తొక్కిసలాటకు ఆర్సీబీ నిర్ణయాలే కారణం: కర్ణాటక ప్రభుత్వం
x
ఆర్సీబీ టైటిల్ గెలిచిన తరువాత చిన్నస్వామి స్టేడియం దగ్గర గుమిగూడిన అభిమానులు

తొక్కిసలాటకు ఆర్సీబీ నిర్ణయాలే కారణం: కర్ణాటక ప్రభుత్వం

హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆరోపించిన ప్రభుత్వం, ఏకఫక్షంగా వ్యవహరించిందని విమర్శలు


ఆర్సీబీ మొదటి సారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తరువాత బెంగళూర్ లో మరుసటి రోజు జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు కీలక నివేదిక సమర్పించింది.

ఈ నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ఆర్సీబీనే ప్రభుత్వం తప్పు పట్టింది. ఏకపక్షంగా పోలీసుల అనుమతి లేకుండా విజయ్ పరేడ్ కు పిలుపునిచ్చిందని పేర్కొంది. నగరంలో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి.

ప్రభుత్వం మొదట నివేదికను గోప్యంగా ఉంచాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది కానీ.. దానికి అంగీకారం రాకపోవడంతో సిద్దరామయ్య సర్కార్ దానిని బయటపెట్టకతప్పలేదు.
సమాచారం మాత్రమే ఇచ్చారు..
జూన్ 3న ఆర్సీబీ యాజమాన్యం విజయోత్సవ పరేడ్ గురించి మాత్రమే పోలీసులకు సమాచారం అందించిందని నివేదిక పేర్కొంది.
‘‘చట్ట ప్రకారం అవసరమైన అనుమతి కోసం ఎలాంటి అభ్యర్థన చేయలేదు. కేవలం సమాచారం మాత్రమే ఇచ్చారు’’ అని నివేదిక పేర్కొంది. ఈవెంట్ కు కనీసం ఏడు రోజుల ముందు అటువంటి అనుమతి తీసుకోవాలని నిబధనలు ఉన్నాయి.
దరఖాస్తుదారుడు నిర్దేశించిన ఫార్మాట్ లో ఎటువంటి దరఖాస్తును అథారిటికి సమర్పించలేదు. అందువల్ల కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పీఐ 03.06. 2025న సాయంత్రం 6.30 నిమిషాలకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చేసిన అభ్యర్థనకు అనుమతి ఇవ్వలేదంది.
పోలీసులను సంప్రదించలేదు..
జూన్ 4న ఉదయం 7.01, నుంచి వరుసగా నాలుగు ట్వీట్లు ఆర్సీబీ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో విజయోత్సవ ర్యాలీ విధాన సౌధ వద్ద ప్రారంభ మయి, చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుందని, ప్రజలకు ఉచిత ప్రవేశం ఉందని, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రకటన జారీ చేసిందని తెలిపింది.
మధ్యాహ్నం 3.14 గంటలకు చేసిన మరో పోస్ట్ లో ‘‘ షాప్. రాయల్ ఛాలెంజర్స్. కామ్’’ లో ఉచిత పాస్ లు కేవలం పరిమితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొందని, కానీ పాస్ ల పంపిణీ గురించి ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
భారీగా తరలివచ్చిన అభిమానులు..
సోషల్ మీడియాలో ఆర్సీబీ పోస్టులకు దాదాపు 44 లక్షలకు పైగా వ్యూస్(వీక్షణలు) వచ్చాయని, ఇదే దాదాపు మూడు లక్షలకు పైచిలుకు అభిమానలు స్టేడియంకి రావడానికి కారణమైందని నివేదికలో ప్రభుత్వం ఆరోపించింది.
చిన్నస్వామి స్టేడియం, చుట్టుపక్కల గుమిగూడిన జనంతో పాటు జట్టు సభ్యులు విమానాశ్రాయం నుంచి తమ హోటల్ కు వెళ్తున్న క్రమంలో వారిని చూసేందుకు ‘హాల్’ విమానాశ్రయం నుంచి తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ వరకూ దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోడ్ల వెంట లక్షలాది మంది ప్రజలు వేచి ఉన్నారు. ఈ జనసమూహాల క్లిప్ లు వైరల్ గా మారడంతో మరికొంతమంది ఆ ప్రదేశాలకు వెళ్లారు.
‘‘రోడ్లపై ఆ ఆకస్మిక జనసమూహం గుమిగూడటం వల్ల స్టేడియం, పరిసర ప్రాంతాలలో అవసరమైన పోలీస్ తో పాటు మార్గంలో పెద్ద సంఖ్యలో పోలీసులను అత్యవసరంగా మొహరించాల్సి వచ్చింది. నిర్వాహకులు సరైన ప్రణాళిక లేకపోవడం, సంబందిత అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడంతో బలగాలు సరైన సమయానికి చేరుకోలేకపోయాయి. ఈ వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగింది’’ అని నివేదిక పేర్కొంది.
తొక్కిసలాటకు కారణం ఏంటీ?
ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో చిన్నస్వామి స్టేడియంలో జనం అకస్మాత్తుగా గుమిగూడారు. చాలా చిన్న స్థలంలో దాదాపు 3 లక్షల మంది ప్రజలు వచ్చారు.
చిన్న స్వామి స్టేడియం కెపాసిటీ కేవలం 35 వేలే అవడంతో పరిస్థితి అదుపు తప్పింది. స్టేడియంలోకి ఎంట్రీ కోసం కేవలం పరిమిత సంఖ్యలో పాస్ లు ఉన్నాయని ఆర్సీబీ ప్రకటించడంతో అప్పటికే అక్కడ వేచి ఉన్న అభిమానుల్లో గందరగోళం, నిరాశ ఏర్పడిందని నివేదిక పేర్కొంది.
అలాగే నిర్వాహకులు సరైన సమయంలో గేట్లు ఓపెన్ చేయడంలో విఫలం అయ్యారని, అలాగే కొంతమంది అభిమానులు 1,2, 21వ నెంబర్ గేట్లు విరగొట్టి స్టేడియం లోపలికి ప్రవేశించడంతో పరిస్థితి దారుణంగా మారినట్లు, దీనికి నిర్వాహకులదే బాధ్యత అని తెలిపింది.
ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగిందని, పోలీసులు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఉద్రిక్తతను తగ్గించారని నివేదిక పేర్కొంది.
వ్యూహాత్మక నిర్ణయం..
స్టేడియంలో విజయోత్సవ వేడుకలను అకస్మాత్తుగా మూసివేయడం వలన జనంలో అసంతృప్తి చెలరేగి హింస జరగవచ్చనే కారణంతో కార్యక్రమాన్ని రద్దు చేయలేదని నివేదిక తెలిపింది. శాంతి భద్రతల దృష్ట్యా ఊహించిన కార్యక్రమాలను రద్దు చేయడం వల్ల జనసమూహం విపరీతంగా రెచ్చగొట్టబడుతుందని, విస్తృతంగా మూక హింసకు దారి తీస్తుందని చెబుతూ నివేదిక ముగించింది.


Read More
Next Story