నటుడు దర్శన్ బెయిల్ రద్దు పిటీషన్‌ను తిరస్కరించిన సుప్రీం
రేణుక స్వామి హత్య కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్‌ను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టింది.
తన అభిమాని రేణుకస్వామి(Renukaswamy) హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ (Darshan) తూగుదీప, పవిత్ర గౌడ, ఇతర ఐదుగురికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రేణుక స్వామి హత్య కేసులో నిందితులకు బెయిల్ దొరకడాన్ని ఆధారంగా చేసుకుని మరికొంతమంది భవిష్యత్తులో దారుణాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందన్నది ప్రభుత్వ వాదన. ప్రభుత్వ పిటీషన్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు.. హైకోర్టు తీర్పును సమర్ధించింది.
రేణుకాస్వామి హత్య..
పోలీసుల కథనం మేరకు.. దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన ఆటో డ్రైవర్ రేణుకాస్వామి (Renukaswamy)(33) ఆయన స్నేహితురాలయిన నటి పవిత్ర గౌడ(Pavithra Gowda)కు అసభ్యకర సందేశాలు పంపాడు. ఈ విషయం పవిత్ర దర్శన్‌కు చెప్పడంతో ఆయన పథకం ప్రకారం రేణుకాస్వామిని హత్య చేశారు. సినీనటుడు దర్శన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘ సభ్యుల్లో ఒకరైన రాఘవేంద్ర రేణుకస్వామికి ఫోన్ చేసి ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్డుకు రప్పించాడు. అదే షెడ్డులోనే రేణుకస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న కాలువ దగ్గర రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్యకు పవిత్రే ప్రధాన కారణమని, రేణుకస్వామికి హత్యకు దర్శన్ ఇతర నిందితులను ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్‌లో కనపర్చారు.
దర్శన్‌ను 2024 జూన్ 11న అరెస్టుచేశారు. కర్ణాటక హైకోర్టు 2024 అక్టోబర్ 30న ఆరోగ్య కారణాలతో దర్శన్‌కు ఆరు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ జె.బి. పార్థీవాలా, ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 13న ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేయడానికి ముందు దర్శన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నాడు. అయితే అతను ఇతర జైలు ఖైదీలతో కలిసి ప్రశాంతంగా ఉన్న ఫోటో వైరల్ కావడంతో దర్శన్‌ను బళ్లారి సెంట్రల్ జైలుకు మార్చిన విషయం తెలిసిందే.