
అమిత్ షా నివాసంలో ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి భేటీ..
రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగిందన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..
ఏఐఏడీఎంకే(AIADMK) ప్రధాన కార్యదర్శి ఇడప్పాడి కె. పళనిస్వామి (Edappadi K Palaniswami) నిన్న రాత్రి (జనవరి 7) ఢిల్లీలో కేంద్రం హోం మంత్రి అమిత్ షాను తన నివాసంలో కలిశారు. భేటీ అనంతరం ఆయన న్యూఢిల్లీ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడారు. పుదుక్కోట్టైకు వచ్చినపుడు అమిత్ షాను తాను కలుకలేకపోయినందుకు ఇప్పుడు కలవాల్సి వచ్చిందని చెప్పారు. తమిళనాడు(Tamil Nadu)లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరం చర్చించామని చెప్పారు. ఇతర పార్టీలతో పొత్తుల గురించి చర్చ జరగలేదన్నారు. తమిళనాడులో ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడమే తమముందున్న ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకోనని కూడా చెప్పారని పళనిస్వామి తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలలో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని అడిగిన ప్రశ్నకు.. "మా కూటమిలోకి కొన్ని పార్టీలను చేర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. PMK మా కూటమితో జతకడుతుందని ఆశిస్తున్నా. పొత్తుకు ఆ పార్టీ ఒకే చెబితే ఆ విషయం మీతో తప్పకుండా పంచుకుంటా’’ " అని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అధికార DMKని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు.

