కర్ణాటకలో అక్కడికి వెళ్లాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
x

కర్ణాటకలో అక్కడికి వెళ్లాలంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

తమిళనాడు విధానాన్ని ఇప్పుడు కర్ణాటక అనుసరిస్తుంది. పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు రెండు రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.


తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్‌ పర్యాటకులకు అక్కడి ప్రభుత్వం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే విధానాన్ని కర్ణాటక సర్కారు అమలు చేయబోతుంది. చిక్కమగళూరుకు 20 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన శిఖరం ముల్లయనగిరి ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను తిలకించాలనుకునే పర్యాటకులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. ఇకపై రోజుకు 600 వాహనాలను మాత్రమే హిల్ స్టేషన్‌కు అనుమతిస్తారు.

ముఖ్యంగా వారాంతాల్లో లక్షల మంది పర్యాటకులు కొండపైకి వస్తుండటంతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. పర్యావరణం కూడా దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు గళం విప్పారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తేవడం వల్ల ఈ రెండింటికి కట్టడి చేయవచ్చని వారి అభిప్రాయంతో ఏకీభవించిన కర్ణాటక సర్కారు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హిల్ స్టేషన్‌కు వెళ్లే 4 చక్రాల వాహనాలు, 3 చక్రాల వాహనాలు, పెద్ద వాహనాలకు వేర్వేరుగా మొత్తాలు వసూలు చేయనున్నట్లు కలెక్టర్ మీనా నాగరాజ్ తెలిపారు. వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న వారికి, చిక్కమగళూరుకు వెళ్లే మార్గంలో వివిధ ప్రాంతాలలో క్యూఆర్ కోడ్ జారీ చేస్తారని చెప్పారు.

తమిళనాడుతో మొదలు..

తమిళనాడులోని కొడైకెనాల్, ఊటీ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో వస్తుంటారు. వేసవి సెలవుల్లోయితే పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ. పర్యావరణ పరిరక్షణపై ఇటీవల దాఖలయిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారించింది. ఒకే సమయంలో అన్ని వాహనాలు కొండ ప్రాంతాలకు వెళ్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. జంతువులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వాదనలతో అంగీకరించిన కోర్టు పర్యాటకుల సంఖ్యను నియంత్రించేందుకు ఈ-పాస్ విధానాన్నిఅమలు చేయాలని నీలగిరి, దిండిగుల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

Read More
Next Story