తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్,ఈ ఆపరేషన్ ఏందంటే...
x

తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్,ఈ ఆపరేషన్ ఏందంటే...

తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం అయింది.జులైలో తప్పిపోయిన, కిడ్నాప్ అయిన 3076 మంది పిల్లలను పోలీసులు కాపాడి, వారికి పునరావాసం కల్పించారు.ఈ ఆపరేషన్ విశేషాలు..


కేంద్రహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్ అయింది. ప్రతి సంవత్సరం జులై నెలలో తప్పిపోయిన,అక్రమ రవాణా చేసిన పిల్లలను గుర్తించి వారిని రక్షించి, పునరావాసం కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఆపరేషన్ ముస్కాన్ అంటే...
పిల్లల అక్రమ రవాణా,కిడ్నాప్‌ల అరికట్టడం, హాని కలిగించే వారి బారినుంచి పిల్లలను కాపాడి వారిని సురక్షితంగా పునరావాసం కల్పించడం ఆపరేషన్ ముస్కాన్ పథకం లక్ష్యం.
ఎవరు చేపట్టారంటే...
తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ పర్యవేక్షణలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమం జులై 1 నుంచి 31 వతేదీ వరకు పోలీసులు చేపట్టారు. మహిళా పోలీసు భద్రతా విభాగం తెలంగాణలోని 120 సబ్ డివిజనల్ పోలీసు బృందాలకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆపరేషన్ కోసం 676 మంది పోలీసు ఉద్యోగులను నియమించారు.మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, కార్మిక, ఆరోగ్య, శిశు సంక్షేమ కమిటీలు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లు, సంబంధిత జిల్లాల స్వచ్ఛందసంస్థల సమన్వయంతో ఈ బృందాలు ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఉద్యోగులకు శిక్షణ
జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం 2015, బాల కార్మిక (నిషేధం, నియంత్రణ) చట్టం 1986, బాండెడ్ లేబర్ వంటి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు, అమలు చేయాల్సిన చట్టాలపై ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా టీమ్‌లకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్‌స్పాట్‌లలో 27 వేల మంది పౌరులను కవర్ చేస్తూ 527 శిక్షణా సమావేశాలు నిర్వహించారు.

మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్
తప్పిపోయిన పిల్లల జాడను కనుగొనేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ పర్సన్స్ మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సెల్ తప్పిపోయిన పిల్లలను గుర్తించడంలో సహాయపడుతుంది. తప్పిపోయిన వారిని గుర్తించి వారిని కన్నవాళ్లకు చేరుస్తున్నారు. లేదా పిల్లలకు పునరావాస సేవలను అందిస్తున్నారు.

దర్పణ్ ద్వారా తప్పిపోయిన పిల్లల గుర్తింపు
దేశంలో పెద్దలు, పిల్లలలో తప్పిపోయిన వారి జాతీయ సగటు 53శాతం అయితే, వారిలో ట్రాకింగ్ 63.3 శాతంగా ఉంది. తెలంగాణలో తప్పిపోయిన వ్యక్తుల శాతం 88కాగా, 87పిల్లలను గుర్తించారు.దర్పణ్ అని పిలిచే అంతర్గత ముఖ గుర్తింపు అప్లికేషన్ ద్వారా ఎక్కువ మంది తప్పిపోయిన పిల్లలను గుర్తించారు.అధికారుల బృందాలు పారిశ్రామిక యూనిట్లు, ఇటుక బట్టీలు,చట్టవిరుద్ధంగా పిల్లలను నియమించుకునే ప్రాంతాలపై దృష్టి సారించాయి.దర్పణ్ అప్లికేషన్ సాయంతో 495 మంది పిల్లలను గుర్తించారు.ఆపరేషన్ ముస్కాన్ సమయంలో తప్పిపోయిన పిల్లల డేటాబేస్‌లో 4262 మంది పిల్లలున్నారు.

బాలకార్మికుల గుర్తింపు
బాలకార్మికులు, బందిపోటు కార్మికులు, భిక్షాటన, బలవంతపు యాచక రాకెట్లు మొదలైనవాటిలో ఉన్న పిల్లలను రక్షించడానికి ప్రయత్నాలు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన ప్రదేశాలు, ట్రాఫిక్ జంక్షన్లు, మెకానిక్ షాపులు, ఇటుక పరిశ్రమలు,నిర్మాణ స్థలాలు, దుకాణాలు, టీ స్టాల్స్, ఫుట్‌పాత్‌లపై తప్పిపోయిన పిల్లలను గుర్తించారు.

3076 మంది చిన్నారుల రెస్క్యూ
తెలంగాణ రాష్ట్రంలో గత నెలరోజుల్లో 3076 మంది చిన్నారులను రక్షించారు. వారిలో 644 మంది చిన్నారులను సైబరాబాద్ పోలీసు బృందాలు కాపాడాయి. కాపాడిన వారిలో బాలురు 2772 మంది, బాలికలు 304 మంది ఉన్నారని పోలీసులు చెప్పారు. నేపాల్ దేశంతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 934 మంది పిల్లల్ని కాపాడారు. వారిలో బాలురు 894 మంది, బాలికలు 40మంది ఉన్నారు. 47 మంది వీధి పిల్లలు,115 మంది భిక్షగాళ్లు, 2510 మంది బాలకార్మికులు,ఇటుక బట్టీల్లో 33 మంది పిల్లలను కాపాడారు.

నిందితులపై 637 కేసులు
పిల్లలను అక్రమంగా తీసుకువచ్చిన 639 మంది నిందితులపై వివిధ సెక్షన్ల కింద 637 కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో 767 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు.మరో 459 మంది పిల్లలకు సురక్షితంగా పునరావాసం కల్పించారు.బాండెడ్ బాల కార్మికులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున పరిహార ప్యాకేజీలను అందించారు.తప్పిపోయిన వారిలో బాలురు 2582 మంది, బాలికలు 274మందిని తల్లిదండ్రులు,సంరక్షకుల చెంతకు చేర్చామని పోలీసులు వివరించారు. మరో 220 మంది పిల్లలను రెస్క్యూ హోమ్‌లకు తరలించారు.281 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు.


Read More
Next Story