Bald Hair | బుల్దానా జిల్లా 11 గ్రామాలవాసులకు బట్టతల, ఎందుకంటే...
బుల్దానాలోని 11 గ్రామాల వాసులకు జట్టు రాలి, బట్టతల ఏర్పడుతుండటం సంచలనం రేపింది.దీంతో ఢిల్లీ, చెన్నైల నుంచి యునానీ,ఆయుర్వేద వైద్యుల బృందం నేడు బుల్దానా రానుంది.
దేశంలోనే బుల్దానా బట్టతల సమస్య జాతీయ సమస్యగా మారింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని 11 గ్రామాల ప్రజలకు ఉన్నట్టుండి జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుండటంతో అందరి దృష్టి బుల్ధానా జిల్లా ప్రజల సమస్యపై పడింది.
- బుల్ధానా జిల్లా షెగాన్ తహసీల్ పరిధిలోని 11 గ్రామాల్లో వందలాది మందికి ఆకస్మికంగా జుట్టు రాలిపోయి బట్టతలలు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన వైద్యులు చర్మం బయాప్సీని సేకరించి పరీక్షించగా బట్టతల ఏర్పడిన వారికి ఎలాంటి ఫంగల్ ఇన్పెక్షన్ లేదని తేలింది. జుట్టు రాలుతున్న గ్రామాల నీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదని పరీక్షల్లో వెల్లడవడంతో అసలు ఈ బట్టతల ఎందుకు వస్తుందనేది మిలియన్ డాలర్ల సమస్యగా మారింది.
- బుల్దానా జిల్లాలోని బట్టతల బాధితుల సమస్యపై వైద్యఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించారు. ఏమిటీ వైపరీత్యం...ఉన్నట్టుండి జుట్టు రాలిపోవడం, వారంరోజుల్లోనే బట్టతల ఏర్పడటంతో వైద్యులు వివిధ రకాల పరీక్షలకు శ్రీకారం చుట్టారు.
రంగంలోకి దిగిన వైద్యాధికారులు
వైద్యాధికారులు బట్టతల బాధితులున్న 11 గ్రామాల్లో నీరు, బాధితుల రక్తం నమూనాలు, చేతి గోళ్లు, బట్టతల టిస్యూ శాంపిళ్లు సేకరించి పరీక్షలకు ల్యాబ్ కు పంపించారు. వైద్యాధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు వాడుతున్న సబ్బులు, హెయిర్ ఆయిల్స్, షాంపూల శాంపిళ్లను సేకరించి లేబోరేటరీకి పంపించారు.బట్టతల బాధితులు వాడుతున్న సబ్బులు, హెయిర్ ఆయిల్స్, షాంపూల వల్ల జుట్టు రాలుతుందా ? అనే విషయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నేడు బుల్ధానా జిల్లాకు రానున్న ఐసీఎంఆర్ బృందం
బుల్దానా జిల్లాలో 11 గ్రామాల ప్రజలకు బట్టతల సమస్యను తీవ్రంగా పరిగణించిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రత్యేక బృందాలు ఢిల్లీ, చెన్నై నగరాల నుంచి సోమవారం రానున్నాయి. బుల్ధానా జిల్లాలో బట్గతల సమస్య మిస్టరీగా మారడంతో ఐసీఎంఆర్ ఆయుర్వేద, యునానీ, ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన ప్రత్యేక వైద్యుల బృందాలను నేడు బుల్దానా జిల్లాకు పంపింది. బుల్దానా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై 11 గ్రామాల్లో ప్రజలను బట్టతల సమస్యపై చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపట్టారు.
కలుషిత నీరే కారణమా?
బుల్ధానా జిల్లాలోని 11 గ్రామాల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రజలకు అకస్మాత్తుగా జుట్టు రాలి బట్టతల ఏర్పడుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుల్ధానాలోని నీటి నమూనాల్లో ఎలాంటి ఫంగస్ ఆనవాళ్లు లేకున్నా అధిక నైట్రేట్,టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్ (టీడీఎస్) స్థాయిలు ఉన్నట్లు అధికారులు పరీక్షల్లో గుర్తించారు.పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా ఒకరేమిటీ? అందరూ అకస్మాత్తుగా జుట్టు రాలడం, బట్టతల వస్తున్నట్లు నివేదించిన తర్వాత, ఆయా గ్రామాల నీటిలో అధిక మొత్తంలో కలుషితాలు ఉన్నట్లు కనుగొన్నారు.
బోర్ వెల్ నీటిని ఉపయోగించొద్దు...
నీటి పరీక్షల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడైన తర్వాత బుల్దానా జిల్లా ఆరోగ్య అధికారి బోర్‌వెల్ నుంచి నీటిని ఉపయోగించవద్దని ప్రజలను హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో తాగునీరు మంచి నాణ్యతతో ఉన్నప్పటికీ, ఇతర అవసరాలకు ఉపయోగించే నీటిని బోర్‌వెల్ నుంచి తీసుకొని వాడుతున్నారు. బోర్ వెల్ నీరు పరీక్షల నివేదికలో అపరిశుభ్రంగా ఉందని తేలడంతో ఆ నీటిని వాడవద్దని వైద్యాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
నేడు ఆరోగ్యశాఖ మంత్రి బుల్దానాకు రాక
నీటి రసాయన,జీవ నమూనాలను తదుపరి పరీక్ష కోసం పూణేలోని లేబోరేటరీకి పంపుతామని, దీని నివేదిక ఆరు నుంచి ఏడు రోజుల్లో వస్తుందని బుల్దానా జిల్లా ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు.సోమవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ బట్టతల రోగుల పరిస్థితిని తనిఖీ చేయడానికి కొన్ని ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారని వైద్యశాఖ అధికారులు తెలిపారు.బుల్దానా జిల్లాలో ఒక వృద్ధ మహిళ గత 8-10 రోజులుగా తనకు జుట్టు రాలడం జరుగుతోందని చెప్పారు. ఆమె తన జుట్టును ఒక చిన్న సంచిలో ఉంచి అధికారులకు చూపిస్తున్నారు.మరో యువకుడు కూడా జుట్టు రాలుతుండటంపై వైద్యాధికారులకు ఫిర్యాదు చేశాడు.తన ముఖంపై ఉన్న వెంట్రుకలు,గడ్డం కూడా రాలిపోతున్నాయని యువకుడు ఆందోళనగా చెప్పారు.
Next Story