
‘జన నాయకుడు’ విజయ్‌కు రాహుల్‌గాంధీ మద్దతు..
చిత్ర విడుదలను అడ్డుకోవడాన్ని తమిళ సంస్కృతిపై దాడిగా అభివర్ణించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత..
లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తమిళ నటుడు, టీవీకే (Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు మద్దతు పలికారు. విజయ్ నటించిన ‘జన నాయకన్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో చిత్రం విడుదల ఆలస్యమైన విషయం తెలిసిందే. ఇదే విషయంపై కాంగ్రెస్ నేత రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు.
రాహుల్ ట్వీట్..
“ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ ‘జన నాయకన్’(Jana Nayagan) ను అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ముమ్మాటికి తమిళ సంస్కృతిపై దాడి. తమిళ ప్రజల స్వరం నొక్కివేయడంలో మీరు (మోదీ) విజయం సాధించలేరు.” అంటూ మండిపడ్డారు.
ఇంతకు వివాదం ఏమిటి?
సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. కొన్ని సన్నివేశాలు, సంభాషణలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. CBFC సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో చిత్రం విడుదల వాయిదాపడింది. వాటిని తొలగించిన తర్వాత మరోసారి CBFCను ఆశ్రయించారు. అప్పటికి బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తాత్కాలికంగా U/A 16+ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించినా.. CBFC ఆ తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. దీంతో తుది నిర్ణయం వెలువడే వరకు చిత్రం విడుదల వాయిదా పడింది.
రాజకీయాలే కారణమా?
విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి TVK పార్టీ పెట్టడం, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంవల్లే CBFC విజయ్‌ని ఇబ్బందులకు గురిచేస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే టీవీకే, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు CBFC తీరును తప్పుబడుతున్నాయి. తమిళ సంస్కృతి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ తెలంగాణ, తమిళనాడు ఇన్‌చార్జి గిరీష్ చోడంకర్ కూడా కళారంగంలో రాజకీయ జోక్యం తగదని పేర్కొన్న విషయం తెలిసిందే.

