తమిళనాట అసెంబ్లీ ఎన్నికలపై కులగణన ప్రభావం ఉంటుందా?
x

తమిళనాట అసెంబ్లీ ఎన్నికలపై కులగణన ప్రభావం ఉంటుందా?

కేంద్రం నిర్ణయంపై పార్టీలు ఎలా స్పందించాయి. డీఎంకే స్పందనేంటి?


జనగణనతో పాటు కులగణన(Caste Census) కూడా చేపడతామని ఇటీవల కేంద్రం ప్రకటించడంతో.. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఏఐఏడీఎంకే, డీఎంకే, పీఎంకె, తమిళగ వెట్రి కళగం (టీవీకె) తమ స్పందనను తెలియజేశాయి. విద్య, ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్న తమిళనాడులో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషణలు భావిస్తున్నారు.

ఎవరు ఎలా స్పందించారు?

బీజేపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే (AIADMK) ప్రశంసించింది. కేంద్రం నిర్ణయం డీఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకును ఏకం చేసే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది.

ఇక పట్టాళి మక్కల్ కచ్చి(PMK) కులగణన చేపట్టాలని చాలాఏళ్లుగా పోరాటం చేస్తోంది. ఆ పార్టీ నేత అన్భుమణి రామదాస్ కేంద్రం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. సీమాన్ నేతృత్వంలోని నామ తమిళర్ కట్చి (ఎన్టీకె), అలాగే విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం (టీవీకె) లాంటి చిన్న పార్టీలు కూడా కేంద్రం ప్రకటనను పాజిటివ్‌గా తీసుకున్నాయి. కులగణన దృష్ట్యా బీజేపీ సహా ఎన్డీయే మిత్రపక్షాలు 2026 అసెంబ్లీ ఎన్నికల(Elections) ముందు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది.

వ్యతిరేకించని డీఎంకే (DMK) ..

బీజేపీ ప్రత్యర్థి డీఎంకే కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. “ఇది ఇండియా కూటమికి విజయ సూచిక,” అని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పేర్కొన్నారు. అయితే కులగణన ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై స్పష్టత ఇవ్వాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. కులగణన నిర్వహించాలని తమిళనాడు అసెంబ్లీ ఇటీవల తీర్మానం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం నుంచి వచ్చిన ప్రకటనతో దాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది డీఎంకే.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కినా.. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయముంది. కులగణన, జనగణనకు కేంద్ర టైంలైన్ ప్రకటించకపోవడంతో తమిళనాడు రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అంతిమంగా ఏ పార్టీ గెలిచినా, గెలవకపోయినా.. కులగణన నిర్ణయం మాత్రం తమిళనాడులో రిజర్వేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూరుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story