
టీకప్ సంకేతమా, యాదృచ్ఛికమా? మాంకూటత్తిల్ కేసులో వేడెక్కిన చర్చ
బాధితుల పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వానికి ఉన్న మానవీయ దృక్పథానికి ప్రతీకగా చెబుతున్న LDF నేతలు..
కాంగ్రెస్(Congress) నేత రాహుల్ మాంకూటత్తిల్(Rahul Mamkootathi)పై నమోదైన లైంగిక దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఈ వ్యవహారంలో.. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సంబంధించిన ఓ ఫోటో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యమంత్రి చేతిలో ఉన్న టీ కప్పుపై కనిపించిన ఓ ఆంగ్ల వాక్యం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఎల్‌డీఎఫ్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆయన చేతిలోని టీ కప్పుపై “Love you to the moon and back” అనే వాక్యం స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ప్రేమను వ్యక్తపరిచే ఈ మాటలు.. రాహుల్ మాంకూటత్తిల్ కేసులో బాధితురాలు చేసిన సోషల్ మీడియా పోస్టులో కూడా కనిపించడంతో ఈ ఫోటో ప్రాధాన్యతను సంతరించుకుంది.
బాధితురాలి పోస్టుతో పోలిక..
రాహుల్ మాంకూటత్తిల్‌పై లైంగిక దాడి(Sexual assault case) ఆరోపణలు చేసిన మహిళ తన ఫేస్‌బుక్ పోస్టులో తీవ్ర భావోద్వేగాలతో తన బాధను వివరించింది. తన జీవితంలో ఎదురైన సంఘటనలు, గర్భస్రావానికి గురైన పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆమె ఇదే వాక్యాన్ని ఉపయోగించింది. అదే మాటలు ముఖ్యమంత్రి కప్పుపై కనిపించడంతో, ఇది యాదృచ్ఛికమా? లేక సంకేతాత్మక మద్దతా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజకీయ వర్గాల్లో చర్చ
ఈ ఫోటో వెలుగులోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఒక వర్గం దీనిని బాధితురాలికి నైతిక మద్దతుగా భావిస్తుండగా.. మరొక వర్గం మాత్రం దీన్ని రాజకీయ ఉద్దేశాలతో కూడిన సంకేత చర్యగా అభివర్ణిస్తోంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ అంశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
రాహుల్ కేసు నేపథ్యం..
రాహుల్ మాంకూటత్తిల్ కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా, విద్యార్థి రాజకీయాల ద్వారా ఎదిగి కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా ఎదిగారు. యువతలో మంచి అనుచరగణాన్ని సంపాదించుకున్న ఆయన, పార్టీ కార్యక్రమాల్లో దూకుడుగా పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందారు.
రాహుల్ మాంకూటత్తిల్ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచేవారు. కాంగ్రెస్ పార్టీ యువ విభాగంలో చురుకైన పాత్ర పోషించిన ఆయన, పార్టీకి చెందిన కార్యక్రమాలు, ఉద్యమాల్లో ముందుండి పాల్గొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇటీవల ఆయనపై నమోదైన లైంగిక దాడి కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుతో ఆయన రాజకీయ జీవితం ఒక్కసారిగా వివాదాల కేంద్రంగా మారింది. తనపై ఒత్తిడి తెచ్చి గర్భస్రావానికి బలవంతం చేశారన్న బాధితురాలి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది.
ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద పరీక్షగా మారింది. ఒక వైపు మహిళా భద్రత, నైతికతపై పార్టీ తీసుకునే వైఖరి ప్రశ్నార్థకంగా మారగా, మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించాయి. పార్టీ నాయకత్వం న్యాయ ప్రక్రియను గౌరవిస్తామని చెబుతున్నా, వివాదం మాత్రం తగ్గడం లేదు.
ప్రతిపక్ష పార్టీలు ఈ కేసును రాజకీయ ఆయుధంగా మార్చుకున్నాయి. మహిళా భద్రతపై కాంగ్రెస్ మాటలు, చర్యల మధ్య వ్యత్యాసం ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కాంగ్రెస్‌కు లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కేసు కేవలం ఒక రాజకీయ నేతకు సంబంధించిన వ్యవహారంగా కాకుండా, మహిళలపై జరిగే వేధింపులు, అధికార దుర్వినియోగం, సంబంధాల్లో నైతికత వంటి అంశాలపై సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. యువ రాజకీయ నేతల ప్రవర్తనపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

