థానం బోర్టు మాజీ ప్రెసిడెంట్ ఎ.పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్టు సిట్ అధికారులు తెలిపారు. దీంతో సిట్ కార్యాలయానికి రాజీవరును రప్పించి విచారణ అనంతరం అరెస్టు చేసినట్టు చెప్పారు.
అసలు కేసేమిటి?
2019లో శబరిమల ద్వారపాలక విగ్రహాలు, శ్రీకోవిలి తలుపులపై ఉన్న బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. అయితే ముందు ఉన్న దానితో బరువులో వ్యత్యాసం వచ్చినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణలు తీవ్రం కావడంతో దర్యాప్తును సిట్‌కు కేరళ ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరుకు చెందిన ఉన్ని కృష్ణన్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు సిట్ చెబుతోంది. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ చేసుకోవడంతో కేసులో పలువురుని అదుపులోకి తీసుకోవడం జరగింది. ఈడీ సైతం మనీలాండరింగ్ కింద సీబీఐ అరెస్టు చేసిన నిందితులపై అభియోగాలు నమోదు చేసింది.

