కర్ణాటకలో భారీగా పెరిగిన పెట్రో ధరలు: నిరసనలకు సిద్ధమైన బీజేపీ!
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఎంతమేర పెంచారు? అయితే విపక్షం ఏం చేయబోతుంది? బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయేంద్ర కామెంట్ ఏమిటి?
పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ నెల 17న కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆదివారం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం శనివారం ఇంధనంపై అమ్మకపు పన్నును పెంచింది. పెట్రోలు ధర లీటర్‌కు రూ.3, డీజిల్‌పై రూ.3.50 చొప్పున పెంచారు.
‘‘ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాం. పెంపును రద్దు చేసే వరకు ఊరుకోబోం. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతాం’’ అని విజయేంద్ర పేర్కొన్నారు.
‘‘ఐదు హామీల అమలుకు రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యింది. కొత్త కార్యక్రమాలేవీ ప్రారంభించలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఇంధన ధరలను పెంచారు. ఈ భారం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల మీద పడుతుంది.’’ అని బిజెపి రాష్ట్ర చీఫ్ అన్నారు.
వనరుల సమీకరణే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్ర ఆదాయం, ఆర్థిక స్థితిగతులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికలలో కర్ణాటకలోని 28 సీట్లలో NDA 19, బీజేపీ 17, JD(S) 2 స్థానాలను గెలుచుకోగా, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది.