
‘మా ప్రధాన ప్రత్యర్థి డీఎంకే’
TVK చీఫ్ విజయ్..
తమిళగ వెట్రి కజగం (TVK) చీఫ్ విజయ్ (విజయ్) ప్రధాని మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మీద తీవ్ర విమర్శలు చేశారు. తమకు 'సైద్ధాంతిక శత్రువు భారతీయ జనతా పార్టీ (BJP) అయితే రాజకీయ శత్రువు ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ' అని అన్నారు. గురువారం (ఆగస్టు 21) మధురైలోని పరపతిలో జరిగిన పార్టీ రెండవ రాష్ట్ర సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యక్ష పోరు డీఎంకే మధ్య టీవీకే మధ్య ఉంటుందని చెప్పారు. తప్పుడు ఎన్నికల వాగ్దనాలతో మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాలను మోసం చేసిన డీఎంకే రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.
తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధానిమోదీ (PM Modi)ని టార్గెట్ చేశారు. "దాదాపు 800లకు పైగా మన మత్స్యకారులపై దాడి జరిగింది. కనీసం ఇప్పుడైనా కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకుని వారికి భద్రత కల్పించగలరా? అని ప్రశ్నించారు.
వివాదాస్పద నీట్ పరీక్షపై మాట్లాడుతూ.. తమిళనాడు విద్యార్థుల పట్ల కేంద్రం చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. "దాని గురించి మాట్లాడటం కూడా నాకు బాధగా ఉంది. నీట్ అవసరం లేదని ప్రకటించండి, మీరు చేస్తారా? " అని ప్రశ్నించారు.
'డీఎంకేకే మా ప్రధాన ప్రత్యర్థి'..
ముఖ్యమంత్రి స్టాలిన్‌ను "మామయ్య" అని సంబోధిస్తూ.. "మీ పాలనలో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో తమకు రక్షణ లేదని మహిళలు వాపోతున్నా..మీ చెవులకు వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతపై దృష్టి సారిస్తామని, యువత, రైతులు, కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. "ఇది కేవలం ఓట్ల గురించి కాదు.. ప్రజా వ్యతిరేక పాలనపై తిరుగుబాటు’’ అని అన్నడంతో వేలాది మంది పార్టీ కార్యకర్తల చప్పట్లతో సభ ప్రాంగణం మారుమోగింది.