రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో కేరళలో బీజేపీ బలపడుతుందా?
x

రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో కేరళలో బీజేపీ బలపడుతుందా?

వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలకం నిర్ణయం తీసుకుంది.


బీజేపీ(BJP) అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మాజీ మంత్రి, సాంకేతిక నిపుణుడు రాజీవ్ చంద్రశేఖర్‌(Rajeev Chandrasekhar)ను పార్టీ కేరళ(Kerala) అధ్యక్షుడిగా నియమించింది. 2026లో కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజీవ్ నియామకం ఎన్నికల్లో వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఎవరీ చంద్రశేఖర్..

రాజీవ్ చంద్రశేఖర్ కర్ణాటక నుంచి మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలో సహాయ మంత్రిగా పనిచేశారు. రాజీవ్ కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదని, ఆయనకు వ్యాపారం, మీడియా, టెక్నాలజీ రంగాల్లో మంచి అనుభవం ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

శశిథరూర్‌లో చేతిలో ఓటమి..

2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ నేత శశి థరూర్ చేతిలో 16వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019తో పోలిస్తే ఆయన ప్రచారం వల్ల కాంగ్రెస్ ఓటు శాతం గణనీయంగా తగ్గింది. అదే సమయంలో త్రిస్సూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సురేష్ గోపి గెలుపొందారు. కేరళలో బీజేపీ నుంచి గెలిచిన తొలి ఎంపీ కూడా సురేష్ గోపినే.

చంద్రశేఖరే ఎందుకు?

చంద్రశేఖర్‌ నియామకం వెనక చాలా కారణాలున్నాయి. పట్టణవాసులు, విద్యావంతులు, మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే సత్తా ఉన్న నాయకుడు కావడం, అలాగే బీజేపీ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు కారణంగా అవసరమైన నిధులు, ప్రాజెక్టులను తీసుకురాగలడని చంద్రశేఖర్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ముందున్న అడ్డంకులేంటి?

అట్టడుగు స్థాయిలో పార్టీ కార్యకర్తలతో అనుబంధం లేకపోవడం..

స్థానిక రాజకీయ పరిస్థితులపై అవగాహన లేకపోవడం రాజీవ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

చంద్రశేఖర్‌పై ఉన్న విమర్శలేంటి?

చంద్రశేఖర్ పలు సందర్భాల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కళమశేరి బాంబు పేలుడు ఘటనపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగంలో పెద్ద చర్చకు దారితీశాయి. మైనారిటీలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. చంద్రశేఖర్‌ను "విషపూరితమైన నాయకుడు" అని విమర్శించారు.

కాంగ్రెస్, వామపక్షాలు ఏమంటున్నాయి?

చంద్రశేఖర్ నియామకంపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్నాయి. చంద్రశేఖర్ బీజేపీ భావజాలానికి సరైన వ్యక్తి కాదని, ఆయనకు స్థానిక అనుభవం లేదని కాంగ్రెస్ నేత విడి సతీశన్ అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలే అసలు పరీక్ష..

2025లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు చంద్రశేఖర్ నాయకత్వానికి అసలు అగ్ని పరీక్ష. కేరళలో బీజేపీ దీర్ఘకాలంగా ఆశిస్తున్న బ్రేక్‌థ్రూ చంద్రశేఖర్ వల్ల సాధ్యమవుతుందా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.

Read More
Next Story