ఉచిత విద్యుత్ కాదు... పెట్టుబడి సాయం కావాలి!
x
పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

ఉచిత విద్యుత్ కాదు... పెట్టుబడి సాయం కావాలి!

నేతన్నల ఇండ్లలో ‘బల్బు-ఫ్యాన్’ మాత్రమే... ఉచితం ఒక బొట్టు నీరు అంటున్నారు విశ్లేషకులు.


ఏపీలో చేనేత కుటుంబాలకు ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకం ప్రభుత్వం ‘జీవితాలు మార్చే’ బహుమతిగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ నేతన్నలు, చేనేత సంఘాలు దీన్ని “దప్పికతో చనిపోతున్న వారికి ఒక బొట్టు నీరు ఇచ్చినట్లు” అంటున్నారు. వారి ఇండ్లలో సాధారణంగా ఒక బల్బు, ఒక ఫ్యాను మాత్రమే ఉంటాయని, వీటి వినియోగం వల్ల 100 నుంచి 150 యూనిట్లకు మించి విద్యుత్ వాడకం జరగదని నేతన్నలు స్పష్టం చేస్తున్నారు.

“మేము మొదటి నుంచీ కోరుకుంటున్నది ఉచిత విద్యుత్ కాదు... పెట్టుబడి సాయం” అని నేతన్నలు ఒక్క స్వరంగా అంటున్నారు. నేతకు కావాల్సిన మెటీరియల్ కొనుగోలుపై ప్రభుత్వం జీఎస్టీ విధిస్తోందని, దాన్ని వెంటనే రద్దు చేయాలని చేనేత సంఘాలు చాలా కాలంగా కోరుతున్నాయి. గతంలో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసే వారికి 20 శాతం సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా పూర్తిగా రద్దయింది. స్కూలు పిల్లలు, హాస్టల్ విద్యార్థులు, ప్రభుత్వ ఆఫీసుల అవసరాల కోసం గతంలో ప్రభుత్వం నేత వస్త్రాలు భారీగా కొనుగోలు చేసేది. ఇప్పుడు ఆ విధానం పూర్తిగా ఆగిపోయింది.


చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర

“ఈ అన్ని సౌకర్యాలు పునరుద్ధరించి, పవర్‌లూమ్‌లను పక్కన పెట్టి సాంప్రదాయ చేనేతలను ప్రత్యేకంగా చూడాలి” అని నేతన్నలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉచిత విద్యుత్ పథకం వల్ల తమకు నిజమైన ఉపయోగం లేదని, పెట్టుబడి సాయం, మార్కెట్ సపోర్టు, సబ్సిడీలు మాత్రమే రంగాన్ని కాపాడగలవని వారు హెచ్చరిస్తున్నారు.

చేనేత రంగం ఇప్పటికే సంక్షేమ, సబ్సిడీల చక్రంలో చిక్కుకుని ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉచిత విద్యుత్ ఒక్కటి వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గినా, ఆదాయం పెరగడానికి అది చాలదని వారు చెబుతున్నారు. నేతన్నలు గౌరవప్రదంగా జీవించాలంటే ఉచితాల బాట మించి పెట్టుబడి, మార్కెట్ లింకేజీ, జీఎస్టీ మినహాయింపు, ప్రభుత్వ కొనుగోళ్లు వంటి శాశ్వత చర్యలు అవసరమని రంగ నిపుణులు సూచిస్తున్నారు.

ఏప్రిల్ 1 నుంచి మొదలయిన ఉచిత విద్యుత్ పథకం నేతన్నల జేబులో కొంత ఆదా చేస్తుంది కానీ, వారి నిజమైన సమస్యలకు పరిష్కారం కాదని చేనేత సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. “పెట్టుబడి సాయం ఇచ్చి మా ఉపాధిని కాపాడండి” అని నేతన్నల కోరిక ఇప్పుడు ప్రభుత్వం ముందు పెద్ద ప్రశ్నగా మారింది.

జాతీయ చేనేత సెన్సస్ ప్రకారం ఏపీలో దాదాపు 1.27 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఇప్పటికే పవర్‌లూమ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉచిత విద్యుత్ పథకంలో పవర్‌లూమ్ నేతన్నలకు 500 యూనిట్లు ఇవ్వడం వల్ల సాంప్రదాయ మగ్గాలు మరింత వెనకబడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్ నేతన్నలకు 500 యూనిట్లు ఉచితం. నెలకు రూ.720 నుంచి రూ.1,800 వరకు ఆదా అవుతుందని అంచనా. కానీ రంగ నిపుణులు, చేనేత సంఘాలు, నేతన్నలు దీన్ని “దప్పికతో చనిపోతున్న వారికి ఒక బొట్టు నీరు ఇచ్చినట్లు” అంటున్నారు. ఉచిత విద్యుత్ కంటే పెట్టుబడి సాయం, జీఎస్టీ రద్దు, సబ్సిడీ పునరుద్ధరణ, ప్రభుత్వ కొనుగోళ్లు నిజమైన కోరికలని వారు స్పష్టం చేస్తున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

డాక్టర్ డి. నరసింహారెడ్డి, చేనేత రంగ నిపుణులు

“ఏడాదికి రూ.25 వేలు పెట్టుబడి సాయం అంటే సరిపోదు. కనీసం రూ. 2.40 లక్షల సాయం కావాలి. అది రుణం రూపంలో ఇచ్చినా మంచిదే. ఒక పట్టుచీర నేయడానికి కనీసం 15 రోజులు పడుతుంది. అందుకు అయ్యే ఖర్చు వేలల్లో ఉంటుంది. ఆ తరహా చీరల నేతకు ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించాలి” అని సూచించారు. ప్రస్తుత తరం నేతన్నలు కనీసం 20 ఏళ్ల వరకు ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతారని, “ఈ తరాన్నైనా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని ఆయన పేర్కొన్నారు. “పవర్‌లూమ్‌లతో ముడిపెట్టి వారికి ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల చేనేతలకు నిజమైన ఉపయోగం ఏమిటి?” అని ఆయన ప్రశ్నించారు.

బీరక సురేంద్ర, చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్.

చేనేత రంగం సమస్య విద్యుత్ బిల్లు మాత్రమే కాదు. మార్కెట్ లేకపోవడం, ఆధునిక డిజైన్ లేకపోవడం, యంత్రాల పోటీ, యువత ఈ రంగం వదిలి వెళ్లిపోవడం మూల సమస్యలు. క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇవి ఎంత త్వరగా ఫలితాలు ఇస్తాయి? ఎగుమతులు, బ్రాండింగ్, ఈ-కామర్స్ లింకేజీలు లేకుండా సబ్సిడీలు, ఉచితాలు మాత్రమే దీర్ఘకాలం కాపాడవు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ను పూర్తిగా చేనేతలకు ఖర్చు చేయాలి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తే తప్ప ఈ రంగం బతికే అవకాశం లేదు.

పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత కార్మిక వర్గ నాయకుడు.

నేతన్నలు గౌరవప్రదంగా జీవించాలంటే సంక్షేమం కాకుండా ఉత్పాదకత, పెట్టుబడి, మార్కెట్ సపోర్టు అవసరం. ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఉచిత విద్యుత్ పథకం నేతన్నలకు ఉపయోగమే. కానీ వారి జీవితాలు నిజంగా మారాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. 11 రకాల సబ్సిడీలు అమలు చేయాలి.

Read More
Next Story